ఇది మోసం కాదా? | chandrababu false statement in election stunt? | Sakshi
Sakshi News home page

ఇది మోసం కాదా?

Published Tue, Jul 22 2014 2:07 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

chandrababu false statement in election stunt?

రైతులు, డ్వాక్రా రుణాల మాఫీపై మాట మార్చిన చంద్రబాబు
రుణాలన్నీ మాఫీ అవుతాయని ఎదురుచూసిన రైతుల నోట్లో మట్టి


హైదరాబాద్: గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రైతాంగం భయపడుతున్నదే జరిగింది. అధికారంలోకి వచ్చీ రాగానే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన తొలి సంతకంతోనే రైతాంగాన్ని నిండా ముంచారు.ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి గడిచిన 45 రోజులుగా రుణ మాఫీపై రకరకాల సాకులు చెబుతూ కాలయాపన చేసిన చంద్రబాబు సోమవారం అడ్డంగా మాటమార్చారు. రైతులను నిలువునా ముంచారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీసుకున్న రుణాలు మొత్తం రూ.87,612 కోట్లు ఉన్నాయి. ఇవి ప్రభుత్వ రికార్డులు చెబుతున్న అధికారిక లెక్కలే. అలాగే రూ.14,204 కోట్ల మేరకు డ్వాక్రా రుణాలున్నాయి. రెండూ కలిపి 1 లక్షా 1816 కోట్ల రూపాయలు ఉండగా వాటన్నింటినీ మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన క్షణం నుంచి మాట మార్చుతూ వచ్చారు. తీరా సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో రైతులను నిలువునా ముంచే మోసపూరిత నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ భేటీలో రుణ మాఫీపై చర్చించిన అనంతరం సీఎం స్వయంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు కలిపి రూ.30 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్ల మేరకు రుణ మాఫీ చేస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు ఆయన ప్రతి సభలోనూ రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఊరూవాడా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆరోజుల్లో ఎలాంటి పరిమితులు, ఆంక్షల గురించి చెప్పకపోగా, వ్యవసాయం కోసం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ హామీ ఏదో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇచ్చింది కాదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలకు వేరువేరుగా టీడీపీ మేనిఫెస్టోలు విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోల్లో రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తామన్న వాగ్దానాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతాంగం మొత్తం ఎన్ని రుణాలు తీసుకున్నారో ఇంతకాలం తెలియదనుకోవడం కూడా పొరపాటే. రాష్ట్ర స్థాయి బ్యాంక ర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) నివేదికల్లో రైతాంగం తీసుకున్న రుణాలె న్ని? అందులో వ్యవసాయ రుణాలెన్ని? బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయం కోసం తీసుకున్న రుణాలెన్ని? టర్మ్ రుణాలెన్ని? డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలెన్ని? వంటి మొత్తం వివరాలున్నాయి. పైగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళిక విడుదల చేయడానికి ముందున్న లెక్కలే ఇవి. అన్నీ తెలిసే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామంటూ అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అరుుతే అధికారం చేపట్టిన తర్వాత ఈ విషయంలో ఆయన రూటు మార్చారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినరోజు రుణ మాఫీ ఫైలుమీదే తొలి సంతకం చేస్తానన్న వాగ్దానం నెరవేర్చకుండా, రుణమాఫీ సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికంటూ నాబార్డ్ మాజీ చైర్మన్ కోటయ్య నేతృత్వంలో ఒక కమిటీ వేయడానికి సంబంధించిన ఫైలుపై సంతకం చేసి చేతులు దులుపుకున్నారు. దాంతో రైతులు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి ఒక్కసారిగా విమర్శల దాడి మొదలైంది. అయినప్పటికీ కమిటీ సూచనలు, సిఫారసుల పేరుతో కాలయాపన చేస్తూ వచ్చారు. ఇదే క్రమంలో చంద్రబాబు ఎస్‌ఎల్‌బీసీ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలోనూ రైతులు తీసుకున్న రుణాలెన్ని అన్న విషయూన్ని బ్యాంకర్ల కమిటీ చాలా స్పష్టంగా బహిరంగంగా ప్రకటించింది. ఇన్ని వాస్తవాలు ప్రత్యక్షంగా కనబడుతున్నప్పటికీ చంద్రబాబుతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు నిన్నమొన్నటి వరకు కూడా రుణ మాఫీకి కట్టుబడి ఉన్నామంటూ పచ్చిగా నమ్మిస్తూ వచ్చారు. ఒక్కో దశలో ఒక్కో పరిమితి విధిస్తూ, ఆంక్షలు పెడుతూ సాకులు చెబుతున్న సమయంలో వివిధ రాజకీయ పక్షాలు, రైతు సంఘాల నుంచి విమర్శలు వ స్తున్న సమయంలోనూ రుణ మాఫీకి కట్టుబడి ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. దాదాపు నెలన్నర నుంచి ఇలా కాలం వెళ్లబుచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సోమవారం తన నిజస్వరూపాన్ని బట్టబయలు చేసింది. వ్యవసాయం కోసం కోటి మంది రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటే వారిలో 90 శాతం మందికి లబ్ది చేకూర్చుతున్నామని బుకాయించే ప్రయత్నం చేయడం పట్ల రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రూ.87,612.25 కోట్ల మేరకు వ్యవసాయ రుణాలు, రూ.14,204 కోట్ల మేరకు డ్వాక్రా రుణాలు కలిపి మొత్తం లక్ష కోట్లకు పైగా రుణాలుంటే.. అందులో రూ.30 వేల కోట్ల నుంచి 35 వేల కోట్ల మేరకు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వమే..

మళ్లీ 90 శాతం రైతులకు మేలు కలిగిస్తున్నామని చెప్పడం పట్ల రైతు సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. డ్వాక్రా రుణాలతో కలిపి లక్ష కోట్ల రుణాలుంటే అందులో కనీసం 30 శాతం రుణాలను మాఫీ చేయలేనప్పుడు ఏ విధంగా 90 శాతం మంది రైతులకు ప్రయోజనం కలిగించినట్టు అవుతుందని ప్రశ్నిస్తున్నాయి. వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు సంబంధించి కోటికి పైగా బ్యాంకుల్లో ఖాతాలున్నాయని కేవలం రూ.30 వేల కోట్లు మాఫీ చేసి 90 శాతం లబ్ది చేకూర్చామని చెప్పడం మరో మోసమని పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు జరిగిన తతంగం చూస్తుంటే ఆ రూ.30 వేల కోట్లను కూడా తగ్గించేలా ప్రభుత్వ వ్యవహారం కనబడుతోందని ఆ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement