State annual budget
-
అయ్యో..ఓయూ..
⇒ఓయూలో నిధుల కోసం మల్లాగుల్లాలు ⇒ప్రణాళికలు బారెడు... నిధుల కేటాయింపు మూరెడు ⇒శతాబ్ది ఉత్సవాలకు కేటాయించిన నిధులు అంతంత మాత్రమే తార్నాక: ఉస్మానియా విశ్వవిద్యాలయం వందేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఉత్సవాలను ప్రపంచ కీర్తిని గడించేలా నిర్వహించాలనుకున్న అధికారుల ఆశలపై నిధుల కేటాయింపు నీళ్లు చల్లింది. ఎన్నో ఆశలతో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందించిన అధికారుల ఆశలు అడియాశలయ్యేలా ఉన్నాయి. కోట్ల రూపాయల అంచనాలతో అధికారులు ప్రణాళికలు సిద్దం చేయగా, ప్రభుత్వం కేటాయించిన నిధులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. దాదాపు రూ.416 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి ఓయూ అధికారులు నివేదించగా, ఈ వార్షిక బడ్జెట్లో కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులకు ,అంచనా వ్యయానికి పొంతనలేకుండా పోవడంతో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల విషయమై ఓయూ అధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారు. ఈ నిధులు ఏ మూలకూ సరిపోవంటున్నారు. ముఖ్యంగా ఓయూలో విద్యార్థుల హాస్టళ్ల పరిస్థితి దీనాతిదీనంగా ఉంది. కనీసం తొలి దశలో హాస్టళ్ల ఆధునీకరణకు శ్రీకారం చుడితే బాగుంటుందంటున్నారు. అంచనా వ్యయం రూ.416కోట్లు.. ఇచ్చింది రూ.200 కోట్లు... శతాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని, ఈ సందర్బంగా స్థిరంగా గుర్తుండేలా ఉండేందుకు గాను పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలుచేపట్టాలని ఓయూ అధికారులు నిర్ణయించారు. అందుకు రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు మూడు నెలల ముందుగానే వివిధ రకాలుగా తాము చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు.ఈ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.416 కోట్లు అంచనా వ్యయంగా నివేదిక అందజేశారు. అంచనా ఇలా.. ఓయూలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను రెండు విధాలుగా రూపొందించారు. అందులో ఒకటి మౌళిక సదుపాయాల కల్పన అంశం కాగా, రెండవది వర్సిటీలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు వాటికి కేటాయించిన అంచానా విలువలు ఇలా ఉన్నాయి.. రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో.. అయితే వచ్చే నెలలో ప్రారంభం కానున్న శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్త్రపతి హాజరు అవుతున్న నేపథ్యంలో ఆయన స్థాయికి తగ్గట్టుగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అత్యవసరంగా రూ.20 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. ఈ నిధులతో ప్రారంభ కార్యక్రమాలను గట్టెక్కించే దిశగా అధికారులు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. శతాబ్ది ఉత్సవాల నిధుల వినియోగంపై ప్రత్యేక అధికారి..? ఓయూ శతాబ్ది ఉత్సవాల నిర్వహణ కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులను ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ఓయూకు ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిసింది. కేటాయించిన నిధులను సదరు అధికారి పర్యవేక్షణలోనే ఖర్చు చేయాల్సి ఉంటుందని పలువురు సీనియర్ అధ్యాపకులు పేర్కొంటున్నారు.ఈ నిధులతోని ప్రతి రూపాయికి అధికారులు లెక్క చూపాల్సి ఉంటుందంటున్నారు. కాగా ఈ విషయమై ఓయూ అ«ధికారులను సంప్రదించగా, దీనిపై స్పష్టత ఇవ్వడంలేదు. -
నేడు ఏపీ బడ్జెట్
సాక్షి, అమరావతి: రూ. 1,56,990 కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్(2017–18)ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం ఉదయం 10.25కు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మంగళవారం వెలగపూడిలో తాత్కాలిక అసెంబ్లీలోని తన కార్యాలయంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిర్వహించిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భూమా నాగిరెడ్డి మృతి కారణంగా 13న సభ జరక్కపోవడం, 14న ఆయన మృతికి సంతాప తీర్మానం, దానిపై చర్చ తర్వాత సభ వాయిదా పడిన నేపథ్యంలో 30, 31 తేదీల్లోనూ సభ జరపాలని తీర్మానించారు. నేడు మంత్రివర్గ సమావేశం మరోవైపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్‌ను ఆమోదించడం కోసం బుధవారం ఉదయం రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం కానుంది. -
మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన కడియం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను సోమవారం శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రవేశపెట్టారు. ఉదయం 11.35 గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో అన్నివిధాలా దోపిడీకి గురైన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. దగాపడ్డ రైతన్నలకు మేలు చేకూర్చేందుకు సాగునీటి ప్రాజెక్టులకు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, టీహబ్ తదితరాలకు భారీగా నిధులు కేటాయించడం హర్షణీయం. ఈ ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం గర్వకారణం’’ అన్నారు. కడియం ప్రసంగిస్తుండగా అధికార పక్ష సభ్యులు చప్పట్లతో హర్షం వెలిబుచ్చారు. ఆయన ప్రసంగం పూర్తవగానే సభను 16వ తేదీకి మండలి చైర్మన్ స్వామిగౌడ్ వాయిదా వేశారు. -
రేపట్నుంచి బడ్జెట్‌పై సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్ తయారీలో కొత్త పంథాను అనుసరిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ఈ కసరత్తులో పాలు పంచుకుంటున్నారు. శనివారం నుంచి ఆయన శాఖల వారీగా బడ్జెట్‌పై సమీక్ష జరుపనున్నారు. శాఖల ప్రతిపాదనలను పరిశీలించి సంబంధిత కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో ముఖ్యమంత్రి చర్చిస్తారు. వరుసగా రెండు, మూడు రోజులు ఈ సమావేశాలు నిర్వహించి ఈ కసరత్తు పూర్తి చేసే అవకాశాలున్నాయి. సమీక్షలు ముగిసిన వెంటనే వచ్చే బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయిస్తారనేది సంబంధిత శాఖలకు వెల్లడిస్తారు. బడ్జెట్లో తమకు నిర్దేశించిన నిధుల ఆధారంగా సంబంధిత శాఖలు జిల్లాలవారీగా బడ్జెట్ ముసాయిదాలు సిద్ధం చేస్తాయి. రేపే ఈటల ఢిల్లీ పర్యటన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో శనివారం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర శనివారం ఉదయం ఢిల్లీకి వెళుతున్నారు. -
‘బడ్జెట్’లో సంక్షేమానికి కోత వద్దు: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: రాబోయే రాష్ట్ర వార్షిక బడ్జెట్లో సంక్షేమానికి కోతలు విధించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం సూచించింది. వచ్చే బడ్జెట్లో సంక్షేమ తరగతులకు తగిన నిధులు కేటాయించాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడుతామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లోని ఎంబీభవన్‌లో రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.సాగర్ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌కు వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు వస్తున్న సందర్భంలో గత ఏడాది బడ్జెట్ కంటే అదనపు ప్రతిపాదనలు చేయవద్దని ఆర్థికమంత్రి చెప్పినట్లు వార్తలొచ్చాయన్నారు. సామాజిక తరగతుల సంక్షేమంపై కనీసం ప్రతిపాదనలు కూడా చేయడానికి అవకాశాలు లేకపోవడం శోచనీయమన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదని, అయితే వీటికి నిధుల పేరుతో సంక్షేమ రంగానికి కోతలు విధిస్తే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న సంక్షేమ తరగతులు తీవ్రంగా నష్టపోతాయన్నారు. ఈ సమావేశంలో పార్టీనాయకులు బి.వెంకట్, టి.జ్యోతి, డీజీ నరసింహారావు, ఎం.సాయిబాబు, జె.వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.