
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాల్లో జరుగుతున్న వ్యభిచార దందా, అకృత్యాలపై సమగ్ర విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. వీటికి కారణమైన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు బుధవారం ఆయన లేఖ రాశారు. యాదాద్రిలో వెలుగుచూస్తున్న విషయాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని.. చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టి, వ్యభిచార కేంద్రాలకు అమ్మడం, వారికి పశువులకు వాడే ఇంజెక్షన్లు ఇవ్వడం చాలా దారుణమని పేర్కొన్నారు.
పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే పోలీసులు, ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. యాదగిరిగుట్టలో సుమారు 100కు పైగా కుటుంబాలు వ్యభిచార వృత్తిలో ఉన్నాయని వెల్లడించారు. వ్యభిచార గృహాల నిర్వాహకులకు రాజకీయ నేతల అండదండలుండటం, పోలీసులకు ప్రతీ నెలా మామూళ్లు అందుతుండటంతోనే ఈ అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయని తమ్మినేని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment