విజయం మనదే | KCR Comments On Grand Alliance | Sakshi
Sakshi News home page

విజయం మనదే

Published Mon, Nov 12 2018 1:53 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

KCR Comments On Grand Alliance - Sakshi

ఆదివారం టీఆర్‌ఎస్‌ భవన్‌లో కేసీఆర్‌కు బీ–ఫారం అందజేస్తున్న నాయిని, కేకే. చిత్రంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ చరిత్ర సృష్టించేలా ఘన విజయం సాధించనుందని ఆపద్ధర్మ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. వంద సీట్లను గెలుచుకునే పరిస్థితి ఉం దన్నారు. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్‌ నిర్వహణ ప్రణాళిక పక్కాగా ఉండాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదివారం ఆ పార్టీ అభ్యర్థులకు తెలంగాణ భవన్‌లో బీ–ఫారాలు అందజేశారు. సిర్పూరు కాగజ్‌నగర్‌ అభ్యర్థి కోనేరు కోనప్పకు తొలి బీ–ఫారాన్ని అందజేసిన కేసీఆర్‌ చివరి బీ–ఫారాన్ని తన దగ్గర పెట్టుకున్నారు. నాంపల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మునుకుంట్ల ఆనంద్‌కుమార్‌గౌడ్‌కు బీ–ఫారం ఇవ్వలేదు. అలాగే లలిత కళాతోరణంలో సమావేశానికి హాజరు కావాల్సి ఉండటంతో కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లను భేటీకి ముందే కేసీఆర్‌ పంపించారు. అంతకుముందు అభ్యర్థులతో ప్రత్యేక సమావేశంలో ఎన్నికల వ్యూహంపై మార్గదర్శనం చేశారు. ప్రచార సరళిని సమీక్షించారు. గెలుపు కోసం ఏ అవకాశాన్ని వదులుకోవద్దన్నారు.

తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రజలు భావిస్తున్నారని కేసీఆర్‌ అన్నారు. ‘అసెంబ్లీ రద్దయిన రోజు నుంచి ఈ 2 నెలల్లో చాలా సర్వేలు చేశాం. రకరకాలుగా సమాచారం తెప్పించాం. సర్వేలన్నీ మన విజయం ఖాయమని చెబుతున్నాయి. ప్రచారంలోకి దిగకముందే 75 శాతం మనకు అనుకూలంగా ఉందని ఇండియా టుడే వంటి సర్వేలు చెబుతున్నాయి. ప్రచారం మొదలుపెడితే ఇంకా బాగుంటుంది. వంద స్థానాల్లో విజయం మనదే. కొన్నిచోట్ల ఇంకొంచెం కష్టపడాలి. కూటమిలో ఇంకా సీట్ల పంచాయతీ తెగడంలేదు. వాటితో సంబంధం లేకుండా మన ప్రచారం ఇంకా పెంచాలి. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీల వారు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. ముందుగానే ప్రణాళిక వేసి ఏదో జరిగిందని చెప్పేలా చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఓపికగా ఉండాలి. ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తూ ముందుకు సాగాలి. మీ వెంట ఉండే ద్వితీయశ్రేణి నేతలు సైతం ఓపికగా ఉండేలా చూసుకోవాలి. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూనే.. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పాలి. నామినేషన్ల దాఖలు తర్వాత సమయం కీలకమైనది. పోలింగ్‌ వరకు ఉండే సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలి.  

లెక్కలపై జాగ్రత్త...
ప్రతిపక్ష పార్టీలు సిద్ధాంతాలు లేకుండా రాజకీయ లక్ష్యంతో కూటమి కడుతుండటాన్ని ప్రజలు అంగీకరించడంలేదని టీఆర్‌ఎస్‌ అధినేత అన్నారు. మహాకూటమిలో భాగంగా టీడీపీకి వరంగల్‌ తూర్పు, బాన్సువాడ, నిజామాబాద్‌ రూరల్, సత్తుపల్లి, ఖమ్మం, అశ్వారావుపేట, మహబూబ్‌నగర్, దేవరకద్ర, ఉప్పల్, పటాన్‌చెరువు, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సనత్‌నగర్, కోదాడ సీట్లు ఇచ్చే అవకాశం ఉందన్నారు. కూటమిలో ఏ పార్టీకి సీటు వచ్చినా మిగిలిన పార్టీల వారు సహకరించే పరిస్థితి లేదన్నారు. నామినేషన్ల దాఖలు, ఎన్నికల సంఘం నియమావళి అమలు విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అవసరమైతే మన పార్టీలోని న్యాయ నిపుణులతో చర్చించాలని అన్నారు. మీ పరిధిలోని ప్రత్యర్థి పార్టీలు నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నికల కమిషన్‌కు తెలియజేసేలా ఎప్పటికప్పుడు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వాలన్నారు. ఎన్నికల ఖర్చు విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏరోజు లెక్కలు అదేరోజు చూసుకోవాలన్నారు. ఎన్నికల ఏజెంట్ల వంటి కీలకమైన బాధ్యతలను కుటుంబ సభ్యులకు అప్పగించుకోవాలని సూచించారు.

మేనిఫెస్టో బాగుంటుంది...
తెలంగాణ ప్రజల అవసరాలను గుర్తించి ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని కేసీఆర్‌ అన్నారు. మేనిఫెస్టోలో మరిన్ని పథకాలను చేర్చుతున్నామని చెప్పారు. ప్రత్యర్థి పార్టీల హామీలను ప్రజలు నమ్మడం లేదని, మనం ఇప్పటికే ప్రకటించిన లక్ష రూపాయల రుణమాఫీ, రైతు బంధు, ఆసరా పింఛన్ల పెంపు, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పథకంలో మార్పులు, రైతులకు గిట్టుబాటు ధర, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమం హామీలకు ప్రజల్లో మంచి స్పందన వస్తోందని అన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి మేనిఫెస్టో ప్రకటిస్తామని, పెండింగ్‌లో ఉన్న 12 స్థానాలకు కూటమి అభ్యర్థులను ప్రకటించాక ప్రకటిద్దామని అన్నారు.  

15 నుంచి ఎన్నికల ప్రచారం...
కూటమి అభ్యర్థులు ఖరారు కాకపోవడంతోనే ప్రచారం ఆలస్యమవుతోందని కేసీఆర్‌ అన్నారు. నవంబర్‌ 15 నుంచి పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. నియోజకవర్గాల వారీగా ప్రచార షెడ్యూల్‌ను ఖరారు చేశామని, ఈ సమాచారం అందిన వెంటనే తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేసేలా ప్రచార ప్రణాళిక ఉంటుందని తెలిపారు. ఉమ్మడి జిల్లాల వారీగా బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. డిసెంబర్‌ మొదటి వారంలో లేదా ఎన్నికల ప్రచార ముగింపు సందర్భంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. డిసెంబర్‌ 2 లేదా మూడో తేదీన ఈ సభను నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు.  

కేసీఆర్‌ను కలిసిన సుధీర్‌రెడ్డి...
సాయంత్రం 5.45 గంటలకు తెలంగాణ భవన్‌కు చేరుకున్న టీఆర్‌ఎస్‌ అధినేత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అభ్యర్థులతో సమావేశమయ్యారు. కేసీఆర్‌ సమావేశ మందిరంలోకి వెళ్లే ముందు మేడ్చల్‌ తాజా మాజీ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి ఆయనను కలిశారు. మేడ్చల్‌ అభ్యర్థిత్వం విషయంలో సుధీర్‌రెడ్డికి సానుకూల స్పందన రాలేదని తెలిసింది. నకిరేకల్‌ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత కటకం సత్తయ్యగౌడ్‌ కేసీఆర్‌ను కలిసి టీఆర్‌ఎస్‌లో చేశారు.  

14న కేసీఆర్‌ నామినేషన్‌
టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నవంబర్‌ 14న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. గజ్వేల్‌ నుంచి ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత వరుసగా రెండు సాధారణ ఎన్నికల్లో ఒకే నియోజకవర్గం నుంచి కేసీఆర్‌ పోటీ చేయడం ఇదే మొదటిసారి. 2004 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్‌ ఎంపీగా, సిద్ధిపేట ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం సిద్ధిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో 2006, 2008 ఉప ఎన్నికల్లో కరీంనగర్‌ ఎంపీగా గెలిచారు. 2009 సాధారణ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2014 సాధారణ ఎన్నికల్లో మెదక్‌ లోక్‌సభ, గజ్వేల్‌ అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. ఆ తర్వాత మెదక్‌ లోక్‌సభకు రాజీనామా చేశారు. ఇప్పుడు మళ్లీ గజ్వేల్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్‌ అసంతృప్తులను తిప్పుకోవాలి(బాక్స్‌)
మహాకూటమి అభ్యర్థులను ప్రకటించగానే కాంగ్రెస్‌లోని అసంతృప్తులను టీఆర్‌ఎస్‌వైపు తిప్పుకోవాలని టీఆర్‌ఎస్‌ అధినేత ఎమ్మెల్యే అభ్యర్థులకు సూచించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎన్నికల ప్రచారంలో అధికారులు, పోలీసులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ప్రస్తుతం మహాకూటమికి 28శాతం, టీఆర్‌ఎస్‌కు 70.2శాతం ఓట్లున్నట్టు ఆయన అభ్యర్థలుకు వివరించినట్టు తెలిసింది. ఇదే సమావేశంలో మూడు ప్రచార పాట్లను అభ్యర్థులందరికీ వినిపించారు. నామినేషన్ల దాఖలుపై అనుమానాలు నివృత్తి కోసం కాల్‌సెంటర్లు సైతం ఏర్పాటుచేస్తున్నట్టు కేసీఆర్‌ వివరించారు. ప్రచారంలో వెనుకబడిన పలు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలుగా సీనియర్‌ నేతలను నియమించారు. ములుగు–పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్, గద్వాల్, కొడంగల్‌–హరీశ్‌రావు, ఇల్లందు–తాతామధు, ఆదిలాబాద్‌–శ్రవణ్, నల్గొండ–తక్కళ్లపలి, కోదాడ– గుత్తా సుఖేందర్‌రెడ్డి, హుజూర్‌నగర్‌–లింగయ్యయాదవ్, తుంగతుర్తి–బూరనర్సయ్యగౌడ్‌ ఇన్‌చార్జిలుగా వ్యవహరించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement