నీటిపై ‘కోటి’ ఆశలు | Water on 'crore' hopes.. | Sakshi
Sakshi News home page

నీటిపై ‘కోటి’ ఆశలు

Published Tue, Mar 15 2016 2:25 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

Water on 'crore' hopes..

సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రానికి హక్కుగా కలిగిన నికర, మిగులు జలాల్లోని నిర్ణీత వాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తేవడం.. సుమారు లక్ష కోట్ల ఖర్చుతో కోటి ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టుకు నీరివ్వడం.. ఇలా ఘనమైన లక్ష్యాలను నిర్దేశించుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే బడ్జెట్‌లో సాగునీటి శాఖకు రూ.25 వేల కోట్లు కేటాయించింది! అయితే ఈ నిధుల ఖర్చు జరగాలంటే ప్రాజెక్టుల్లో వేగం, సకాలంలో నిధుల కేటాయింపులు, నిరంతర పర్యవేక్షణ అత్యంత ఆవశ్యకమని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. గతేడాది బడ్జెట్‌లో రూ.11 వేల కోట్ల మేర కేటాయింపులు జరిపితే అందులో రూ.7 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఇప్పుడు రూ.25 వేల కోట్లు ఖర్చు చేయడమంటే మాటలు కాదని అంటున్నారు.
 
చేసింది గోరంత..  చేయాల్సింది కొండంత!
ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తంగా 2.76 కోట్ల ఎకరాల విస్తీర్ణం భూమి ఉంది. ఇందులో 1.67 కోట్ల విస్తీర్ణం భూమి సాగుకు యోగ్యంగా ఉంది. అయితే ఇందులో ప్రస్తుతం కేవలం 48.22 లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమే సాగులో ఉంది. మరో కోటి 20 లక్షల ఎకరాల ఆయకట్టును వృద్ధిలోకి తేవాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే 60 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇచ్చే లక్ష్యంతో భారీ ప్రాజెక్టులు పురుడు పోసుకున్నాయి. 2004లో చేపట్టిన భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను రూ.1.30 లక్షల కోట్లతో చేపట్టగా అందులో రూ.46 వేల కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.84 వేల కోట్ల మేర పనులను పూర్తి చేయాల్సి ఉంది.

రీ డిజైన్ పేరిట ఆ వ్యయం కాస్తా ఇప్పుడు లక్ష కోట్లకు చేరింది. వీటి కింద సుమారు 60 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉండగా అందులో 8.87 లక్షల ఎకరాలకు మాత్రమే నీరిచ్చారు. ఇంకా 51 లక్షల ఎకరాలకు నీరివ్వాల్సి ఉంది. వీటితోపాటు కొత్తగా చేపట్టిన పాలమూరు, డిండి సహా ఇతర ప్రాజెక్టులతో కలిపితే ఆయకట్టు లక్ష్యం మరో 15 లక్షలు పెరుగుతుంది. ఇక చిన్న నీటి వనరుల కింద 22 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉన్నా సాగులో ఉన్నది కేవలం 8 లక్షలు మాత్రమే.ఇదంతా కలిపితే కోటి ఎకరాల కొత్త ఆయకట్టు ఉంటుంది. మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, రాజీవ్ బీమా, కోయిల్‌సాగర్, నల్లగొండలోని ఏఎమ్మార్పీ, వరంగల్‌లోని దేవాదుల, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండలకు సాగునీరు ఇచ్చే ఎస్సారెస్పీ-2, వరద కాలువ, కరీంనగర్‌లోని ఎల్లంపల్లి, ఖమ్మం జిల్లాకు చెందినరాజీవ్‌సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టు నిర్మాణాలు దాదాపు 80 శాతానికిపైగా పూర్తయ్యాయి. భూసేకరణ సమస్యలు పరిష్కరించి, పరిహారంలో జాప్యాన్ని  నివారిస్తూ ముందుకెళ్తే 2017 జూన్ నాటికి 17.5 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యాలను ప్రభుత్వం చేరుకునే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement