జయలలిత తొలి సంతకం ఇదే..
చెన్నై: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జయలలిత రైతు రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేశారు. అంతేకాకుండా పలు కొత్త పథకాలతో ప్రజలకు అమ్మ వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహారం, మద్యం దుకాణాలకు సమయం కుదింపు, వంద యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, చేనేత కార్మికులకు 700 యూనిట్లు ఉచితంగా విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ కొత్త పథకాలు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ నేపథ్యంలో మద్యం దుకాణాల సమయం కుదింపుపై జయలలిత తన హామీని నిలబెట్టుకున్నారు. అలాగే 500 రిటైల్ మద్యం షాపుల మూసివేతకు ఆమె ఆదేశాలు ఇచ్చారు. కాగా తమిళనాడులో అంతకు ముందు ఉదయం 10 గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ మద్యం దుకాణాలు తెరిచి ఉండేవి. అయితే కొత్త విధానం అమల్లోకి రావడంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల నుంచి తెరుచుకోనున్నాయి.
కాగా జయలలితతో పాటు 28 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. గతంలో మాదిరిగానే మంత్రులందరూ సామూహికంగా ప్రమాణం చేశారు. జయ కేబినెట్‌లో ఈసారి 13 మంది కొత్తవారికి అవకాశం దక్కింది. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో 232 సీట్లు ఎన్నికలు జరగ్గా, అన్నాడీఎం 134 స్థానాల్లో విజయం సాధించి సంపూర్ణ మెజార్టీతో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది.
మంత్రులు-శాఖలు
1. జయలలిత : హోంశాఖ, రెవెన్యూ, జనరల్ అడ్మినిస్ట్రేషన్
2. పన్నీరుసెల్వం : ఆర్థిక శాఖ
3. శ్రీనివాసన్ - అటవీశాఖ
4. ఈదప్పడి కె. పలానీస్వామి - రహదారులు, పబ్లిక్ వర్క్స్
5. సెల్లూర్ కె. రాజు - సహకార మరియు కార్మిక శాఖ
6. తంగమణి - విద్యుత్ మరియు ఎక్సైజ్ శాఖ
7. వీపీ వేలుమణి - గ్రామీణాభివృద్ధి మరియు మున్సిపల్ శాఖ
8. డి. జయకుమార్ - మత్స్యశాఖ
9. శణ్ముగమ్ - న్యాయ, జైళ్ల శాఖ
10. కేపీ అన్‌భజ్‌హగన్ - ఉన్నత విద్య
11. ఆర్‌బీ. ఉదయ్‌కుమార్ - రెవెన్యూ
12. కేటీ. రాజేంత్ర బాలాజీ - గ్రామీణ పరిశ్రమలు
13. కేసీ వీరమణి - వాణిజ్య పన్నుల శాఖ
14. పి. బెంజీమెన్ - పాఠశాల విద్య, ఆటలు మరియు యువజన సంక్షేమం
15. వెల్లమండి ఎన్. నటరాజన్ - పర్యాటక శాఖ
16. ఎస్. వలార్‌మఠి - వెనుకబడిన తరగతులు మరియు మైనార్టీ సంక్షేమ శాఖ
17. వీఎం. రాజలక్ష్మీ - ఆది ద్రవిడర్ మరియు గిరిజన సంక్షేమ శాఖ
18. ఎమ్. మణికందన్ - ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ(ఐటీ)
19. ఎంఆర్. విజయ్‌భాస్కర్ - రవాణా శాఖ.
20. డాక్టర్ వీ. సరోజ - సాంఘీక సంక్షేమ శాఖ
21. కేసీ కరుప్పన్నన్ - పర్యావరణ శాఖ
22. ఎంసీ సంపత్ - పరిశ్రమలు
23. ఆర్. కామరాజ్ - ఆహార, పౌరసరఫరాల శాఖ
24. ఓఎస్ మనేన్ - చేనేత మరియు జౌళి శాఖ
25. ఉడుమలై రాధాకృష్ణన్ - గృహ మరియు పట్టణాభివృద్ధి శాఖ
26. సీ. విజయ్‌భాస్కర్ - ఆరోగ్య శాఖ
27. ఎస్పీ శణ్ముగనాథన్ - పాలు మరియు పాడి పరిశ్రమ అభివృద్ధి
28. ఆర్. దురైకన్ను - వ్యవసాయం మరియు పశు సంరక్షణ శాఖ
29. కదంబూర్ రాజు - సమాచార శాఖ