కేజీ టు పీజీకి మొండిచేయి | TRS govt's poll promise of 'KG to PG free education | Sakshi
Sakshi News home page

కేజీ టు పీజీకి మొండిచేయి

Published Tue, Mar 15 2016 1:54 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

కేజీ టు పీజీకి మొండిచేయి

కేజీ టు పీజీకి మొండిచేయి

* బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించని సర్కారు
* విద్యాశాఖ అదనంగా రూ.500 కోట్లు అడిగితే ఇచ్చిందేమీ లేదు
* పాఠశాల విద్యకు తగ్గిన కేటాయింపు
* విద్యాశాఖకు మొత్తంగా రూ.10,738.62 కోట్లు
* గతేడాది కంటే 477.47 కోట్ల తగ్గింపు

సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలనుకుంటున్న ప్రతిష్టాత్మక కేజీ టు పీజీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపింది. బడ్జెట్‌లో దీనికి ప్రత్యేకంగా పైసా కూడా కేటాయించలేదు.

దీంతో రాష్ట్రంలోని అన్ని గురుకులాలను ఒకే సొసైటీ పరిధిలోకి తీసుకు వచ్చి కేజీ టు పీజీ పథకాన్ని ప్రారంభించాలని భావిస్తున్న విద్యాశాఖకు నిరాశ ఎదురైంది. 2015-16 బడ్జెట్‌లో గురుకులాల నిర్వహణ కోసం గురుకుల విద్యాలయాల సొసైటీకి రూ.76.64 కోట్లు కేటాయించిన ఆర్థిక శాఖ.. ఈసారి గురుకులాల నిర్వహణతోపాటు కేజీ టు పీజీని కూడా పేర్కొంటూ రూ.73.84 కోట్లు కేటాయించింది. విద్యాశాఖ కేజీ టు పీజీ కింద 120 కొత్త గురుకులాలను ప్రారంభిస్తామని, వాటికి రూ.500 కోట్లు కావాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం వివిధ సొసైటీల పరిధిలోని 668 గురుకుల పాఠశాలలు, 391 కస్తూర్భాగాంధీ బాలిక విద్యాలయాలు ఉండగా మైనారిటీల కోసం 70 గురుకులాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది.

వాటితోపాటు మరో 120 గురుకులాలను కొత్తగా నిర్మిస్తే (గతంలో మోడల్ స్కూల్స్ ఫేజ్-2 కింద స్థలాలు గుర్తించినవి) కేజీ టు పీజీలో భాగంగా నియోజకవర్గానికి 10కి పైగా గురుకులాలను కేజీ టు పీజీ స్కూళ్లుగా కొనసాగించవచ్చని విద్యాశాఖ భావించింది. ఇందులో భాగంగానే ఒక్కో దానికి రూ.4 కోట్ల చొప్పున దాదాపు రూ.500 కోట్లు కావాలని ఆర్థిక శాఖకు బడ్జెట్ ప్రతిపాదనలు పంపించింది. కానీ బడ్జెట్‌లో ఆ మొత్తాన్ని కేటాయించకపోగా.. అత్తెసరు కేటాయింపులతోనే అన్నింటిని (గురుకులాలు, కేజీ టు పీజీ) చూసుకోవాలని పేర్కొన్నారు.
 
14 వేల కోట్లకు పైగా అడిగితే..!
రాష్ట్రంలో ఒక్క పాఠశాల విద్యాశాఖకే రూ.14 వేల కోట్లకు పైగా నిధులు కావాలని విద్యాశాఖ ప్రతిపాదిస్తే వాటిని ఆర్థిక శాఖ పక్కనపెట్టేసింది. కేవలం రూ.8,574 కోట్ల కేటాయింపులతో సరిపెట్టింది. ఖర్చులు, నిర్వహణ వ్యయం పెరిగినందున ప్రణాళికేతర వ్యయం కింద రూ.10,533 కోట్లు అవసరమని ప్రతిపాదించినా పట్టించుకోలేదు.
 
ప్రణాళికేతర పద్దులో భారీగా కోత
పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.11,216.09 కోట్ల బడ్జెట్ కేటాయించగా, ఈసారి దానిని రూ.10,738.62 కోట్లకు తగ్గించారు. ముఖ్యంగా ప్రణాళికేతర పద్దులో ప్రభుత్వం భారీగా కోత విధించింది. గతేడాది ప్రణాకేతర పద్దు కింద రూ.7,976.43 కోట్లు చూపగా.. ఈసారి రూ.7,290.94 కోట్లు కేటాయించింది. రూ.685.49 కోట్ల మేర కోత పెట్టింది. పాఠశాల విద్యాశాఖ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం 2015-16 బడ్జెట్‌లో కరువు భత్యం (డీఏ) కింద రూ.1,250 కోట్లు ప్రతిపాదించగా సవరించిన అంచనాల మేరకు రూ.550 కోట్ల వరకు వెచ్చించింది.

దీంతో ఆ సవరించిన అంచనాల ప్రకారం ఈసారి (2016-17) నాన్‌ప్లాన్ బడ్జెట్‌లో ఆ మేరకు కేటాయింపులు తగ్గించి, డీఏ కింద రూ.500 కోట్ల మేర కేటాయించారు. ఇక 2014-15 సంవత్సరంలో ప్రణాళిక వ్యయం కింద పాఠశాల విద్యకు రూ.3,510.56 కోట్లు కేటాయించగా.. 2015-16 సంవత్సరంలో రూ. 1,078.06 కోట్లకు తగ్గించింది. ఈసారి కాస్త పెంచి రూ.1,283.69 కోట్లకు పెంచింది. అయితే విద్యాశాఖ అడిగిన మొత్తంతో ( రూ. 3,591 కోట్లు) పోల్చితే 40 శాతం కూడా ఇవ్వలేదు.
 
ఎస్‌ఎస్‌ఏకు పెరిగిన కేటాయింపులు
కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాల్లో రాష్ట్ర వాటా పెరగడంతో కిందటేడాది కేటాయింపుల కంటే ఈసారి 205.63 కోట్లు అదనంగా కేటాయించారు. అదీ ఎక్కువ మొత్తం సర్వ శిక్షా అభియాన్‌కే పెంచారు. రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌కు నిధులను తగ్గించారు. మరోవైపు మధ్యాహ్న భోజనం, కంప్యూటర్ విద్య తదితర పథకాల్లో గతంలో కొన్నింటిలో కేంద్ర రాష్ట్ర వాటా 65:35, 70:30, 75:25గా ఉండేది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రం అన్నింటికి 60 శాతమే ఇస్తామని, రాష్ట్రాలు 40 శాతం నిధులను వెచ్చించాల్సిందేనని స్పష్టం చేయడంతో ప్రణాళిక వ్యయం కింద ఎస్‌ఎస్‌ఏకు నిధుల కేటాయింపును పెంచింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement