sangareddy town
-
పీడీలకు శారీర దారుఢ్య పరీక్షలు
సంగారెడ్డి టౌన్: జిల్లాలోని ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మైదానంలో శారీర దారుఢ్య పరీక్షలు నిర్వహించామని డీఎస్డీఓ హరినాథ్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 94 మంది పురుషులు, 12 మహిళా అభ్యర్థులు హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో పీడీ సురేందర్ సింగ్, వ్యాయామ ఉపాధ్యాయులు మశ్చెందర్, దుర్గాప్రసాద్, కిష్టయ్య, జిమ్నాస్టిక్ కోచ్ దేవిక తదితరులు పాల్గొన్నారు. -
ఝండా ఉంఛారహే హమారా
సంగారెడ్డిలో ఘనంగా తిరంగా యాత్ర సంగారెడ్డి టౌన్: బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఘనంగా తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఐబీ నుండి సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ విగ్రం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనా రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పటేల్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా తిరంగా యాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, ఎస్పీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండాపురం జగన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విష్ణువర్దన్ రెడ్డి, చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షులు నాగరాజు, మండల అధ్యక్షులు నర్సింహా రెడ్డి, యువ మోర్చ నాయకులు విష్ణు, విజయ్, పవన్, ద్వారక రవి, సుదీర్ రెడ్డి, విద్యార్థులు, బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తు పాల్గొన్నారు. -
విషాద బంధం సంగారెడ్డిలో ఘోరం..
- పట్టణ శివార్లలో నలుగురి మృతదేహాలు - ఇద్దరు చిన్నారులతో కలిసి జంట ఆత్మహత్య - కలతలు, కలహాలే కారణం?! సంగారెడ్డి క్రైం: మెదక్ జిల్లా సంగారెడ్డి పట్టణ శివారులో సోమవారం నలుగురి మృతదేహాలు బయటపడిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మూడు రోజుల క్రితమే వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే మృతుల వివరాలు తెలియక చాలాసేపు గందరగోళం నెలకొంది. వివరాల్లోకి వెళితే... మహబూబ్‌నగర్ జిల్లా ఖిలాఘనపురం మండలం కమాలొద్దీన్పూర్కు చెందిన రాజు (35) పదిహేనేళ్లుగా హైదరాబాద్‌లోని మియాపూర్, మదీనాగూడ, కొండాపూర్ ప్రాంతాల్లో ఉంటున్నాడు. అతను రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన అనిత(30)వివాహేతర సంబంధం కొనసగిస్తూ ఆమె ఇద్దరు కుమార్తెలు అఖిల (14), ఉమ (12)తో కలిసి ప్రస్తుతం దీప్తిశ్రీనగర్ ప్రాంతంలోని గుడిసెలో నివాసం ఉంటున్నారు. మూడు రోజుల క్రితం ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకుని మల్కాపూర్ గ్రామ శివారుకు వచ్చిన రాజు, అనిత జాతీయ రహదారి సమీపంలో శీతల పానీయంలో పురుగుల మందు కలుపుకొని తాగినట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది. దీప్తిశ్రీనగర్‌లో కలకలం... మృతుడు రాజు కొన్నేళ్లుగా ఎంఏ నగర్ తదితర ప్రాంతాల్లో ఫాస్ట్‌ఫుడ్ బండి నడుపుకునేవాడు. చాలాకాలంగా కాలనీలో ఉంటున్నా ఎవరితోనూ పెద్దగా మాట్లాడే వాడు కాదని స్థానికులు పేర్కొన్కానరు. సోమవారం రాత్రి వారు నలుగురు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. 8 నెలల క్రితమే వివాహం.. వివాహేతర సంబంధం.. కుటుంబ కలహాల కారణంగానే నలుగురు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతుడు రాజు (30)కు 8 నెలల క్రితమే అడ్డాకుల మండలం దాసరిపల్లికి అక్క కూతురు అరుణ అలియాస్ రాధతో వివాహం జరిగింది. అయితే అతను తన భార్యతో కలిసి హైదరాబాద్‌లో ఉంటూనే ఆమెకు తెలియకుండా అనితతో వివాహేతర సంబంధాన్ని సాగిస్తున్నాడు. అయితే అతను గత కొద్ది రోజులుగా దిగాలుగా ఉంటున్నట్లు బంధువులు పేర్కొన్నారు. కుటుంబ కలహాలు కారణంగానే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని సంగారెడ్డి పోలీసులు అనుమానిస్తున్నారు. -
లక్ష్యాలను సాధించేందుకే ‘రైతుహిత’
సంగారెడ్డి టౌన్, న్యూస్‌లైన్: దిగుబడిలో లక్ష్యాలను సాధించేందుకు రైతుహిత సదస్సులను నిర్వహిస్తున్నట్టు జేసీ ఎ.శరత్ అన్నారు. శుక్రవారం స్థానిక హైదరాబాద్ ఫంక్షన్హాల్లో రైతుహిత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేసీ శరత్, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లక్ష్యాలను చేరుకునేందుకు ఈ సదస్సులు ఎంతగానో దోహదపడతాయన్నారు. పంటల సాగును బట్టి రైతులు అవలంబించాల్సిన యాంత్రీకరణ పద్ధతులను తెలియజేయనున్నట్టు తెలిపారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందేవిధంగా రైతులు కృషి చేయాలని సూచించారు. అధునాతన పద్ధతులు పాటించడంతోపాటు ఆరుతడి పంటలపై ఎక్కువ శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, ఆదర్శరైతుల సూచనలతోపాటు సందేహాలను నివృత్తి చేసుకోవాలని వివరించాలన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న రైతులు డ్రిప్పు, వరి, ఆరుతడి పంటలపై తమకున్న అవగాహనను తోటి రైతులకు వివరించారు. రైతు అనుబంధ శాఖలైన పశుసంవర్ధక, ఉద్యాన, పట్టుపరిశ్రమ, మత్స్యశాఖ, నీటి యాజమాన్య సంస్థ, పాడిపరిశ్రమ శాఖలు ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలు రైతులను ఎంతగానో ఆకర్శించాయి. అనంతరం పంటలు నష్టపోయిన రైతులకు సీఎం సహాయనిధి ద్వారా చెక్కులను పంపిణీ చేశారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, ఉద్యాన శాఖ ఏడీ శేఖర్. ఎంఐపీ పీడీ రామలక్ష్మి, ఏడీ సెరికల్చర్ ఈశ్వరయ్య, పశుసంవర్ధక శాఖ జేడీ లక్ష్మారెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, వ్యవసాయ శాఖ చైర్మన్లు, రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.