సీఎంగా జయ ప్రమాణం
- తమిళనాట 28 మంది మంత్రులుగా ప్రమాణం
- కేబినెట్ కూర్పుపై విమర్శలతో మరో నలుగురికి అవకాశం
- ఎన్నికల హామీ నెరవేరుస్తూ ఐదు పథకాలపై సంతకం
- స్టాలిన్‌ను వెనుక కూర్చోబెట్టడంపై కరుణ ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అధినేత్రి జె.జయలలిత ఆరోసారి ప్రమాణస్వీకారం చేశారు. మద్రాసు వర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో సోమవారం మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్ రోశయ్య ఆమెతో ప్రమాణం చేయించారు. 28 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు బృందాలుగా మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం జరగలేదన్న విమర్శలతో మరో నలుగురికి కేబినెట్‌లో జయ అవకాశమిచ్చారు. ఆమె సిఫార్సు మేరకు గవర్నర్ నలుగురు మంత్రుల్ని కేబినెట్‌లోకి తీసుకున్నారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. వీరు మంగళవారం మంత్రులుగా ప్రమాణం చేస్తారు.
కాగా, జయ ప్రమాణం అనంతరం గత కేబినెట్‌లో పనిచేసిన 15 మందితో పాటు కొత్తగా 13 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, పొన్ రాధాకృష్ణన్, లోక్‌సభ ఉప సభాపతి ఎం.తంబిదురై, జయ సన్నిహితురాలు శశికళలు ముందు వరుసలో కూర్చున్నారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలోపన్నీర్‌సెల్వం(ఆర్థిక), సి.విజయభాస్కర్(వైద్యం) తదితరులు ఉన్నారు. ఏడాది కాలంలో జయ రెండు సార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం విశేషం. ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో మే 23, 2015న జయ ఐదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఐదు పథకాలపై తొలిసంతకం.. ప్రమాణం పూర్తికాగానే ఆడిటోరియం నుంచి నేరుగా సచివాలయానికి వెళ్లిన జయ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రైతు రుణాల రద్దు, పెళ్లి కుమార్తెకు తాళికోసం 8 గ్రాముల బంగారం, చేనేత రంగానికి అదనంగా విద్యుత్, వంద యూనిట్ల లోపు ఉచిత కరెంట్ పథకాలపై సంతకం చేసి ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు. 500 మద్యం షాపుల మూసివేతతో పాటు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు షాపులు తెరవొద్దని ఆదేశాలిచ్చారు.
కావాలనే అవమానించారు: కరుణానిధి
జయ ప్రమాణ కార్యక్రమంలో తన కుమారుడు స్టాలిన్‌ను వెనుక వరుసలో కూర్చోపెట్టడంపై డీఎంకే చీఫ్ కరుణానిధి అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే మద్దతుతో పోటీ చేసి ఓడిన శరత్ కుమార్‌ను ముందువరుసలో కూర్చోపెట్టి స్టాలిన్‌ను జనం మధ్య కూచో బెట్టడమేమిటన్నారు. జయను ప్రధాని మో దీ ట్విటర్‌లో అభినందించారు. ఆమె ప్రభుత్వం తో కేంద్రం కలసి పనిచేస్తుందని చెప్పారు.