'వంచన, మోసానికి కేసీఆర్ మారుపేరు'
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర రావుపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ వంచన, మోసానికి మారుపేరని విమర్శించారు. శనివారం టీఆర్ఎస్ నేత ఇబ్రహీం కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీని నెరవేర్చిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విశ్వసనీయతకు మారుపేరుగా నిలవగా, టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని మాటతప్పిన కేసీఆర్ విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని రాజనర్సింహ అన్నారు. సోనియాది మానవత్వమైతే, కేసీఆర్‌ది దానవత్వమని విమర్శించారు. దళితులకు సీఎం పదవి, మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని కేసీఆర్‌ను ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు వద్దని, హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడతామని దామోదర అన్నారు. తెలంగాణలో త్వరలో ఆరు జిల్లాల్లో రాహుల్, సోనియా గాంధీల సభలు నిర్వహిస్తామని, త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని చెప్పారు.