BJP - News
-
కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి ఆ 11 మంది ఎమ్మెల్యేలు!
బెంగళూరు: దేశంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. ఏ రాష్ట్రంలో చూసినా హస్తం పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గోవా కాంగ్రెస్‌లో తిరుగుబాటు సంకేతాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గత శనివారం నిర్వహించిన పార్టీ సమావేశానికి ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. వారు బీజేపీతో టచ్‌లో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా బీజేపీ గోవా ఇంఛార్జ్, పార్టీ ప్రధాన కార్యదర్శి సీటీ రవి బాంబు పేల్చారు. గోవా కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైనట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నరని సీటీ రవి చేసిన ఈ ప్రకటనతో గోవా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. "11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. వారు వీలైనంత త్వరగా మాతో కలువనున్నారు. కాంగ్రెస్‌కు చెందిన చాలా మంది నాయకులు, శాసనసభ్యులు బీజేపీతో టచ్‌లో ఉన్నారు. వారు త్వరలోనే కాషాయ పార్టీలో చేరుతారని నమ్మకముంది." అని పేర్కొన్నారు సీటీ రవి. పార్టీలో ఫిరాయింపులకు పాల్పడేలా ప్రోత్సహిస్తున్నారనే కారణంతో మైకెల్ లోబో, దిగంబర్ కామత్‌లపై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైనట్లు సోమవారం ప్రకటించింది కాంగ్రెస్. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (మైకెల్ లోబో, దింగబర్ కామత్, కేదర్ నాయక్, రాజేశ్ ఫల్దేసాయ్, దెలియాలాహ్ లోబో)లు ఆదివారం అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ మరుసటి రోజునే కాంగ్రెస్ అనర్హత ప్రకటన చేసింది. ఆ తర్వాత లోబోను ప్రతిపక్ష నేతగా తొలగించింది కాంగ్రెస్. లోబో, కామత్‌లు బీజేపీతో టచ్‌లో ఉంటూ పార్టీ నేతలకు వలపన్నుతున్నారని ఆరోపించారు గోవా కాంగ్రెస్ ఇంఛార్జ్ దినేశ్ గుండురావు. అయితే.. వారు సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరై.. పార్టీలో ఎలాంటి సమస్య లేదని తేల్చి చెప్పారు. కర్ణాటకలోనూ చేరికలు.. కర్ణాటకలో రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు సీటీ రవి. 'మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌లు ముఖ్యమంత్రి పదవి కోసం కలలుకంటున్నారు.కాని అది ఎప్పటికీ జరగదు. ఇరువురి మధ్య సీఎం పోస్ట్ కోసం పోటీ నడుస్తోంది. దాంతో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. వారు త్వరలోనే బీజేపీలో చేరుతారు.' అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: కాంగ్రెస్‌లో కలవరం.. బీజేపీతో టచ్‌లో కీలక నేతలు! -
రాజస్థాన్ పీఠంపై బీజేపీ కన్ను.. ఎన్నికల సన్నద్ధత షురూ!
జైపుర్: దేశంలోని ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తూ తన ప్రబల్యాన్ని విస్తరించుకుంటోంది భారతీయ జనతా పార్టీ. తాజాగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే 2023లో శాసనసభ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌లో పాగా వేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జులై 10 నుంచి 12 వరకు మూడు రోజుల పాటు కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో సమావేశం కానున్నట్లు పేర్కొన్నాయి. రానున్న ఎన్నికల్లో విజయం సాధించేలా పార్టీ కార్యకర్తలు, నేతలకు ఈ క్యాంప్‌కు హాజరయ్యే జాతీయ స్థాయి నాయకులు ఎన్నికల వ్యూహాలను వివరించనున్నారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా వారికి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ శిబిరం ప్రారంభానికి ఒక రోజు ముందే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ జైపుర్ చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ట్రైనింగ్ క్యాంప్ అనంతరం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతు తెలిపిన హిందూ వ్యక్తి హత్యకు గురైన విషయం, ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులపై ఈ భేటీలో చర్చించనున్నారు. శిక్షణ శిబిరానికి వచ్చే నేతలెవరు? రాజస్థాన్‌లో మూడు రోజుల పాటు నిర్వహించి ట్రైనింగ్ క్యాంప్‌కు పలువురు జాతీయ స్థాయి నేతలు హాజరుకానున్నారు. అందులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు వీ సతీశ్, బీఎల్ సంతోష్, రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా, కేంద్ర మంత్రులు.. కైలాశ్ చౌదరి, అరుణ్ రామ్ మెఘ్వాల్, గజేంద్ర సింగ్ శేఖావత్, ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా, మాజీ ముఖ్యమంత్రి వసుందర రాజే సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. చదవండి: మేడమ్ టుస్సాడ్స్ నుంచి రోడ్డుపైకి బోరిస్ మైనపు విగ్రహం -
