దొరల గడీలో తెలంగాణ తల్లి బందీ
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై దామోదర ధ్వజం
పటాన్‌చెరు: ‘దొరల గడీలో తెలంగాణ తల్లి బందీ అయింది.. ఆమె విముక్తి కోసం కాంగ్రెస్ కార్యకర్తలు పోరాటం చేయాలి’ అని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. ఆదివారం మెదక్ జిల్లా పటాన్‌చెరులో టీఆర్‌ఎస్, బీజేపీ, ఇతర పార్టీలకు చెందిన కొందరు యువకులు కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దామోదర మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదని విమర్శించారు. ప్రతిపక్షాల నోరు మెదపనివ్వకుండా కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఉప ఎన్నిక దృష్ట్యా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బును పంపిణీ చేస్తున్నారన్నారు. దొర పంపిన ఆ డబ్బులను తీసుకుని టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలని ఆయన ఓటర్లకు సూచించారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ జగ్గారెడ్డి తదితరులు ఉన్నారు.