Amma mata
-
అమ్మ మాట..
తెలంగాణ కోసం నా కొడుకు చనిపోవడం గర్వంగా ఉంది నా కొడుకు జీవన్ తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసినందుకు గర్వంగా ఉంది. వాడెప్పుడూ తెలంగాణ కోసమే ఆవేదన చెందేవాడు. ఆ ఆవేదనే కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పింది. 2010, జనవరి 28 జీవన్ చనిపోయిండు. ఆ తర్వాత నాలుగేళ్లకు తెలంగాణ అచ్చింది. తెలంగాణ అచ్చినందుకు సంతోషంగా ఉన్నా కొడుకు లేడని బాధగా ఉంది. కొత్త రాష్ట్రంలోనైనా యువకులకు ఉద్యోగాలివ్వాలి. రైతులకు సాగునీరు, కరెంటు అందించాలి. ప్రాజెక్టులు కట్టించి బీడు భూములను సాగులోకి తీసుకురావాలి. భవిష్యత్తులో ఏ బిడ్డా ఉద్యోగాల లేవని చనిపోకూడదు. చదువుకున్నోళ్లందరకు ఉద్యోగాలివ్వాలి. చదువు కూడా అందరికీ ఉచితంగా చెప్పాలి. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలి. మహిళలకు కడుపుకోత లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. కరెంటు ఎక్కువ తయారుచేసి అందరికీ కోతల్లేకుండా అందించాలి. గ్రామాల్లో రోడ్లు, మంచినీరు సక్రమంగా అందించాలి. ఆస్పత్రుల్లో పేదలందరికీ మెరుగైన వైద్యం అందించాలి. అన్ని సౌకర్యాలు కల్పించాలి. తెలంగాణలో మరే తల్లికి కడుపుకోత ఉండకుండా చూసుకోవాలి. - సేకరణ: రాజశేఖర్, జగిత్యాల -
మరే బిడ్డ ఉద్యమబాట పట్టకూడదు
అమ్మ మాట.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమవుతుండడంతో ఆందోళన చెందిన నా కొడుకు రామకృష్ణ గతేడాది సాగర్ కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకును పోగొట్టుకుని కుటుంబ పోషణకు అష్టకష్టాలు పడుతున్నాం. నా భర్త అనారోగ్యంతో మంచంపట్టి నరకం అనుభవిస్తున్నాడు. మాలాంటి వారికి గుండె ధైర్యం కల్పించే పాలన రావాలి. తెలంగాణ రాష్ట్రంలో మరేబిడ్డ ఉద్యమబాట పట్టకుండా అభివృద్ధి చేయాలి. అప్పుడే ఆత్మత్యాగం చేసిన బిడ్డల ఆత్మలు శాంతిస్తాయి. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి పేదకు రెండు గదులతోపాటు వంటగది ఉండేలా పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి. పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించాలి. రేషన్ షాపుల ద్వారా నెలకు ఒకరికి పది కిలోల చొప్పున నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలి. అలాగే నెలకు సరిపడా పప్పులు, ఉప్పు, నూనె అందిస్తే ఆకలి బాధలు ఉండవు. మద్యాన్ని నిషేధించాలి. ప్రతి పల్లెకు మినరల్ వాటర్ పంపిణీ చేయాలి. అమరుల జ్ఞాపకార్థం ప్రభుత్వమే విగ్రహాలు, స్థూపాలు ఏర్పాటు చేయాలి. వారి కుటుంబాలకు రైలు, బస్‌పాస్‌లు అందించాలి. బిడ్డను పోగొట్టుకుని పుట్టెడు కష్టాల్లో ఉన్న మాలాంటి వారికి వృద్ధాప్యంలో పింఛన్ ఇవ్వాలి. - మాదినేని శ్రీనివాసరావు, ఖమ్మం అర్బన్ -
ఒక్కరికన్నా ఉద్యోగమివ్వాలె
అమ్మ మాట.. నా కొడుకు గోదరి రాజేందర్ గవర్నమెంట్ టీచర్. చందుర్తి మండలం బండపల్లిలో పని చే సేటోడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటోడు. 2011 జూలై 31న తెలంగాణ కోసం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నడు. ప్రభుత్వ కొలువున్నా.. నా కొడుకు తెలంగాణ కోసం చనిపోయిండంటే తెలంగాణ ఎంత ముఖ్యమో నాకు అప్పుడే ఎరుకైంది. నా కొడుకు సదువుకున్నోడు అయినందునే ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకపోయిండు. తెలంగాణ రాదనే బెంగతో చనిపోయిండు. ఇప్పుడు తెలంగాణ అచ్చింది కాబట్టి తెలంగాణ కోసం పాణాలు తీసుకున్నోళ్ల కుటుంబాలను ఆదుకోవాలి. వారి కుటుంబాల్లో ఇంటికో ఉద్యోగం ఇయ్యాలి. వారి తల్లిదండ్రలకు పెన్షన్ ఇయ్యాలి. పేదలకూ జీవించే అవకాశం కల్పించాలి. వారికి తిండి, బట్ట, ఆశ్రయం కల్పించాలి. నాయకులందరూ నిజాయితీగా పనిచేయాలి. గప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందుతది. అమరవీరులకు కూడా ఆత్మశాంతి కలుగుద్ది. - సేకరణ: లక్ష్మారెడ్డి, తిమ్మాపూర్ -
అమ్మ మాట.. నౌకరీలు దొరికితేనే ఆత్మ శాంతిస్తది
నా భర్త దుబాయికి పోయిండు. నాకు ఇద్దరు కొడుకులు. పెద్దోడు భాస్కర్, చిన్నోడు ప్రభాకర్. కూతురు ధనలక్ష్మి. పెద్దోడు కోరుట్లలో 2009లో డిగ్రీ సదువుకుంటూ తెలంగాణ ఉద్యమంలో తిరిగేటోడు. సదువుతుండంగనే కుటుంబానికి ఆసరా కోసం వర్షకొండలోని వైన్‌షాపులో పనిజేసేటోడు. కుటుంబం ఎల్లదీసుడు కష్టంగా ఉంటుండేది. ‘తెలంగాణ అస్తే మనకు ఈ గోస ఉండదే, నాన్న దుబాయికి పోయె పనుండది, నువ్వు బీడీలు చేసి కష్టపడే అవసరం ఉండది, నా అసోంటోళ్లకు ఉద్యోగాలు అత్తయని ’ చెప్పేటోడు. ఏమైందో తె ల్వదు గానీ 2011 ఫిబ్రవరి 9న వైన్‌షాపులోనే జేబులో లెటరు పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నడు. లెటర్ల తెలంగాణ కోసం సచ్చిపోతున్నానని రాసిండు. గిప్పుడు తెలంగాణ వచ్చింది. కొడుకుంటే ఎంత సంబరపడేటోడో. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నం కాబట్టి గిప్పుడైనా మా బాధలు తీరాలి. అందరం బాగుపడాలి. అందరికీ న్యాయం జరగాలి. నా కొడుకులసుంటి పిలగాల్లకు నౌకరీలు దొరికితే నా కొడుకు ఆత్మశాంతిస్తది. - సేకరణ: చంద్రశేఖర్, కోరుట్ల -
అమ్మ మాట..
సదువుకునేటోళ్లు సస్తనే వస్తదా? తెలంగాణ రాష్ర్టమొచ్చిందని తెల్వంగనే అందరూ పండగ జేసుకున్నరు. అరవైయేండ్ల నుంచి పోరాడుతుంటే గీనాటికి మన కల తీరిందని మురిసిండ్రు. గా దినాన నా అసొంటి తల్లులు సంతోషపడాల్నా, ఏడ్వాల్నా అర్థంకాలే. ‘మీ బిడ్డల పుణ్యమే...’అని చానమంది నాయకులు మా ఇంటికొచ్చి చెబుతుంటే ఏడుస్తనే సంబరాలు చేసుకున్నం. నా బిడ్డ వయసు పద్దెనిమిదేండ్లు ఉంటది. ముక్కపచ్చలారని గసొంటి పొరగాళ్లు పాణమిడిస్తనే రాష్ర్టమొచ్చేదేందో నాకర్థమైతలే. నాలుగేండ్ల కింద నాయకులు ఉద్యమం పేరుజెప్పి దినానికో ముచ్చట జెప్పిటోళ్లు. ఆత్మహత్యలు చేసుకుంటనే రాష్ర్టమొస్తదని నమ్మిన నా కొడుకులాంటోళ్లు బలవంతపుచావు సచ్చిండ్రు. నాకిద్దరు కొడుకులు. పెద్దోడు రాజకుమార్. పదోతరగతి చదివిండు. ఉద్యమంలా తిరగాలని ఏ పొద్దువోయేటోడు...ఎప్పటికొచ్చేటోడో వాడికే తెలిసేది కాదు. నేను, నా భర్త పొద్దుగాల్నే వ్యవసాయం పనులకు పోయేటోళ్లం. ఇద్దరం కష్టవడితేగాని ఇల్లు గడ్వదు. ‘పెద్దోని సదువైనంక, కొలువుకు పోయినంక...నేను పొలానికి రానే’ అనేదాన్ని నా భర్తతో. ఇంకెక్కడి పెద్దోడు. ఒకరోజు మేం పొలానికి వోయినంక ఇంట్ల ఉరేసుకున్నడు. దోస్తలందరికి తెలంగాణకోసం సచ్చిపోతున్న అని చెప్పిండంట. ఈ వయసల మాకొచ్చే కష్టం కాదది. ఏ తల్లికీ రాకూడని కష్టం. తెలంగాణ రాష్ర్టమొచ్చినంక మస్తుమంది నాయకులొచ్చి మమ్మల్ని పలకరించ పోతుండ్రు. బతికున్నంతకాలం బిడ్డ చావు ముచ్చట చెప్పుకుంటూ బతుకుడు తప్ప మాకేం వచ్చేది లేదు. నా చిన్నకొడుక్కు మంచి కొలువొస్తే అది పెద్దోని పుణ్యమనుకుంటం. సేకరణ : భువనేశ్వరి, ఫొటో: ఆర్. కృష్ణారెడ్డి -
అమ్మ మాట
‘తల్లి తెలంగాణ’ కోసం తమకు కడుపు కోత మిగిల్చినా, వారు ఆశించిన తెలంగాణ వస్తే చాలంటున్నారు అమరవీరుల తల్లిదండ్రులు. తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్నోళ్లందరికీ ఉద్యోగాలివ్వాలంటున్నారు. పల్లెలు పచ్చగుండాలని, అన్ని వసతులున్న తెలంగాణను కోరుకుంటున్నారు. అప్పుడే నవతెలంగాణ సాధ్యమని, తమ బిడ్డల ఆత్మ శాంతిస్తుందని చెబుతున్నారు. పెంచాల విజయ, వెంకటేశ్ తల్లి, సిరిసిల్ల గ్రామం, కరీంనగర్ జిల్లా నా కొడుకు వెంకటేశ్ ఇంటర్ చదువుకున్నడు. తెలంగాణ అస్తే ఉద్యోగాలు వస్తయ్.. అందరికీ బాగా జరుగతది అనేటోడు. తెలంగాణ ఉద్యమంలో మస్తు తిరిగిండు. 23 డిసెంబర్, 2010న పెయ్యిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నడు. కాలిన గాయాలు సలుపుతున్నా జై తెలంగాణ అంటూ నినాదాలు జేసిండు. తర్వాత ఆస్పత్రిలో సచ్చిపోయిండు. ఆడు సచ్చిపోయిన గిన్ని రోజులకు తెలంగాణ అచ్చింది. నా బిడ్డ ఆత్మ గిప్పుడు శాంతిస్తుంది. నా కొడుకు సచ్చిపోయిన రోజు ఆళ్లు, ఈళ్లు వచ్చి ఆదుకుంట మన్నరు. ఎవలూ రాలే. ఆదుకోలే. పత్తేరబోతూ కైకిలి చేసుకుంట బతుకుతున్న. లక్ష రూపాయల బాకీ ఉంది. మూడు వారాల తేడాలోనే భర్త, కొడుకును పోగొట్టుకున్న. ఒక్కదాన్నే బతుకుతున్న. గిప్పుడు నా కొడుకుంటే సంబరపడు. తెలంగాణ అచ్చింది కాబట్టి ఇప్పుడైనా సదువుకున్న పోరగాళ్లందరికీ ఉద్యోగాలివ్వాలి. - సేకరణ: వూరడి మల్లిఖార్జున్, సిరిసిల్ల -
స్వర్గంల కొడుకు ఆత్మ నిమ్మలం
అమ్మ మాట: ‘తల్లి తెలంగాణ’ కోసం తమకు కడుపు కోత మిగిల్చినా, వారు ఆశించిన తెలంగాణ వస్తే చాలంటున్నారు అమరవీరుల తల్లిదండ్రులు. తెలంగాణ రాష్ట్రంలో సదువుకున్నోళ్లందరికీ ఉద్యోగాలివ్వాలంటున్నారు. పల్లెలు పచ్చగుండాలని, అన్ని వసతులున్న తెలంగాణను కోరుకుంటున్నారు. అప్పుడే నవ తెలంగాణ సాధ్యమని, తమ బిడ్డల ఆత్మ శాంతిస్తుందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నా కొడుకు లేకపోయె బిడ్డా. తెలంగాణ రావాలని భోజ్యా ఎప్పుడూ అంటుండే. తెలంగాణ అయితే ఉద్యోగాలు ఒత్తయ్ అవ్వా అనేటోడు. మంచి ఉద్యోగం చేసి బాగా సాదుత అనేటోడు. పార్టీలోళ్ల గడికోమాటకు నా కొడుకు బలైండు. వాడు కలగన్న తెలంగాణ వచ్చింది గని వాడు లేడాయె. గిప్పుడు నా భోజ్యా ఉండుంటే మంచిగుండు. ఏం జెత్త బిడ్డ. మా రాత గిట్లయిపాయె. నా కొడుకు అనుకున్న తెలంగాణ వచ్చినందుకు సంబురపడాల్నో, వాడు లేడని ఏడువాలో తెలుస్తలేదు. గిప్పుడు తెలంగాణ ఏర్పడింది. గి దీంతోని స్వర్గంలో ఉన్న నా కొడుకు పాణం నిమ్మలమైంది. చేతికి వచ్చే కొడుకు పోయిండు. మా బాధలు ఎట్లా తీరాలె బిడ్డా. పిల్లల సావు.. అయ్యవ్వలకు చెప్పలేని గోస. అది ఎవలికి రావద్దు. తెలంగాణ అంటే మొదట్లో తెల్వకపోయేటిది. నా కొడుకు అన్నంకనే ఏందో తెలిసింది. వాడు పోయినంక ఇంకొంచెం ఎరుకైంది. నాయం జరుగాలంటే తెలంగాణ కావాలన్నారు. చానా మంది కొట్లాడిండ్లు. పాణాలు పోగొట్టొకున్నరు. ఇప్పుడు వచ్చింది. ఇప్పటికైన అందరు మంచిగుం డాలె. అందరి కడుపులు సల్లగుండాలె. రాజకీయాలు ఎమోగని తెలంగాణతో అందరు మంచిగుండాలె. పంటలు బాగా పండితే అందరికి తిండి ఉంటది. సదువుకుంటె కొలువులు రావాలె. - మంగ్తి, భోజ్యానాయక్ తల్లి, వీరారెడ్డి తండా గ్రామం, రఘునాథపల్లి మండలం, వరంగల్ జిల్లా సేకరణ: పల్ల రవి, రఘునాథపల్లి అడగండి చెబుతా.. ఓటరు సందేహాలకు ఈసీ సమాధానాలు ఎన్నికల సమయంలో ఎన్నెన్నో ప్రశ్నలు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు.. కార్డులో తప్పులు.. ఉద్యోగుల ఇబ్బందులు.. వేలిపై సిరా మరకలు.. ఇంకా ఎన్నో సందేహాలు.. ఇలాంటివాటికి పరిష్కార మార్గాలను భన్వర్‌లాల్ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తారు. మీ ప్రశ్నలు మాకు పంపండి - ఎలక్షన్ సెల్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్, లేదా election@sakshi.com కు మెయిల్ చెయ్యండి. మాది నల్లగొండ జిల్లా ఆలేరు. ఐదు నెలల క్రితం ఇల్లు మారాము. అడ్రస్ మార్పునకు జనవరి 1న దరఖాస్తు చేసుకున్నా. వెంటనే మార్చారు. అయితే, మా అమ్మగారి పేరు కూడా మార్చుకునేందుకు జనవరి 25న దరఖాస్తు చేశాను. కొత్త అడ్రస్‌కు ఆమె పేరు మారలేదు? ఇప్పుడు మేము ఏం చేయాలి. - రమేష్,నల్లగొండ ఏప్రిల్ 9వ తేదీలోపు మారుతుంది. ఏ అభ్యర్థీ నచ్చకపోతే తిరస్కరణ ఓటు ‘నోటా’ను ప్రవేశపెట్టారు. ఈ సౌకర్యం స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తిస్తుందా? ఒక నియోజకవర్గంలో 50 శాతానికిపైగా ‘నోటా’ ఓట్లు నమోదైతే ఆ నియోజకవర్గంలో ఫలితం ఎలా ఉంటుంది? - సంధ్య, విజయనగరం స్థానిక ఎన్నికల్లో ‘నోటా’ సౌకర్యం లేదు. 50 శాతానికిపైగా ‘నోటా’ లోట్లు నమోదైనప్పటికీ, మిగతా అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే గెలుస్తారు. నేను జర్నలిస్టును. పోలింగ్ రోజు మేం ఎన్నికల కవరేజ్‌లో ఉంటాం. మా గ్రామానికి వెళ్లి ఓటే సే వీలు ఉండదు. అందువల్ల జర్నలిస్టులకు కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించవచ్చు కదా? -శ్రీహరి, నెల్లూరు ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ‘పోస్టల్ బ్యాలెట్’ సౌకర్యం ఉంది. మిగతా వారికి ఆ వెసులుబాటు ఉండదు.