లక్ష్యాలను సాధించేందుకే ‘రైతుహిత’
సంగారెడ్డి టౌన్, న్యూస్‌లైన్: దిగుబడిలో లక్ష్యాలను సాధించేందుకు రైతుహిత సదస్సులను నిర్వహిస్తున్నట్టు జేసీ ఎ.శరత్ అన్నారు. శుక్రవారం స్థానిక హైదరాబాద్ ఫంక్షన్‌హాల్‌లో రైతుహిత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేసీ శరత్, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లక్ష్యాలను చేరుకునేందుకు ఈ సదస్సులు ఎంతగానో దోహదపడతాయన్నారు. పంటల సాగును బట్టి రైతులు అవలంబించాల్సిన యాంత్రీకరణ పద్ధతులను తెలియజేయనున్నట్టు తెలిపారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందేవిధంగా రైతులు కృషి చేయాలని సూచించారు.
అధునాతన పద్ధతులు పాటించడంతోపాటు ఆరుతడి పంటలపై ఎక్కువ శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, ఆదర్శరైతుల సూచనలతోపాటు సందేహాలను నివృత్తి చేసుకోవాలని వివరించాలన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న రైతులు డ్రిప్పు, వరి, ఆరుతడి పంటలపై తమకున్న అవగాహనను తోటి రైతులకు వివరించారు. రైతు అనుబంధ శాఖలైన పశుసంవర్ధక, ఉద్యాన, పట్టుపరిశ్రమ, మత్స్యశాఖ, నీటి యాజమాన్య సంస్థ, పాడిపరిశ్రమ శాఖలు ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలు రైతులను ఎంతగానో ఆకర్శించాయి. అనంతరం పంటలు నష్టపోయిన రైతులకు సీఎం సహాయనిధి ద్వారా చెక్కులను పంపిణీ చేశారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, ఉద్యాన శాఖ ఏడీ శేఖర్. ఎంఐపీ పీడీ రామలక్ష్మి, ఏడీ సెరికల్చర్ ఈశ్వరయ్య, పశుసంవర్ధక శాఖ జేడీ లక్ష్మారెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, వ్యవసాయ శాఖ చైర్మన్లు, రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.