బెంగళూరు: దేశంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. ఏ రాష్ట్రంలో చూసినా హస్తం పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గోవా కాంగ్రెస్‌లో తిరుగుబాటు సంకేతాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గత శనివారం నిర్వహించిన పార్టీ సమావేశానికి ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. వారు బీజేపీతో టచ్‌లో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా బీజేపీ గోవా ఇంఛార్జ్, పార్టీ ప్రధాన కార్యదర్శి సీటీ రవి బాంబు పేల్చారు. గోవా కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైనట్లు కనిపిస్తోంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నరని సీటీ రవి చేసిన ఈ ప్రకటనతో గోవా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. "11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. వారు వీలైనంత త్వరగా మాతో కలువనున్నారు. కాంగ్రెస్‌కు చెందిన చాలా మంది నాయకులు, శాసనసభ్యులు బీజేపీతో టచ్‌లో ఉన్నారు. వారు త్వరలోనే కాషాయ పార్టీలో చేరుతారని నమ్మకముంది." అని పేర్కొన్నారు సీటీ రవి.
పార్టీలో ఫిరాయింపులకు పాల్పడేలా ప్రోత్సహిస్తున్నారనే కారణంతో మైకెల్ లోబో, దిగంబర్ కామత్‌లపై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైనట్లు సోమవారం ప్రకటించింది కాంగ్రెస్. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (మైకెల్ లోబో, దింగబర్ కామత్, కేదర్ నాయక్, రాజేశ్ ఫల్దేసాయ్, దెలియాలాహ్ లోబో)లు ఆదివారం అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ మరుసటి రోజునే కాంగ్రెస్ అనర్హత ప్రకటన చేసింది. ఆ తర్వాత లోబోను ప్రతిపక్ష నేతగా తొలగించింది కాంగ్రెస్. లోబో, కామత్‌లు బీజేపీతో టచ్‌లో ఉంటూ పార్టీ నేతలకు వలపన్నుతున్నారని ఆరోపించారు గోవా కాంగ్రెస్ ఇంఛార్జ్ దినేశ్ గుండురావు. అయితే.. వారు సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరై.. పార్టీలో ఎలాంటి సమస్య లేదని తేల్చి చెప్పారు.
కర్ణాటకలోనూ చేరికలు..
కర్ణాటకలో రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు సీటీ రవి. 'మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌లు ముఖ్యమంత్రి పదవి కోసం కలలుకంటున్నారు.కాని అది ఎప్పటికీ జరగదు. ఇరువురి మధ్య సీఎం పోస్ట్ కోసం పోటీ నడుస్తోంది. దాంతో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. వారు త్వరలోనే బీజేపీలో చేరుతారు.' అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్‌లో కలవరం.. బీజేపీతో టచ్‌లో కీలక నేతలు!
Comments
Please login to add a commentAdd a comment