సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ఉప ఎన్నికల ప్రచారం కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో నేతలు నోటికి పని పెంచారు.. సవాళ్లు.. ప్రతి సవాళ్లు విసురుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లకుండానే విలేకరుల సమావేశాలు పెట్టి మరీ తుపాకీ రాముడిని తలపిస్తూ తూటాలు పేల్చేస్తున్నారు. ఆపై సైడై పోతున్నారు.
మెదక్ ఉప ఎన్నికల ప్రచారం రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతోనే సరిపోతోంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్, బీజేపీ - టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ - టీడీపీ ముఖ్యనేతలు సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తుంటే, టీఆర్‌ఎస్ మంత్రి హరీష్‌రావు సహా ఇతర మంత్రులు వాటిని తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి హరీష్‌రావు, టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావులు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. మంత్రి హరీష్‌రావు సవాల్ స్వీకరించగా, టీడీపీ నేత ఎర్రబెల్లి సైడై పోయారు.
ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డి గెలిస్తే మంత్రి హరీష్‌రావు రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాల్ విసిరారు. జగ్గారెడ్డి ఎంపీగా గెలిస్తే మెదక్ నియోజకవర్గం గణనీయంగా అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. అయితే ఎర్రబెల్లి సవాల్‌ను సంగారెడ్డి, సిద్దిపేట ప్రచార సభల్లో మంత్రి హరీష్‌రావు ఈ నెల 4న స్వీకరించారు. బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి ఓడిపోతే ఎర్రబెల్లి దయాకర్‌రావు శాసనసభాపక్ష నేత పదవి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అంటూ ప్రతి సవాల్ విసిరారు.
మంత్రి హరీష్ సవాల్‌పై టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తక్షణమే స్పందిచలేక పోయారు. సోమవారం గజ్వేల్‌లో ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని మొదట సీఎం కేసీఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆ తర్వాతనే తాను మంత్రి హరీష్‌రావు సవాల్‌ను స్వీకరిస్తానంటూ సైడై పోయారు. ఇదిలా ఉంటే సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సవాల్ చేశారు.
జగ్గారెడ్డి హయాంలో సంగారెడ్డి అభివృద్ధి జరిగినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అయితే బీజేపీ నేతలు దీనిపై స్పందించలేదు. ఎంపీ బాల్క సుమన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి నీ బండారం బయటపెడతా, అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అంటూ సంగారెడ్డిలో సవాల్ విసిరారు. సుమన్ సవాల్‌పై రేవంత్ నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు.
సవాళ్లు.. ప్రతిసవాళ్లతో
Published Mon, Sep 8 2014 11:47 PM | Last Updated on Tue, Oct 16 2018 3:09 PM
Advertisement
Advertisement