సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ, ఉప ప్రణాళిక వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. మంగళవారం ఢిల్లీ తెలంగాణభవన్‌లోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వివేక్ తన్ఖాను నియమించిందని, ఆయన సానుకూలంగా వాదనలు వినిపిస్తున్నారని పేర్కొన్నారు.
వర్గీకరణ విషయంలో వివేక్ తన్ఖాను కలిసి పలు విషయాలు చర్చించామన్నారు. వర్గీకరణ విషయంలో చొరవ చూపిన సీఎం రేవంత్‌కు మాదిగ జాతి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణ అనేది ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. వర్గీకరణ చేయాలా వద్దా అనేది మాత్రమే సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందని, ఆ తర్వాత ఎంత శాతం ఇవ్వాలనేది జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
వాదనలకు హాజరైన మంత్రి, ఎమ్మెల్యేలు
సుప్రీంకోర్టులో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఎస్సీ వర్గీకరణపై విచారణ చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, తోట లక్ష్మీకాంతరావు, కవ్వంపల్లి సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, పీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్యతో కలిసి దామోదర రాజనర్సింహ విచారణకు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment