సాక్షి, సంగారెడ్డి: ‘ఏం చేద్దాం...ఎలా చేద్దాం..ఏం చేసినా సరే మన పార్టీ కొచ్చే మెజార్టీ చూసి మిగతా పార్టీల వారికి మతిపోవాలె’ గులాబీ ముఖ్య నేతల నిర్ణయం.
మెదక్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్ భారీ మెజార్టీ కోసం వ్యూహాలు రచిస్తోంది. మెజార్టీ సాధన కోసం మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో శనివారం ఉప ఎన్నికల బాధ్యతలు చేపట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు రహస్యంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్స్‌లో జరిగిన ఈ భేటీలో డిప్యూటీ సీఎం రాజయ్య, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటెల రాజేందర్, పద్మారావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్.సత్యనారాయణ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నట్లు సమాచారం.
మెదక్ ఉప ఎన్నికల సరళిపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్న సీఎం కేసీఆర్, మెజార్టీ సాధనకు సంబంధించి జిల్లా నాయకత్వానికి పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ సూచన మేరకు ఉప ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టిన ముఖ్య నేతలంతా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మెదక్ ఉప ఎన్నికలు జరుగుతున్న ఏడు నియోజకవర్గాల్లో పార్టీ చేపడుతున్న ప్రచార కార్యక్రమాల గురించి లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రజల్లోకి మరింతగా వెళ్లి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించాలని మంత్రి హరీష్‌రావు ఎమ్మెల్యేలకు సూచించినట్లు సమాచారం.
ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారం ముమ్మరం చేయటంతోపాటు కాంగ్రెస్, బీజేపీ విమర్శలకు గట్టిగా తిప్పికొట్టాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సన్నాహాలకు సంబంధించి డిప్యూటీ సీఎం రాజయ్య, మంత్రి హరీష్‌రావు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన మంత్రులు, ఎమ్మెల్యేలు కీలకనిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
2 లక్షల మందితో కేసీఆర్ సభ
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 10న నర్సాపూర్‌లో జరగనున్న సీఎం కేసీఆర్ సభను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో హైదరాబాద్ శివారులో జరిగిన భేటీలో టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం సభపై చర్చించినట్లు సమాచారం. కనీసంగా 2 లక్షల మందితో సీఎం ఎన్నికల ప్రచార బహిరంగ సభను నిర్వహించాలని, ఇందుకు కోసం జిల్లా నలుమూలల నుంచి భారీ ఎత్తున జనసమీకరణ చేపట్టాలని తీర్మానించినట్లు తెలిసింది.
దుమ్ము రేపాలి
Published Sun, Sep 7 2014 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM
Advertisement