భలే జంపర్
బీజేపీలో చేరి కమల తీర్థం పుచ్చుకున్నాడు. ఇక్కడ లాభం లేదనుకుని ఆ వెంటనే టీఆర్ఎస్ కండువా కప్పుకున్నాడు. ఎమ్మెల్యే అయ్యాడు. ఇక్కడ ఎంటోగా ఉంది అంటూ అప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న హస్తం గూటికి చేరాడు. అక్కడ ప్రభుత్వ వీప్ పదవిని అందుకున్నాడు... మా తెలంగాణ మాకు కావాలే అంటూ ఆ ప్రాంత నాయకులు ఉద్యమిస్తున్న సమయంలో కూడా 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండాలంటూ సమైక్యాంధ్ర నేతల గొంతుతో గొంతు కలిపి ఎలుగెత్తి నినదించాడు. కానీ విభజన జరిగిపోయింది. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి. హస్తం పార్టీ టిక్కెట్పై పోటీ చేసి ఓడిపోయాడు. ఇంతలో మెదక్ లోక్సభ ఉప ఎన్నిక వచ్చింది. అక్కడ హస్తం గెలిచి తీరాలని అధిష్టానం నిర్ణయించింది. అందుకోసం జిల్లా అధ్యక్షుడిగా ఆయన పేరును ఖరారు చేసింది.
ఉప ఎన్నికల నామినేషన్ గడువు ముగుస్తున్న సమయంలో... కమలం పార్టీలోకి జంప్ చేసి.... ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి... ఓటమి పాలైయ్యాడు. కేంద్రంలో మోడీ హవా కొనసాగుతున్నా.... సైకిల్తో చెట్టా పట్టాలు వేసుకుని పోటీ చేసిన మూడో స్థానంలో నిలబడాల్సి వచ్చింది. దీంతో ఆయనగారు కాస్త కంగారు పడ్డారు. కారు, కాషాయం కన్నా హస్తం ముద్దంటూ మళ్లీ ఆ గూటిలోకి చేరేందుకు మరోసారి జంపింగ్ జపాంగ్ రాగాన్ని అందుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరనేగా... ఆయనే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి. త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేస్తున్నారని సమాచారం.
పార్టీ నుంచే బయటకు వెళ్లే వారే కానీ పార్టీలోకి వచ్చే వారు లేని ఆ పార్టీలో జగ్గారెడ్డి ఎంత కాలం మనగలుగుతారో లేక మళ్లీ జంపింగ్ రాగాన్ని అందుకుంటారో చూడాలి. కాంగ్రెస్ లో చేరే విషయంపై ఇప్పటికే జగ్గారెడ్డి జిల్లా సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపారు. అందుకు కొందరు సానుకూలంగా స్పందించినా.. అత్యధికులు మాత్రం వ్యతిరేకించారని సమాచారం. అలాగే గతంలో జిల్లాలో జరిగిన మతఘర్షణల్లో జగ్గారెడ్డి ప్రమేయం ఉందంటూ పోలీసు కేసు నమోదయిన సంగతి తెలిసిందే. దీంతో జగ్గారెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీకి లాభమా లేక నష్టమా అనేది కాలమే చెప్పాలి. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంపింగ్ ల మీద జంపింగ్ లు చేసి ఈ నాయకుడు మంచి జంపర్ గా పేరు సంపాదించారు.