అమ్మ మాట
‘తల్లి తెలంగాణ’ కోసం తమకు కడుపు కోత మిగిల్చినా, వారు ఆశించిన తెలంగాణ వస్తే చాలంటున్నారు అమరవీరుల తల్లిదండ్రులు. తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్నోళ్లందరికీ ఉద్యోగాలివ్వాలంటున్నారు. పల్లెలు పచ్చగుండాలని, అన్ని వసతులున్న తెలంగాణను కోరుకుంటున్నారు. అప్పుడే నవతెలంగాణ సాధ్యమని, తమ బిడ్డల ఆత్మ శాంతిస్తుందని చెబుతున్నారు.
పెంచాల విజయ, వెంకటేశ్ తల్లి, సిరిసిల్ల గ్రామం, కరీంనగర్ జిల్లా
నా కొడుకు వెంకటేశ్ ఇంటర్ చదువుకున్నడు. తెలంగాణ అస్తే ఉద్యోగాలు వస్తయ్.. అందరికీ బాగా జరుగతది అనేటోడు. తెలంగాణ ఉద్యమంలో మస్తు తిరిగిండు. 23 డిసెంబర్, 2010న పెయ్యిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నడు. కాలిన గాయాలు సలుపుతున్నా జై తెలంగాణ అంటూ నినాదాలు జేసిండు. తర్వాత ఆస్పత్రిలో సచ్చిపోయిండు. ఆడు సచ్చిపోయిన గిన్ని రోజులకు తెలంగాణ అచ్చింది. నా బిడ్డ ఆత్మ గిప్పుడు శాంతిస్తుంది. నా కొడుకు సచ్చిపోయిన రోజు ఆళ్లు, ఈళ్లు వచ్చి ఆదుకుంట మన్నరు. ఎవలూ రాలే. ఆదుకోలే. పత్తేరబోతూ కైకిలి చేసుకుంట బతుకుతున్న. లక్ష రూపాయల బాకీ ఉంది. మూడు వారాల తేడాలోనే భర్త, కొడుకును పోగొట్టుకున్న. ఒక్కదాన్నే బతుకుతున్న. గిప్పుడు నా కొడుకుంటే సంబరపడు. తెలంగాణ అచ్చింది కాబట్టి ఇప్పుడైనా సదువుకున్న పోరగాళ్లందరికీ ఉద్యోగాలివ్వాలి.
- సేకరణ: వూరడి మల్లిఖార్జున్, సిరిసిల్ల