ఛత్తీస్‌గఢ్ నుంచి 2000 మెగావాట్లు
* విద్యుత్ కొరతను తీర్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం
* ప్రత్యేక సరఫరా లైన్ నిర్మించాలని అధికారులకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్య నుంచి గట్టెక్కడానికి ఛత్తీస్‌గఢ్ నుంచి రెండు వేల మెగావాట్లను కొనుగోలు చేయాలని ఆ శాఖ అధికారులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా విద్యుత్ సరఫరా లైన్‌ను నిర్మించాలని సూచించారు. తెలంగాణ కరెంటు కష్టాలను తీర్చడానికి చేపట్టాల్సిన తాత్కాలిక, దీర్ఘకాలిక చర్యలపై జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, తెలంగాణ ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రిజ్వీ, ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌తో సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. కృష్ణా, గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగా, మంజీరా నదులపై మరిన్ని జల విద్యుదుత్పత్తి కేంద్రాలను నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలపై సర్వే నిర్వహించాలని ఈ సందర్భంగా సూచించారు.
రాబోయే మూడేళ్లలో దాదాపు 20 వేల మెగావాట్లు అందుబాటులోకి వచ్చేలా ప్రాజెక్టులు నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జెన్‌కో ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఆరు వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి వెంటనే స్థలాన్వేషణ చేపట్టాలని కూడా ఆదేశించారు. మణుగూరు లేదా ఇల్లెందు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని కేసీఆర్ సూచించారు. రాష్ట్ర విభజన బిల్లులో హామీ ఇచ్చిన మేరకు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు నిర్మాణానికి చర్యలను వేగవంతం చేయాలన్నారు. ఉత్తరాదిగ్రిడ్ నుంచి దక్షిణాది గ్రిడ్‌కు వచ్చే విద్యుత్ నుంచి దాదాపు 1500 మెగావాట్ల విద్యుత్‌ను వార్దా-డిచ్‌పల్లి లైన్ ద్వారా పొందాలని అధికారులను ఆదేశించారు. జూరాల నుంచి చాలా తక్కువ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు వద్ద 11 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటున్నందున ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తికి అవకాశముందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కృష్ణాపై గుర్రంగడ్డ వద్ద, గోదావరిపై కడెం, ఇచ్ఛంపల్లి వద్ద, మంథని సమీపంలోని ఎల్ మడుగు వద్ద విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు ఉన్నట్లు చెప్పారు.
తెలంగాణలో ఐదువేల మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని, దీనిపై సర్వేలు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. కాగా, ప్రస్తుతం తెలంగాణకు 4400 మెగావాట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉందని అధికార వర్గాలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చాయి. డిమాండ్ మాత్రం ఏకంగా ఏడు వేల మెగావాట్లకుపైగా ఉందని వివరించాయి. అయితే కరెంటు కష్టాలను ముందుగానే ఊహించామని, మూడేళ్ల తర్వాత రాష్ట్రం మిగులు విద్యుత్ సాధించే దిశగా సత్వరం పనులు ప్రారంభించాలని కేసీఆర్ పేర్కొన్నారు. మూడేళ్ల తర్వాత ప్రజలకు 24 గంటలపాటు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. కృష్ణపట్నం, సీలేరు నుంచి తెలంగాణ వాటా కరెంటును పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఒప్పందం మేరకు సరఫరా చేయండి
రాష్ర్ట ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్‌ను యథావిధిగా సరఫరా చేయాలని హిందూజా గ్రూప్ చైర్మన్ అశోక్ హిందుజాను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కోరారు. అశోక్ హిందూజా సోమవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి హిందూజా సంస్థ సరఫరా చేస్తున్న విద్యుత్‌పై చర్చలు జరిగాయి. చర్చల సందర్భంగా హిందూజా సంస్థ పారిశ్రామిక రంగంలో మరిన్ని పెట్టుబడులకు ముందుకు వచ్చినట్లు తెలిసింది.