KG to PG scheme
-
కేజీ టు పీజీకి మొండిచేయి
* బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించని సర్కారు * విద్యాశాఖ అదనంగా రూ.500 కోట్లు అడిగితే ఇచ్చిందేమీ లేదు * పాఠశాల విద్యకు తగ్గిన కేటాయింపు * విద్యాశాఖకు మొత్తంగా రూ.10,738.62 కోట్లు * గతేడాది కంటే 477.47 కోట్ల తగ్గింపు సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలనుకుంటున్న ప్రతిష్టాత్మక కేజీ టు పీజీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపింది. బడ్జెట్లో దీనికి ప్రత్యేకంగా పైసా కూడా కేటాయించలేదు. దీంతో రాష్ట్రంలోని అన్ని గురుకులాలను ఒకే సొసైటీ పరిధిలోకి తీసుకు వచ్చి కేజీ టు పీజీ పథకాన్ని ప్రారంభించాలని భావిస్తున్న విద్యాశాఖకు నిరాశ ఎదురైంది. 2015-16 బడ్జెట్లో గురుకులాల నిర్వహణ కోసం గురుకుల విద్యాలయాల సొసైటీకి రూ.76.64 కోట్లు కేటాయించిన ఆర్థిక శాఖ.. ఈసారి గురుకులాల నిర్వహణతోపాటు కేజీ టు పీజీని కూడా పేర్కొంటూ రూ.73.84 కోట్లు కేటాయించింది. విద్యాశాఖ కేజీ టు పీజీ కింద 120 కొత్త గురుకులాలను ప్రారంభిస్తామని, వాటికి రూ.500 కోట్లు కావాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం వివిధ సొసైటీల పరిధిలోని 668 గురుకుల పాఠశాలలు, 391 కస్తూర్భాగాంధీ బాలిక విద్యాలయాలు ఉండగా మైనారిటీల కోసం 70 గురుకులాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. వాటితోపాటు మరో 120 గురుకులాలను కొత్తగా నిర్మిస్తే (గతంలో మోడల్ స్కూల్స్ ఫేజ్-2 కింద స్థలాలు గుర్తించినవి) కేజీ టు పీజీలో భాగంగా నియోజకవర్గానికి 10కి పైగా గురుకులాలను కేజీ టు పీజీ స్కూళ్లుగా కొనసాగించవచ్చని విద్యాశాఖ భావించింది. ఇందులో భాగంగానే ఒక్కో దానికి రూ.4 కోట్ల చొప్పున దాదాపు రూ.500 కోట్లు కావాలని ఆర్థిక శాఖకు బడ్జెట్ ప్రతిపాదనలు పంపించింది. కానీ బడ్జెట్లో ఆ మొత్తాన్ని కేటాయించకపోగా.. అత్తెసరు కేటాయింపులతోనే అన్నింటిని (గురుకులాలు, కేజీ టు పీజీ) చూసుకోవాలని పేర్కొన్నారు. 14 వేల కోట్లకు పైగా అడిగితే..! రాష్ట్రంలో ఒక్క పాఠశాల విద్యాశాఖకే రూ.14 వేల కోట్లకు పైగా నిధులు కావాలని విద్యాశాఖ ప్రతిపాదిస్తే వాటిని ఆర్థిక శాఖ పక్కనపెట్టేసింది. కేవలం రూ.8,574 కోట్ల కేటాయింపులతో సరిపెట్టింది. ఖర్చులు, నిర్వహణ వ్యయం పెరిగినందున ప్రణాళికేతర వ్యయం కింద రూ.10,533 కోట్లు అవసరమని ప్రతిపాదించినా పట్టించుకోలేదు. ప్రణాళికేతర పద్దులో భారీగా కోత పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.11,216.09 కోట్ల బడ్జెట్ కేటాయించగా, ఈసారి దానిని రూ.10,738.62 కోట్లకు తగ్గించారు. ముఖ్యంగా ప్రణాళికేతర పద్దులో ప్రభుత్వం భారీగా కోత విధించింది. గతేడాది ప్రణాకేతర పద్దు కింద రూ.7,976.43 కోట్లు చూపగా.. ఈసారి రూ.7,290.94 కోట్లు కేటాయించింది. రూ.685.49 కోట్ల మేర కోత పెట్టింది. పాఠశాల విద్యాశాఖ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం 2015-16 బడ్జెట్లో కరువు భత్యం (డీఏ) కింద రూ.1,250 కోట్లు ప్రతిపాదించగా సవరించిన అంచనాల మేరకు రూ.550 కోట్ల వరకు వెచ్చించింది. దీంతో ఆ సవరించిన అంచనాల ప్రకారం ఈసారి (2016-17) నాన్‌ప్లాన్ బడ్జెట్లో ఆ మేరకు కేటాయింపులు తగ్గించి, డీఏ కింద రూ.500 కోట్ల మేర కేటాయించారు. ఇక 2014-15 సంవత్సరంలో ప్రణాళిక వ్యయం కింద పాఠశాల విద్యకు రూ.3,510.56 కోట్లు కేటాయించగా.. 2015-16 సంవత్సరంలో రూ. 1,078.06 కోట్లకు తగ్గించింది. ఈసారి కాస్త పెంచి రూ.1,283.69 కోట్లకు పెంచింది. అయితే విద్యాశాఖ అడిగిన మొత్తంతో ( రూ. 3,591 కోట్లు) పోల్చితే 40 శాతం కూడా ఇవ్వలేదు. ఎస్ఎస్ఏకు పెరిగిన కేటాయింపులు కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాల్లో రాష్ట్ర వాటా పెరగడంతో కిందటేడాది కేటాయింపుల కంటే ఈసారి 205.63 కోట్లు అదనంగా కేటాయించారు. అదీ ఎక్కువ మొత్తం సర్వ శిక్షా అభియాన్‌కే పెంచారు. రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌కు నిధులను తగ్గించారు. మరోవైపు మధ్యాహ్న భోజనం, కంప్యూటర్ విద్య తదితర పథకాల్లో గతంలో కొన్నింటిలో కేంద్ర రాష్ట్ర వాటా 65:35, 70:30, 75:25గా ఉండేది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రం అన్నింటికి 60 శాతమే ఇస్తామని, రాష్ట్రాలు 40 శాతం నిధులను వెచ్చించాల్సిందేనని స్పష్టం చేయడంతో ప్రణాళిక వ్యయం కింద ఎస్ఎస్ఏకు నిధుల కేటాయింపును పెంచింది. -
మూడు విభాగాలుగా కేజీ టు పీజీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం కేజీ టు పీజీని మూడు విభాగాలుగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏటా ఏడున్నర లక్షల మందికి ప్రయోజనం చేకూరే.. కేజీ టు పీజీ పథకం అమలుపై సచివాలయంలో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది (2016-17) కేజీ టు పీజీని ప్రారంభించాలని నిర్ణయించారు. మరోవైపు రాష్ట్రంలోని గురుకులాలన్నీ కేజీ టు పీజీలో భాగంగా చేసి, ఒకే డెరైక్టరేట్ నేతృత్వంలో వీటిని నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ఆలస్యమైనా కేజీ టు పీజీని పకడ్బందీగా నిర్వహించే ఉద్దేశంతోనే నిఫుణుల సలహాల కోసం వేచి ఉన్నామన్నారు. ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. వాటిని కొనసాగిస్తూ గురుకుల విద్యాలయాల వ్యవస్థను కేజీ టు పీజీ పరిధిలోకి తేనున్నారు. నివాస వసతితో కూడిన విద్యా పథకంగా కేజీ టు పీజీని అమలు చేయనున్నారు. ఇందులో కేజీ నుంచి 4వ తరగతి వరకు ఒక విభాగంగా చేస్తారు. ఇందులో వీలైతే అంగన్వాడీ కేంద్రాలను కూడా భాగం చేస్తారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇందులో మాతృ భాషలోనే బోధన విధానం ఉండే అవకాశం ఉంది. ఇక రెండో విభాగంలో 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నివాస వసతితో కూడిన ఇంగ్లిషు మీడియం విద్యా బోధన ఉంటుంది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కనీసంగా 10 గురుకులాలను ఏర్పాటు చేయనున్నారు. ఇలా మొత్తంగా 1,190 గురుకులాలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం 668 ఉండగా, మిగతా 522 గురుకులాలను కొత్తగా ఏర్పాటు చేస్తారు. ఇంటర్మీడియట్ తరువాత విద్యను మూడో విభాగంలో భాగంగా పథకాన్ని అమలు చేస్తారు. ఇంటర్మీడియట్ తరువాత దీన్నెలా అమలు చేయాలన్న అంశంపై ఇంకా తుది నిర్ణయం జరగలేదు. అన్నింటిపై మరింత లోతైన అధ్యయనం చేసేందుకు సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీలు విభాగాల వారీగా కాన్సెప్ట్ పేపర్‌ను రూపొందించనున్నాయి. ఆ తరువాత వాటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
గజ్వేల్ నుంచే కేజీ టు పీజీకి శ్రీకారం..!
జగదేవ్‌పూర్: సీఎం కేసీఆర్ నియోజవర్గమైన గజ్వేల్ నుంచే కేజీ టు పీజీ పథకానికి ప్రారంభోత్సవం చేస్తామని బీసీ వెల్పేర్ రెసిడెన్షియల్ సెక్రటరీ మల్లయ్య భట్టు పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రమైన జగదేవ్‌పూర్‌లో కేజీ టు పీజీ తాత్కలిక భవనాలను ఆయన పరిశీలించారు. ఎస్సీ, బీసీ హాస్టల్, స్త్రీ శక్తి భవనాలతో పాటు కేజీ టు పీజీకి కేటాయించిన స్థలాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ర్టంలో తొలిసారిగా సీఎం నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ నుంచి కేజీ టు పీజీ పథకాన్ని ప్రారంభించడానికి తగిన వసతులను పరిశీలిస్తున్నామన్నారు. జగదేవ్‌పూర్‌లోని ఎస్సీ, బీసీ, స్త్రీ శక్తి భవనాలు అనుకూలంగా ఉన్నాయని, డిగ్రీ కోసం భవనాలను పరిశీలిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు విద్యార్థుల నుంచి డిగ్రీ కోసం వెయ్యి, ఇంటర్ కోసం 5 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. 5 వ తరగతి కోసం మంగళవారం నాటికి 11 వేల దరఖాస్తులు వచ్చాయని, ఈ నెల 8 చివరి తేదీ కావడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇంటర్ బీసీ బాలికల రెసిడెన్షియల్ విద్యాలయాలు మూడు చోట్ల నడుస్తున్నాయన్నారు. జిల్లాలో దౌల్తాబాద్, కరీంనగర్ జిల్లాలో కమలాపూర్లతో పాటు జగదేవ్‌పూర్‌లో ప్రారంభం కానున్నదన్నారు. అలాగే మరో 16 రెసిడెన్షియల్ విద్యాలయాలు ఏర్పాటు కోసం సీఎం వద్ద పైళ్లు ఉన్నాయని వివరించారు. ఈ నెల10న దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు అన్లైన్ ద్వారా హాల్ టిక్కెట్లు అందిస్తామన్నారు. 17న ఎంట్రెన్స్ నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కేజీ టు పీజీని విజయవంతం చేస్తామన్నారు. కాగా కేజీ టు పీజీ ద్వారా మెరుగైన విద్యనందిస్తామని, ఓయూ కంటే మెరుగైన వసతులు, విద్యను అందిస్తామని తెలిపారు. నలుగురి విద్యార్థులకు ఒక గది ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. అలాగే కంప్యూటర్, ల్యాబ్ గదులను వేర్వేరుగా ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం జగదేవ్‌పూర్‌లో కేజీ టు పీజీ కోసం కేటాయించిన 41 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంఈఓ సుగుణకర్, సర్పంచ్ కరుణకర్, ఉపాద్యాయులు శశిధర్‌శర్మ, జోజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.