లఫంగులు రాజకీయాల్లోకి వస్తున్నారు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
అశ్వారావుపేట/ అశ్వారావుపేట రూరల్/ దమ్మపేట: ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు బాగాలేవని, ఇతర పార్టీల్లో గెలిచిన వారిని తార్చి, తమ పార్టీకి మార్చుకు న్నారని(కేసీఆర్‌నుద్దేశించి), లుచ్ఛాలు, లఫంగులు రాజకీయాల్లోకి వస్తున్నా రని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గతంలో వాడితో, వీడితో కలిసి తామూ చెడిపోయామని, ఇక నుంచి ఇతర రాజకీయ పార్టీలతో కలవకుండా తెలంగాణ కోసం పాటుపడే ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలతోనే కలిసి ప్రయాణిస్తామని చెప్పారు. మహాజన పాదయాత్ర 109వ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట చేరుకున్న సందర్భంగా గురువారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వాస్తు పేరుతో మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నివసించిన సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూల్చి రూ.50 కోట్లతో 150 గదులతో ఇల్లు కట్టించుకుంటున్నారని, చివరకు బాత్ రూంకు కూడా బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాటు చేస్తున్నారంటే.. ‘ఈ బక్క ప్రాణిని ఎవరు చంపుతారని’ అని ఎద్దేవా చేశారు.
కామ్రేడ్‌కు కూలీ గోరుముద్దలు!
తమ్మినేని వీరభద్రంకు గురువారం ఓ వ్యవసాయ కూలీ యువతి గోరుముద్దలు తినిపించింది. పోకలగూడెం–పెన్నడవారిమకాం సమీపంలో ఓ రైతు పొలంలో కూలీ పనులు చేస్తున్న శిరీష అనే యువతి పరుగున వచ్చి తన భోజనాన్ని ఆయనకు తినిపించింది. అందులో ఉన్న ఆవకాయ పచ్చడితోనే తమ్మినేని భోజనం చేశారు. అంతకుముందు దమ్మపేట మండలం అంకంపాలెం బాలికల ఆశ్రమ పాఠశాల, గురుకుల పాఠశాల విద్యార్థులతో తమ్మినేని మాట్లాడారు. అందరికీ సమాన విద్య అందించాలనీ, డబ్బుతో కూడిన చదువు వద్దనేదే తమ నినాదమన్నారు.