సర్వం.. జయం.. | Jayalalithaa takes first step in fulfilling poll promises | Sakshi
Sakshi News home page

సర్వం.. జయం..

Published Tue, May 24 2016 2:41 AM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

సర్వం.. జయం..

సర్వం.. జయం..

తమిళనాడు ప్రజల గుండెల్లో అమ్మగా కొలువైన జయలలిత ముఖ్యమంత్రిగా ఆరోసారి బాధ్యతలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం మద్రాసు వర్సిటీలోని సెంటినరీ ఆడిటోరియంలో అట్టహాసంగా జరిగిన వేడుకల్లో నాయకులు, అభిమానులు జయజయ ధ్వానాలమధ్య పురిట్చితలైవి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం 28 మంది మంత్రులు రెండు బృందాలుగా నిలబడి సామూహికంగా ప్రమాణం చేశారు.

ప్రమాణస్వీకారోత్సవంలో సర్వం జయలలిత మయంగా కనిపించింది. అన్నీ తానై ఆమె వ్యవ హరించారు. అంతకు ముందు వేలసంఖ్యలో అభిమానులు రోడ్డు కిరువైపులా నిలబడి అమ్మకు స్వాగతం పలికారు.

 
* ఆరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన జయలలిత
* 28 మంత్రులతో క్యాబినెట్
* 25న మరో నలుగురు మంత్రుల ప్రమాణం

సాక్షి ప్రతినిధి, చెన్నైః అన్నాడీఎంకే అధినేత్రి జే జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా సోమవారం ఆరోసారి పదవీ ప్రమాణం చేశారు. జే జయలలిత అనే నేను.. అంటూ తమిళనాడు గవర్నర్ కే రోశయ్య ఆమె చేత ప్రమాణం చేయించారు. ఆ తరువాత అమ్మ కేబినెట్‌లోని 28 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. జయలలితకు అనాదిగా ఆనవాయితీగా వస్తున్న చెన్నైలోని మద్రాసు యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియం ప్రమాణస్వీకారోత్సవానికి ఆదివారానికే ముస్తాబైంది.

సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సీఎంగా ప్రమాణం చేయనుండగా ఉదయం 9గంటలకే పార్టీ నేతలు, అధికారులు అక్కడికి చేరుకోవడం ప్రారంభించారు. 11.40 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్న జయకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశికన్, సలహాదారు షీలా బాలకృష్ణన్ తదితరులు స్వాగతం పలికారు. ఆహూతులకు అభివాదం చేస్తూ 11.50 గంటలకు జయలలిత వేదికపైకి వచ్చారు. 12 గంటలకు వేదికపైకి చేరుకున్న గవర్నర్ కే రోశయ్యకు జయలలిత పుష్పగుచ్చం ఇచ్చి అభివాదం చేశారు. జాతీయగీతం, తమిళ్‌తాయ్ గీతం తరువాత మంత్రివర్గంలో చేరబోతున్న వారిని గవర్నర్‌కు జయ పరిచయం చేశారు. 12.10 గంటలకు జయలలిత చేత గవర్నర్ రోశయ్య పదవీ  ప్రమాణ స్వీకారం చేయించారు.

తమిళంలో ‘నాన్’(నేను) అని రోశయ్య పలుకగా జయలలిత కొనసాగించారు. దేవుడిపైన అంటూ ఆమె ప్రమాణం సాగించారు. ప్రమాణం పూర్తయిన తరువాత జయలలిత ను అభినందిస్తూ రోశయ్య పుష్పగుచ్చం అందజేశారు. జయ తరువాల మంత్రులు ప్రమాణం చేశారు. సహజంగా ఒక్కో మంత్రి ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే కొత్త సంప్రదాయానికి తెరదీస్తూ  మొత్తం 28 మంది మంత్రులను రెండుగా బృందాలుగా విభజించి మూకుమ్మడిగా ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన విదేశాల్లో ఉన్నందున ప్రధాని తర ఫున కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హాజరైనారు. అలాగే కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ కొంత వెనుక వరుసలో కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించారు.
 
అమ్మ టీంలో మరో నలుగురు
28 మందితో జయలలిత తన మంత్రివర్గ బృందాన్ని ప్రకటించగా తమకు న్యాయం జరుగలేదని ఓ సామాజికవర్గం నిరసన తెలిపింది. మంత్రుల ఎంపికలో సామాజిక న్యాయం చోటుచేసుకోలేదనే విమర్శల నేపథ్యంలో కొత్తగా మరో నలుగురిని కేబినెట్‌లోకి తీసుకోవాలని సోమవారం సాయంత్రానికి సీఎం జయలలిత నిర్ణయం తీసుకున్నారు. జీ భాస్కరన్-ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు, సెవ్వూరు ఎస్ రామచంద్రన్-దేవాదాయ ధర్మాదాయ శాఖ, డాక్టర్ నిలోఫర్ కబిల్-కార్మికశాఖ, పీ బాలకృష్ణారెడ్డి -పశుసంవర్దకశాఖ..ఈ నలుగురు మంత్రులు 25వ తేదీన రాజ్‌భవన్‌లో ప్రమాణం చేస్తారు.
 
అన్నిరంగాల వారికి ఆహ్వానం
ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణస్వీకారోత్సవానికి అన్నిరంగాల వారికీ ఆహ్వానాలు అందాయి. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం ప్రతినిధిగా డీఎంకే కోశాధికారి స్టాలిన్  12వ వరుసలో కూర్చున్నారు. మిత్రపక్షానికి చెందిన సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షులు,నటుడు శరత్‌కుమార్ ముందు వరుసలో కూర్చున్నారు. సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి త పాండియన్, పలువురు పారిశ్రామికవేత్తలు, ఆధ్యాత్మిక వేత్త మధురై ఆదీనం హాజరైనారు.
 
కోలీవుడ్ నుంచి
దక్షిణ భారత నటీ నటుల సంఘం అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, నటులు ప్రభు, ఆనందరాజ్,సెంధిల్, మనోబాల, నటిలు వింధ్య, ఆర్తీగణేష్, సంగీత దర్శకులు శంకర్ గణేష్, గాయనిమణులు పీ సుశీల, వాణీజయరాం హాజరయ్యారు.
 అమ్మ..ఆకుపచ్చ
 అమ్మ గత రెండేళ్లుగా పాటిస్తున్న ఆకుపచ్చదనం సెంటిమెంట్‌ను అధికారులు అంతటా పాటించారు. వేదిక తెర, అలంకరించిన పూలు మొదలుకుని సర్వం ఆకుపచ్చమయం అయిపోయింది. చివరకు మీడియాకు ఇచ్చిన పాస్‌లు సైతం పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. అమ్మ సహా ఇద్దరు మహిళా మంత్రులు పచ్చని చీరలు కట్టుకుని వచ్చారు.
 
మిన్నంటిన అభిమానం..
తమ అభిమాన నేత జయలలిత ముఖ్యమంత్రిగా ఆరోసారి పదవీప్రమాణం చేస్తున్న వేళ జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఉదయం 11.30 గంటలకు పోయిస్‌గార్డెన్ నుంచి బయలుదేరిన జయలలితకు దారిపొడవునా జనం బ్యాండుమేళాలు వాయిస్తూ బ్రహ్మరథం పట్టారు. రెండాకుల చిహ్నాన్ని చూపుతూ జే జేలు కొట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి బస్సులు, కార్లు, వ్యాన్లలో అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్దసంఖ్యలో ప్రాంగణానికి చేరుకున్నారు.

సరిగ్గా 12.30గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం పూర్తికాగానే జయలలిత అక్కడి నుంచి నేరుగా సచివాలయానికి వెళ్లారు. ఉన్నతాధికారుల స్వాగతం, బాధ్యతల స్వీకరణ, ఐదు పథకాలపై సంతకం పూర్తి చేసుకుని సుమారు 1.30 గంటలకు సచివాలయం నుండి తిరుగుప్రయాణం అయ్యారు. అమ్మను మరోసారి చూడాలన్న ఆతృతతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అభిమాన జనం అంతసేపూ ఎండలోనే నిలబడి ఆమెకు బ్రహ్మరథం పట్టారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement