‘బడ్జెట్’లో సంక్షేమానికి కోత వద్దు: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: రాబోయే రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో సంక్షేమానికి కోతలు విధించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం సూచించింది. వచ్చే బడ్జెట్‌లో సంక్షేమ తరగతులకు తగిన నిధులు కేటాయించాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడుతామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లోని ఎంబీభవన్‌లో రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.సాగర్ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌కు వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు వస్తున్న సందర్భంలో గత ఏడాది బడ్జెట్ కంటే అదనపు ప్రతిపాదనలు చేయవద్దని ఆర్థికమంత్రి చెప్పినట్లు వార్తలొచ్చాయన్నారు.
సామాజిక తరగతుల సంక్షేమంపై కనీసం ప్రతిపాదనలు కూడా చేయడానికి అవకాశాలు లేకపోవడం శోచనీయమన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదని, అయితే వీటికి నిధుల పేరుతో సంక్షేమ రంగానికి కోతలు విధిస్తే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న సంక్షేమ తరగతులు తీవ్రంగా నష్టపోతాయన్నారు. ఈ సమావేశంలో పార్టీనాయకులు బి.వెంకట్, టి.జ్యోతి, డీజీ నరసింహారావు, ఎం.సాయిబాబు, జె.వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.