sworn in as Tamil Nadu CM
-
సర్వం.. జయం..
తమిళనాడు ప్రజల గుండెల్లో అమ్మగా కొలువైన జయలలిత ముఖ్యమంత్రిగా ఆరోసారి బాధ్యతలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం మద్రాసు వర్సిటీలోని సెంటినరీ ఆడిటోరియంలో అట్టహాసంగా జరిగిన వేడుకల్లో నాయకులు, అభిమానులు జయజయ ధ్వానాలమధ్య పురిట్చితలైవి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం 28 మంది మంత్రులు రెండు బృందాలుగా నిలబడి సామూహికంగా ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారోత్సవంలో సర్వం జయలలిత మయంగా కనిపించింది. అన్నీ తానై ఆమె వ్యవ హరించారు. అంతకు ముందు వేలసంఖ్యలో అభిమానులు రోడ్డు కిరువైపులా నిలబడి అమ్మకు స్వాగతం పలికారు. * ఆరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన జయలలిత * 28 మంత్రులతో క్యాబినెట్ * 25న మరో నలుగురు మంత్రుల ప్రమాణం సాక్షి ప్రతినిధి, చెన్నైః అన్నాడీఎంకే అధినేత్రి జే జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా సోమవారం ఆరోసారి పదవీ ప్రమాణం చేశారు. జే జయలలిత అనే నేను.. అంటూ తమిళనాడు గవర్నర్ కే రోశయ్య ఆమె చేత ప్రమాణం చేయించారు. ఆ తరువాత అమ్మ కేబినెట్లోని 28 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. జయలలితకు అనాదిగా ఆనవాయితీగా వస్తున్న చెన్నైలోని మద్రాసు యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియం ప్రమాణస్వీకారోత్సవానికి ఆదివారానికే ముస్తాబైంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సీఎంగా ప్రమాణం చేయనుండగా ఉదయం 9గంటలకే పార్టీ నేతలు, అధికారులు అక్కడికి చేరుకోవడం ప్రారంభించారు. 11.40 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్న జయకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశికన్, సలహాదారు షీలా బాలకృష్ణన్ తదితరులు స్వాగతం పలికారు. ఆహూతులకు అభివాదం చేస్తూ 11.50 గంటలకు జయలలిత వేదికపైకి వచ్చారు. 12 గంటలకు వేదికపైకి చేరుకున్న గవర్నర్ కే రోశయ్యకు జయలలిత పుష్పగుచ్చం ఇచ్చి అభివాదం చేశారు. జాతీయగీతం, తమిళ్‌తాయ్ గీతం తరువాత మంత్రివర్గంలో చేరబోతున్న వారిని గవర్నర్‌కు జయ పరిచయం చేశారు. 12.10 గంటలకు జయలలిత చేత గవర్నర్ రోశయ్య పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళంలో ‘నాన్’(నేను) అని రోశయ్య పలుకగా జయలలిత కొనసాగించారు. దేవుడిపైన అంటూ ఆమె ప్రమాణం సాగించారు. ప్రమాణం పూర్తయిన తరువాత జయలలిత ను అభినందిస్తూ రోశయ్య పుష్పగుచ్చం అందజేశారు. జయ తరువాల మంత్రులు ప్రమాణం చేశారు. సహజంగా ఒక్కో మంత్రి ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే కొత్త సంప్రదాయానికి తెరదీస్తూ మొత్తం 28 మంది మంత్రులను రెండుగా బృందాలుగా విభజించి మూకుమ్మడిగా ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన విదేశాల్లో ఉన్నందున ప్రధాని తర ఫున కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హాజరైనారు. అలాగే కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ కొంత వెనుక వరుసలో కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించారు. అమ్మ టీంలో మరో నలుగురు 28 మందితో జయలలిత తన మంత్రివర్గ బృందాన్ని ప్రకటించగా తమకు న్యాయం జరుగలేదని ఓ సామాజికవర్గం నిరసన తెలిపింది. మంత్రుల ఎంపికలో సామాజిక న్యాయం చోటుచేసుకోలేదనే విమర్శల నేపథ్యంలో కొత్తగా మరో నలుగురిని కేబినెట్లోకి తీసుకోవాలని సోమవారం సాయంత్రానికి సీఎం జయలలిత నిర్ణయం తీసుకున్నారు. జీ భాస్కరన్-ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు, సెవ్వూరు ఎస్ రామచంద్రన్-దేవాదాయ ధర్మాదాయ శాఖ, డాక్టర్ నిలోఫర్ కబిల్-కార్మికశాఖ, పీ బాలకృష్ణారెడ్డి -పశుసంవర్దకశాఖ..ఈ నలుగురు మంత్రులు 25వ తేదీన రాజ్‌భవన్‌లో ప్రమాణం చేస్తారు. అన్నిరంగాల వారికి ఆహ్వానం ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణస్వీకారోత్సవానికి అన్నిరంగాల వారికీ ఆహ్వానాలు అందాయి. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం ప్రతినిధిగా డీఎంకే కోశాధికారి స్టాలిన్ 12వ వరుసలో కూర్చున్నారు. మిత్రపక్షానికి చెందిన సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షులు,నటుడు శరత్‌కుమార్ ముందు వరుసలో కూర్చున్నారు. సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి త పాండియన్, పలువురు పారిశ్రామికవేత్తలు, ఆధ్యాత్మిక వేత్త మధురై ఆదీనం హాజరైనారు. కోలీవుడ్ నుంచి దక్షిణ భారత నటీ నటుల సంఘం అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, నటులు ప్రభు, ఆనందరాజ్,సెంధిల్, మనోబాల, నటిలు వింధ్య, ఆర్తీగణేష్, సంగీత దర్శకులు శంకర్ గణేష్, గాయనిమణులు పీ సుశీల, వాణీజయరాం హాజరయ్యారు. అమ్మ..ఆకుపచ్చ అమ్మ గత రెండేళ్లుగా పాటిస్తున్న ఆకుపచ్చదనం సెంటిమెంట్‌ను అధికారులు అంతటా పాటించారు. వేదిక తెర, అలంకరించిన పూలు మొదలుకుని సర్వం ఆకుపచ్చమయం అయిపోయింది. చివరకు మీడియాకు ఇచ్చిన పాస్‌లు సైతం పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. అమ్మ సహా ఇద్దరు మహిళా మంత్రులు పచ్చని చీరలు కట్టుకుని వచ్చారు. మిన్నంటిన అభిమానం.. తమ అభిమాన నేత జయలలిత ముఖ్యమంత్రిగా ఆరోసారి పదవీప్రమాణం చేస్తున్న వేళ జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఉదయం 11.30 గంటలకు పోయిస్గార్డెన్ నుంచి బయలుదేరిన జయలలితకు దారిపొడవునా జనం బ్యాండుమేళాలు వాయిస్తూ బ్రహ్మరథం పట్టారు. రెండాకుల చిహ్నాన్ని చూపుతూ జే జేలు కొట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి బస్సులు, కార్లు, వ్యాన్లలో అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్దసంఖ్యలో ప్రాంగణానికి చేరుకున్నారు. సరిగ్గా 12.30గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం పూర్తికాగానే జయలలిత అక్కడి నుంచి నేరుగా సచివాలయానికి వెళ్లారు. ఉన్నతాధికారుల స్వాగతం, బాధ్యతల స్వీకరణ, ఐదు పథకాలపై సంతకం పూర్తి చేసుకుని సుమారు 1.30 గంటలకు సచివాలయం నుండి తిరుగుప్రయాణం అయ్యారు. అమ్మను మరోసారి చూడాలన్న ఆతృతతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అభిమాన జనం అంతసేపూ ఎండలోనే నిలబడి ఆమెకు బ్రహ్మరథం పట్టారు. -
సీఎంగా జయ ప్రమాణం
- తమిళనాట 28 మంది మంత్రులుగా ప్రమాణం - కేబినెట్ కూర్పుపై విమర్శలతో మరో నలుగురికి అవకాశం - ఎన్నికల హామీ నెరవేరుస్తూ ఐదు పథకాలపై సంతకం - స్టాలిన్‌ను వెనుక కూర్చోబెట్టడంపై కరుణ ఆగ్రహం సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అధినేత్రి జె.జయలలిత ఆరోసారి ప్రమాణస్వీకారం చేశారు. మద్రాసు వర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో సోమవారం మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్ రోశయ్య ఆమెతో ప్రమాణం చేయించారు. 28 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు బృందాలుగా మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం జరగలేదన్న విమర్శలతో మరో నలుగురికి కేబినెట్లో జయ అవకాశమిచ్చారు. ఆమె సిఫార్సు మేరకు గవర్నర్ నలుగురు మంత్రుల్ని కేబినెట్లోకి తీసుకున్నారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. వీరు మంగళవారం మంత్రులుగా ప్రమాణం చేస్తారు. కాగా, జయ ప్రమాణం అనంతరం గత కేబినెట్లో పనిచేసిన 15 మందితో పాటు కొత్తగా 13 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, పొన్ రాధాకృష్ణన్, లోక్‌సభ ఉప సభాపతి ఎం.తంబిదురై, జయ సన్నిహితురాలు శశికళలు ముందు వరుసలో కూర్చున్నారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలోపన్నీర్సెల్వం(ఆర్థిక), సి.విజయభాస్కర్(వైద్యం) తదితరులు ఉన్నారు. ఏడాది కాలంలో జయ రెండు సార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం విశేషం. ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో మే 23, 2015న జయ ఐదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదు పథకాలపై తొలిసంతకం.. ప్రమాణం పూర్తికాగానే ఆడిటోరియం నుంచి నేరుగా సచివాలయానికి వెళ్లిన జయ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రైతు రుణాల రద్దు, పెళ్లి కుమార్తెకు తాళికోసం 8 గ్రాముల బంగారం, చేనేత రంగానికి అదనంగా విద్యుత్, వంద యూనిట్ల లోపు ఉచిత కరెంట్ పథకాలపై సంతకం చేసి ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు. 500 మద్యం షాపుల మూసివేతతో పాటు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు షాపులు తెరవొద్దని ఆదేశాలిచ్చారు. కావాలనే అవమానించారు: కరుణానిధి జయ ప్రమాణ కార్యక్రమంలో తన కుమారుడు స్టాలిన్‌ను వెనుక వరుసలో కూర్చోపెట్టడంపై డీఎంకే చీఫ్ కరుణానిధి అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే మద్దతుతో పోటీ చేసి ఓడిన శరత్ కుమార్‌ను ముందువరుసలో కూర్చోపెట్టి స్టాలిన్‌ను జనం మధ్య కూచో బెట్టడమేమిటన్నారు. జయను ప్రధాని మో దీ ట్విటర్లో అభినందించారు. ఆమె ప్రభుత్వం తో కేంద్రం కలసి పనిచేస్తుందని చెప్పారు. -
జయలలిత తొలి సంతకం ఇదే..
చెన్నై: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జయలలిత రైతు రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేశారు. అంతేకాకుండా పలు కొత్త పథకాలతో ప్రజలకు అమ్మ వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహారం, మద్యం దుకాణాలకు సమయం కుదింపు, వంద యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, చేనేత కార్మికులకు 700 యూనిట్లు ఉచితంగా విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ కొత్త పథకాలు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ నేపథ్యంలో మద్యం దుకాణాల సమయం కుదింపుపై జయలలిత తన హామీని నిలబెట్టుకున్నారు. అలాగే 500 రిటైల్ మద్యం షాపుల మూసివేతకు ఆమె ఆదేశాలు ఇచ్చారు. కాగా తమిళనాడులో అంతకు ముందు ఉదయం 10 గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ మద్యం దుకాణాలు తెరిచి ఉండేవి. అయితే కొత్త విధానం అమల్లోకి రావడంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల నుంచి తెరుచుకోనున్నాయి. కాగా జయలలితతో పాటు 28 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. గతంలో మాదిరిగానే మంత్రులందరూ సామూహికంగా ప్రమాణం చేశారు. జయ కేబినెట్లో ఈసారి 13 మంది కొత్తవారికి అవకాశం దక్కింది. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో 232 సీట్లు ఎన్నికలు జరగ్గా, అన్నాడీఎం 134 స్థానాల్లో విజయం సాధించి సంపూర్ణ మెజార్టీతో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. మంత్రులు-శాఖలు 1. జయలలిత : హోంశాఖ, రెవెన్యూ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ 2. పన్నీరుసెల్వం : ఆర్థిక శాఖ 3. శ్రీనివాసన్ - అటవీశాఖ 4. ఈదప్పడి కె. పలానీస్వామి - రహదారులు, పబ్లిక్ వర్క్స్ 5. సెల్లూర్ కె. రాజు - సహకార మరియు కార్మిక శాఖ 6. తంగమణి - విద్యుత్ మరియు ఎక్సైజ్ శాఖ 7. వీపీ వేలుమణి - గ్రామీణాభివృద్ధి మరియు మున్సిపల్ శాఖ 8. డి. జయకుమార్ - మత్స్యశాఖ 9. శణ్ముగమ్ - న్యాయ, జైళ్ల శాఖ 10. కేపీ అన్భజ్హగన్ - ఉన్నత విద్య 11. ఆర్బీ. ఉదయ్‌కుమార్ - రెవెన్యూ 12. కేటీ. రాజేంత్ర బాలాజీ - గ్రామీణ పరిశ్రమలు 13. కేసీ వీరమణి - వాణిజ్య పన్నుల శాఖ 14. పి. బెంజీమెన్ - పాఠశాల విద్య, ఆటలు మరియు యువజన సంక్షేమం 15. వెల్లమండి ఎన్. నటరాజన్ - పర్యాటక శాఖ 16. ఎస్. వలార్మఠి - వెనుకబడిన తరగతులు మరియు మైనార్టీ సంక్షేమ శాఖ 17. వీఎం. రాజలక్ష్మీ - ఆది ద్రవిడర్ మరియు గిరిజన సంక్షేమ శాఖ 18. ఎమ్. మణికందన్ - ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ(ఐటీ) 19. ఎంఆర్. విజయ్‌భాస్కర్ - రవాణా శాఖ. 20. డాక్టర్ వీ. సరోజ - సాంఘీక సంక్షేమ శాఖ 21. కేసీ కరుప్పన్నన్ - పర్యావరణ శాఖ 22. ఎంసీ సంపత్ - పరిశ్రమలు 23. ఆర్. కామరాజ్ - ఆహార, పౌరసరఫరాల శాఖ 24. ఓఎస్ మనేన్ - చేనేత మరియు జౌళి శాఖ 25. ఉడుమలై రాధాకృష్ణన్ - గృహ మరియు పట్టణాభివృద్ధి శాఖ 26. సీ. విజయ్‌భాస్కర్ - ఆరోగ్య శాఖ 27. ఎస్పీ శణ్ముగనాథన్ - పాలు మరియు పాడి పరిశ్రమ అభివృద్ధి 28. ఆర్. దురైకన్ను - వ్యవసాయం మరియు పశు సంరక్షణ శాఖ 29. కదంబూర్ రాజు - సమాచార శాఖ