బండి పాదయాత్ర ఏర్పాట్లపై పార్టీ నిమగ్నం
సాక్షి, హైదరాబాద్: ఈనెల 24 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టనున్న పాద యాత్రకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై పార్టీ యంత్రాంగం దృష్టి పెట్టింది. మంగళవారం బీజేపీ కార్యాలయంలో పాదయాత్ర ప్రచార విభాగం, ప్రచార సామాగ్రి వితరణ విభాగం, అలంకరణ విభాగాలకు చెందిన ప్రముఖ్‌లతో పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్‌రెడ్డి, సహ ప్రముఖ్ తూళ్ల వీరేందర్ గౌడ్ సమావేశమయ్యారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. పాద యాత్ర సాగనున్న మార్గంలో వసతి, రక్షణ, ప్రచార రథాలు, భోజన ఏర్పాట్ల కోసం స్థలాల పరిశీలనలో కమిటీ సభ్యులు నిమగ్నమయ్యారు. మొదటిదశ యాత్రలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మంగళవారం ఈ సభ్యులు పర్యటించారు. పాదయాత్రలో గోల్కొండ కోట, ఆరె మైసమ్మ దేవాలయం, మొయినాబాద్ క్రాస్ రోడ్, చేవెళ్ల క్రాస్ రోడ్, వికారాబాద్, మోమి న్‌పేట, సదాశివపేట ప్రాంతాల్లో బహిరంగసభలకు అనువైన స్థలాలను పరిశీలించారు. -
సవాళ్లు.. ప్రతిసవాళ్లతో
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ఉప ఎన్నికల ప్రచారం కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో నేతలు నోటికి పని పెంచారు.. సవాళ్లు.. ప్రతి సవాళ్లు విసురుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లకుండానే విలేకరుల సమావేశాలు పెట్టి మరీ తుపాకీ రాముడిని తలపిస్తూ తూటాలు పేల్చేస్తున్నారు. ఆపై సైడై పోతున్నారు. మెదక్ ఉప ఎన్నికల ప్రచారం రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతోనే సరిపోతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ - టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ - టీడీపీ ముఖ్యనేతలు సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తుంటే, టీఆర్ఎస్ మంత్రి హరీష్‌రావు సహా ఇతర మంత్రులు వాటిని తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి హరీష్‌రావు, టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావులు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. మంత్రి హరీష్‌రావు సవాల్ స్వీకరించగా, టీడీపీ నేత ఎర్రబెల్లి సైడై పోయారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డి గెలిస్తే మంత్రి హరీష్‌రావు రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాల్ విసిరారు. జగ్గారెడ్డి ఎంపీగా గెలిస్తే మెదక్ నియోజకవర్గం గణనీయంగా అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. అయితే ఎర్రబెల్లి సవాల్‌ను సంగారెడ్డి, సిద్దిపేట ప్రచార సభల్లో మంత్రి హరీష్‌రావు ఈ నెల 4న స్వీకరించారు. బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి ఓడిపోతే ఎర్రబెల్లి దయాకర్‌రావు శాసనసభాపక్ష నేత పదవి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అంటూ ప్రతి సవాల్ విసిరారు. మంత్రి హరీష్ సవాల్‌పై టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తక్షణమే స్పందిచలేక పోయారు. సోమవారం గజ్వేల్‌లో ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని మొదట సీఎం కేసీఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆ తర్వాతనే తాను మంత్రి హరీష్‌రావు సవాల్‌ను స్వీకరిస్తానంటూ సైడై పోయారు. ఇదిలా ఉంటే సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సవాల్ చేశారు. జగ్గారెడ్డి హయాంలో సంగారెడ్డి అభివృద్ధి జరిగినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అయితే బీజేపీ నేతలు దీనిపై స్పందించలేదు. ఎంపీ బాల్క సుమన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి నీ బండారం బయటపెడతా, అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అంటూ సంగారెడ్డిలో సవాల్ విసిరారు. సుమన్ సవాల్‌పై రేవంత్ నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు.