కరెంట్ కోతలుండవ్
బాలానగర్ :వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని, 24 గంటల పాటు నిరంతరంగా కరెంట్ సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. జిల్లాలో విద్యుత్ సబ్‌స్టేషన్లు తక్కువగా ఉన్నాయని, ఉన్నచోట కొత్తవాటిని నిర్మిస్తామని చెప్పారు. సోమవారం మండలంలోని ముదిరెడ్డిపల్లిలో రూ.పదిలక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనంతో పాటు చెన్నంగులగడ్డతండాలో రూ.ఐదులక్షల వ్యయంతో చేపట్టిన సీసీరోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యను అర్థం చేసుకుని రైతులు రబీలో ఆరుతడి పంటలే వేయాలని కోరారు.
రాష్ట్రానికి రావాల్సిన 54 శాతం విద్యుత్‌ను రాకుండా ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలుపన్నుతున్నారని అన్నారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రం విడిపోతే కరెంట్ సమస్య ఉంటుందని, సీఎం ఎన్నికల సందర్భంగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. జిల్లాను అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషిచేస్తానని, పార్టీలకతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమపథకాలు అందిస్తామని హామీఇచ్చారు. ముదిరెడ్డిపల్లిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని సర్పంచ్ నర్సింలు సభ దృష్టికి తీసుకురాగా, పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
మంత్రికి ఘనస్వాగతం
రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి బాలానగర్ మండలానికి సోమవారం మొదటిసారిగా విచ్చేసిన మంత్రికి టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో మొదట టీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. సర్పంచ్ నర్సింలు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పట్ల ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీఓ హన్మంత్‌రెడ్డి, ఎంపీపీ భాగ్యమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు కళావతి, ఎంపీడీఓ రామ్మూర్తి ైవైస్ ఎంపీపీ లింగ్యానాయక్ తహశీల్దార్ మురళీకృష్ణ, వెంకటాచారి, శ్రీనివాస్‌రెడ్డి, వాల్యనాయక్, మహిపాల్‌రెడ్డి, లక్ష్మణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.