పనులిలా.. పవరెలా..!
నత్తనడకన పవర్ ప్రాజెక్ట్ పనులు
* నేడు జైపూర్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాక
* ప్లాంటు సామర్థ్యాన్ని 1800 మెగావాట్లు పెంచే యోచనలో సీఎం?
* ఈ మేరకు నేడు ప్రకటన చేసే అవకాశం..!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పొంచి ఉన్న విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు భారీ స్థాయిలో విద్యుదుత్పత్తికి యుద్ధ ప్రాతిపదికన చర్యలకు సర్కారు శ్రీకారం చుడితే.. జైపూర్ పవర్ ప్లాంటు నిర్మాణ పనులు మాత్రం నత్తకు నడక నేర్పుతున్నాయి. 2011 నవంబర్‌లో ప్రారంభమైన పనులు మూడేళ్లు గడిచినా ఇంకా కొనసా..గుతూనే ఉన్నాయి.
2015 వరకు ఈ ప్లాంటు నిర్మా ణ పనులు పూర్తి కావాల్సి ఉండగా, ఇదే తీరుగా పనులు జరిగితే మరో ఐదేళ్ల వరకు కూడా ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. రానున్న మూడేళ్లలో తెలంగాణకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని, ఐదేళ్లలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. ఈ ప్లాంటు పనుల తీరును పరిశీలిస్తే.. ఇది సాధ్యమయ్యేలా లేదు.
అయితే.. ఈ పవర్‌ప్లాంటు ప్రస్తుత సామర్థ్యం 1,200 మెగావాట్లు. దీన్ని 1,800 మెగా వాట్లకు పెంచే యోచనలో సర్కారు ఉన్నట్లు విద్యుత్ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు గురువారం ప్రాజెక్టు పనులు పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జైపూర్‌కు వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామర్థ్యం పెంపునకు అవసరమైన భూములు కూడా ఇప్పటికే సింగరేణి సేకరించి పెట్టింది.
విద్యుదుత్పత్తి రంగంలోకి..
బొగ్గు ఉత్పత్తికే పరిమితమైన సింగరేణి కాలరీస్ సంస్థ మొదటి సారిగా విద్యుత్ రంగంలోకి అడుగు పెట్టాలని గత సర్కారు నిర్ణయించి.. 2009లో ఇందుకు శ్రీకారం చుట్టింది. జైపూర్ మండల పరిధిలో ఉన్న జైపూర్, పెగడపల్లి, గంగిపల్లి, ఎల్కంటి గ్రామాల శివారులో 2,100 ఎకరాల భూములను సేకరించింది. సుమారు రూ.5,500 కోట్ల అంచనా వ్యయంతో మొదట 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని భావించారు. 2012 వరకు ఈ విద్యుత్ కేంద్రాన్ని పూర్తి చేయాలనుకున్నారు.
సింగరేణికి బొగ్గు గనులు, ఓసీపీలకు సమీపంలో అనువైన భూములు లభించడం, విద్యుదుత్పత్తికి అవసరమైన నీరు అందుబాటులో ఉండడంతో.. ఇక్కడ సింగరేణి అవసరానికి మించి సుమారు 2,100 ఎకరాల భూములను సేకరించింది. దీంతో 600 మెగావాట్ల స్థానంలో అదనంగా మరో 600 మెగావాట్లు కలిపి మొత్తం 1,200 మెగా వాట్ల విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని నిర్మించాలని భావించింది. ఇందుకోసం రూ.5,500 కోట్ల అంచనా వ్యయాన్ని రూ.7,500 కోట్లతో పెంచింది. 2010 ఫిబ్రవరి 14న అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా ఈ ప్లాంటు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది.
టెండర్ల దశలోనే ఆలస్యం..
ఈ ప్లాంటు నిర్మాణానికి సంబంధించి టెండర్ల దశలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ టెండర్ల ప్రక్రియ కొలి క్కి వచ్చే సరికే ఏడాది గడిచింది. దీంతో నిర్మాణ పనులను 2011 నవంబర్ 11న ప్రారంభించారు. 39 నెలల్లో మొదటి యూనిట్‌ను, 43 నెలల్లో రెండో యూనిట్‌ను పూర్తి చేయాలని నిర్ణయించారు. ముందుగా నిర్దేశించిన ప్రకారం 2015 ఫిబ్రవరి వరకు ఈ పనులు పూర్తి కావా లి. కానీ ఈ గడవు దగ్గర పడుతున్నా పనులు ముందుకు సాగడం లేదు. దీంతో ప్రభుత్వం భావిస్తున్నట్లు మూడేళ్లలో నిరంతర విద్యుత్ సాధించడానికి ప్రధాన అవరోధంగా తయారైంది.
ఇవీ పనుల ప్రగతి..
* ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను సింగరేణి బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించింది. కన్సల్టెంట్‌గా ఎన్టీపీసీ వ్యవహరిస్తోంది.
* విద్యుత్ కేంద్రంలో కీలకమైన బీటీజీ (బాయిలర్ టర్బైన్ జెనరేషన్) పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ బీటీజీ పనులు మరో పది శాతం పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం టర్బైన్ జనరేషన్, బాయిలర్ ఎరాక్షన్, స్వీచ్ యార్డు పనులు జరుగుతున్నాయి. బీవోపీ (బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్స్) పనులు ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయి. ఇందులో చిమ్నీ, నీటి రిజర్వాయిర్, కూలింగ్ టవర్స్, యాష్‌యార్డు, కోల్‌యార్డు, అంతర్గత రోడ్ల పనులు పూర్తి చేయాల్సి ఉంది
* విద్యుత్ ప్రాజెక్టులో కీలకమైన నీటి రిజర్వాయర్ నిర్మాణ పనులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఆర్-1, ఆర్-2 రెండు విభాగాలు చేసి పనులు ప్రా రంభించారు. జైపూర్ మండలం షెట్‌పల్లి గోదావరి నది నుంచి ఒక టీఎంసీ నీటిని తరలించేందకు చేపట్టిన పైపులైన్ పనులు కొనసాగుతున్నాయి. గోదావరి నది ఒడ్డున పంప్‌హౌజ్ నిర్మాణ దశలో ఉంది.
* ఈ ప్లాంటుకు అవసరమైన బొగ్గును శ్రీరాంపూర్ ఓసీపీ నుంచి కేటాయించారు. ఓసీపీ నుంచి ఈ బొగ్గును ప్లాంటుకు సరఫరా చేసేందుకు అవసరమైన రైల్వే ట్రాక్ పనులకు ఇంకా శ్రీకారమే చుట్టలేదు. ఇది ప్రస్తుతం టెండరు దశను దాటలేదు.
* కోటపల్లి మండలంలోని దేవులవాడ సమీపం నుంచి రెండు టీఎంసీల నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాటు చేయాల్సిన పైపులైన్ పనులు ఊసే లేదు. ఇందుకు అవసరమైన భూ సేకరణ ఇంకా చేయాల్సి ఉంది. ప్లాంటులో బాయిలర్స్‌తో పాటు చిమ్నీ, రిజర్వాయిర్, కూలింగ్ టర్స్, టర్బైన్ జనరేటర్, స్వీచ్‌యార్డు పనులు ఏకకాలం పూర్తి అయితేనే విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. కానీ పనులు ఇదే తీరుగా సాగితే 2017 వరకు కూడా ఈ పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ పనులను వేగవంతం చేసేందుకు సీఎం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
55 శాతం పనులు పూర్తయ్యాయి..
- సుధాకర్ రెడ్డి, పవర్ ప్లాంట్ జీఎం
* ఇప్పటివరకు సుమారు 55 శాతం పనులు పూర్తయ్యాయి. ఒక్కోపని వివిధ దశల్లో ప్రగతిలో ఉంది. ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం.
మంచిర్యాల టౌన్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం జిల్లాకు రానున్నారు. ఈ మేరకు కలెక్టర్ జగన్‌మోహన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నూర్ నియోజకవర్గంలోని జైపూర్‌లో నిర్మిస్తున్న సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటును సందర్శిస్తారు. మొదట పవర్‌ప్లాంటు వద్ద ప్లాంటుకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించిన అనంతరం థర్మల్ పవర్ ప్లాంటును సందర్శిస్తారు.
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటుకు సంబంధించి టెక్నికల్, నాన్ టెక్నికల్, తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌కో, ఎన్‌పీడీసీఎల్ అధికారులతో దాదాపు 45 నిమిషాలపాటు ప్రత్యేకంగా సమావేశమవుతారు. భోజనం అనంతరం థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఏరియల్ సర్వే చేస్తారు. సర్వే అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్తారు.
ఆగమేఘాలపై ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భారీ పవర్ ప్లాంట్లను నెలకొల్పేందుకు మంగళవారం నల్గొండ జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని ఏరియల్ సర్వే నిర్వహించిన కేసీఆర్ రెండు రోజుల్లోనే ఆయన జిల్లాలోని జైపూర్ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని పరిశీలించేందుకు వస్తున్నారు. సీఎం రాక సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం ఆగమేఘాలపై ఏర్పాట్లు చేసింది.
కేవలం ఈ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని సందర్శించేందుకే జిల్లాకు వస్తున్న సీఎం ఈ పనుల ప్రగతిపై సంబంధిత సంస్థల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాగా.. కేసీఆర్ సీఎం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన రెండోసారి జిల్లాకొస్తున్నారు. కొమురం భీమ్ వర్ధంతిని పురస్కరించుకుని అక్టోబర్ 8న జోడేఘాట్‌కు వచ్చారు.