మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన కడియం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను సోమవారం శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రవేశపెట్టారు. ఉదయం 11.35 గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో అన్నివిధాలా దోపిడీకి గురైన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. దగాపడ్డ రైతన్నలకు మేలు చేకూర్చేందుకు సాగునీటి ప్రాజెక్టులకు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, టీహబ్ తదితరాలకు భారీగా నిధులు కేటాయించడం హర్షణీయం. ఈ ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం గర్వకారణం’’ అన్నారు.
కడియం ప్రసంగిస్తుండగా అధికార పక్ష సభ్యులు చప్పట్లతో హర్షం వెలిబుచ్చారు. ఆయన ప్రసంగం పూర్తవగానే సభను 16వ తేదీకి మండలి చైర్మన్ స్వామిగౌడ్ వాయిదా వేశారు.