సంగారెడ్డి మున్సిపాలిటీ : మెదక్ ఉప ఎన్నికలను మాజీ డిప్యూటీ సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డిని ఎలాగైనా గెలిపించాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సంగారెడ్డి నియోజక వర్గ ప్రచార బాధ్యత దామోదర పైనే ఉంచడంతో ఆయన మరింత బాధ్యతగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సంగారెడ్డి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో పాటు బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తుండడంతో దామోదర సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరం చేశారు.
అయితే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గ్రామ స్థాయిలో కార్యకర్త్తలున్నా, నాయకులు లేకపోవడంతో ప్రచారం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. దీంతో రంగంలోకి దిగిన దామోదర రాజనర్సింహ జగ్గారెడ్డి వ్యవహార శైలి నచ్చక కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన వారిని మళ్లీ దగ్గరకు తీస్తున్నారు. సంగారెడ్డితో పాటు సదాశివపేట మండల, పట్టణ సీనియర్ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారు తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేలా చేయడంలో సఫలీకృతులయ్యారు. సదాశివపేటలో పార్టీకి ప్రజలకు సన్నిహిత సంబంధాలున్న మాజీ మున్సిపల్ చైర్మన్ మునిపల్లి సత్యనారాయణతో పాటు రామాగౌడ్‌లను పార్టీలో చేర్చుకొని పార్టీకి దూరమైన వారిని చే రదీశారు. ఇదే వ్యూహంతో సంగారెడ్డిలో సైతం కాంగ్రెస్‌కు మెజార్టీ ఓట్లు వచ్చేలా ప్రయత్నాలను ప్రారంభించారు.
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్య అనుచరుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ గోవర్దన్ నాయక్ బీజేపీలో చేరకుండా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేలా దామోదర ఒప్పించారు. మైనార్టీ వర్గాల ఓట్లపై ప్రభావం చూపే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ సాబెర్ కూడా కాంగ్రెస్‌ను వీడకుండా బుజ్జగించారు. ఇలా నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడంతో పాటు అదే స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్యకర్తల కోరిక మేరకు ఇంటింటి ప్రచారం, పాదయాత్రలు వంటి వాటిలో పాల్గొంటూ వారిని ఉత్తేజపరుస్తున్నారు. ఇప్పటికి సంగారెడ్డి మండలంతో పాటు మున్సిపల్ పరిధిలోని మెజార్టీ వార్డులలో ప్రచారం పూర్తిచేశారు.
ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ తనే అభ్యర్థి అనే భావంతో కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తంగా నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మెజార్టీ ఓట్లు సాధించాలనే పట్టుదలతో దామోదర అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో పాటు పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతిరోజు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుని వారికి మార్గనిర్దేశం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సునీతారెడ్డిని ఎలాగైనా గెలిపించాలని కేడర్‌కు నూరిపోస్తున్నారు.
కాంగ్రెస్ వ్యూహాత్మక ప్రచారం
Published Sun, Sep 7 2014 11:38 PM | Last Updated on Thu, Sep 27 2018 8:33 PM
Advertisement
Advertisement