
చుంచుపల్లి (కొత్తగూడెం): మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా నిలిచిన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు ఇప్పుడు తమ స్వార్థం కోసం, ప్రజల ఆలోచనలను మరల్చడానికి బీజేపీని తిడుతున్నట్లు నటిస్తూ కొత్త డ్రామాకు తెర లేపారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఎన్నికల వాగ్దానాలను విస్మరించిన వీరికి ప్రజా క్షేత్రంలో భంగపాటు తప్పదని హెచ్చరించారు. ఏప్రిల్ 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో జరగనున్న సీపీఎం అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని చేపట్టిన బస్సు యాత్ర గురువారం కొత్తగూడెంకు చేరింది.
ఈ సందర్భంగా జరిగిన సభలో తమ్మినేని మాట్లాడారు. ప్రధాని మోదీ హత్యా రాజకీయాలను పురిగొల్పుతూ దేశంలోని మేధావులను హతమార్చే సంస్కారాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రా న్ని మార్చేందుకు హైదరాబాద్ మహాసభల నుంచే నాంది పలుకుతామన్నారు. సభలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జాన్‌వెస్లీ, కాసాని అయిలయ్య, సాంబశివ తదితరులు పాల్గొన్నారు.