కేసీఆర్ విశ్వాస ఘాతకుడు
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విశ్వాస ఘాతకుడని, నమ్మించి మోసం చేసిన వంచకుడని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట కోసం సగం కడుపు కోసుకుని తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ విశ్వసనీయతకు మారుపేరన్నారు. గాంధీభవన్‌లో షబ్బీర్ అలీ, కాంగ్రెస్‌లో చేరిన టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఇబ్రహీంతో కలిసి దామోదర మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎన్నికలు విశ్వసయనీతకు, విశ్వాస ఘాతుకానికి మధ్య జరుగుతున్న పోరాటమని అభివర్ణించారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు అవసరం లేదని తాను మొదటి నుంచీ చెబుతున్నానని తెలిపారు. నమ్ముకున్న వారిని కేసీఆర్ ఏ రకంగా అవమానించారో, వంచించారో ఇబ్రహీం, చెరుకు సుధాకర్‌లే నిదర్శనమంటూ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఆయన మాటల్లోనే..
దళితుడిని సీఎంగా, మైనారిటీని డిప్యూటీ సీఎంగా చేస్తానన్న సదరు నాయకుడు.. ఇప్పుడు ఆ వర్గాలకు టికెట్లు ఇస్తే గెలవరంటూ ఏవిధంగా పక్కనపెడుతున్నారో అర్థమవుతోంది.
మాయ మాటలతో ప్రచారం చేసుకుంటూ, మైండ్‌గేమ్ ఆడుతూ తన వల్లే తెలంగాణ వచ్చిందని ప్రజలను మభ్యపెడుతున్నారు.
టీఆర్‌ఎస్‌కు ఉన్న ఒకరిద్దరు ఎంపీలతో వెయ్యేళ్లు పోరాడినా తెలంగాణ రాదు. కేవలం సోనియా త్యాగనిరతి వల్లే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది. అందుకే ఈ ప్రాంత ప్రజలంతా ఆమెను తెలంగాణ తల్లిగా భావిస్తున్నారు.
తెలంగాణ ఇస్తే సోనియా ఇల్లు ఊడుస్తానని, టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు సీఎం కావాలనే ఆశతో పునర్నిర్మాణమంటూ మాయ మాటలు చెబుతున్నారు.
విశ్వసనీయతకు-విశ్వాస ఘాతుకానికి, మానవత్వానికి, దానవత్వానికి మధ్య జరిగే ఈ ఎన్నికల్లో ప్రజలు న్యాయం పక్షానే నిలబడి కాంగ్రెస్‌ను భారీ మెజారిటీతో గెలిపిస్తారనే ధీమా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సామాజిక న్యాయం, సమానత్వం సాధ్యమవుతుంది.
కాగా.. కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని తన నియోజకవర్గం నుంచే మొదలుపెడుతున్న విషయంపై స్పందిస్తూ... ‘‘తెలంగాణలో మొదటి నుంచి దొరలు, దళితుల మధ్యే పోరాటం జరుగుతోంది. ఆ సభ కూడా దొర అహంకారానికి, దళితుల మధ్య పోరుగానే భావిస్తున్నా’’ అని పేర్కొన్నారు.