రుణమాఫీ సగం మందికే | loan waiver only for half peoples | Sakshi
Sakshi News home page

రుణమాఫీ సగం మందికే

Published Fri, Dec 5 2014 1:50 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

loan waiver only for half peoples

గొర్రె ఏడుపు తోడేలుకు ఎందుకు అన్న చందంగా బాబు రుణమాఫీ వ్యవహారం తయారైంది. ఇటు రుణమాఫీ కాక..అటు బ్యాంకుల్లో అప్పు పుట్టక  ఇబ్బందులు పడుతున్నా రోజుకో మాట మారుస్తున్న బాబు వైఖరిపై జిల్లా రైతులు మండిపడుతున్నారు. కొండను తవ్వి ఎలుక ను పట్టినట్లు రుణమాఫీ తయారైందని గురువారం చంద్రబాబు చేసిన ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు వైఖరిపై విపక్షాలూ దుమ్మెత్తిపోస్తున్నాయి.
 
సాక్షి ప్రతినిధి, ఒంగోలు, ఒంగోలు టూటౌన్ : కొండను తవ్వి ఎలుకను పట్టుకున్న చందంగా తయారైంది సీఎం చంద్రబాబు రుణమాఫీ ప్రకటన. గద్దెనెక్కడానికి ఓట్ల కోసం అడ్డంగా రుణమాఫీ చేస్తానంటూ అబద్ధాలు పలికిన బాబు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రమాణ స్వీకారం రోజున రుణాలన్నీ మాఫీ చేస్తున్నట్టు ఫైలుపై సంతకం చేసిన ఆరు నెలల తర్వాత బాబు చేసిన ప్రకటనపై రైతన్నలు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటికిపైగా రైతు ఖాతాలుంటే కేవలం 40 లక్షల ఖాతాలకే రుణమాఫీ వర్తిస్తుందని చంద్రబాబు చేసిన ప్రకటనతో జిల్లాలో ఎంతమందికి ఈ రుణమాఫీ వర్తిస్తుందనే అంశంపై చర్చ మొదలైంది.

జిల్లాలో ఏడు లక్షల రైతు ఖాతాలున్నాయి. అందులో ఆధార్, పట్టాదార్ పాసుపుస్తకం, రేషన్ కార్డు, కుటుంబ సభ్యులు ఖాతాలు సరిపోల్చడం అంటూ చేసిన గందరగోళంతో సగానికి పైగా రైతులకు ఈ రుణమాఫీ వర్తించే అవకాశాలు కనపడటం లేదు. జిల్లాలోనే రుణమాఫీకి అర్హమైన మొత్తం ఐదు వేల కోట్ల రూపాయలుండగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదువేల కోట్లే బడ్జెట్‌లో కేటాయించిన సంగతి తెలిసిందే. 50 వేలలోపు రుణం ఉన్నవారికి ఒకేసారి, మిగిలిన వారికి 20 శాతం రుణమాఫీ చేయాలన్నాఒక్క జిల్లాకే వెయ్యి కోట్ల రూపాయలకుపైగా అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో అసలు ఎంతమందికి మాఫీ అవుతుందో చెప్పలేమని బ్యాంకర్లు చెబుతున్నారు.

పూర్తిగా రుణమాఫీ చేయకుండా తొలి విడత, మలివిడత అంటూ నాలుగు విడతల్లో రుణమాఫీ చేస్తానంటూ మాయమాటలతో కాలయాపన చేయడంపై అటు రైతులు, ఇటు రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వ్యవసాయ రుణాలు చెల్లించొద్దు మొత్తం రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 20 శాతానికి పరిమితం చేయడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రుణమాఫీ ప్రకటనపై జిల్లాలోని రైతు సంఘాల నాయకులు,రాజకీయపార్టీల నాయకుల అభిప్రాయాలు..

జగన్ ప్రకటించిన ధర్నాలకు భయపడే రుణమాఫీ
ముత్తుమల అశోక్ రెడ్డి , వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
 
ఎన్నికల సమయంలో వ్యవసాయ రుణాలు చెల్లించొద్దు, అన్ని రుణాలు రద్ధు చేస్తామని ప్రకటించిన చంద్రబాబు వైఫల్యాలను నిలదీసేందుకు వైఎస్సార్ సీపీ సిద్ధమయ్యే సరికి 20 శాతం రుణమాఫీ అంటూ కొత్త ఎత్తుగడకు దిగారు. ఆంక్షలు లేని రుణమాఫీ చేయకుండా కేవలం విడతల వారీగా రుణమాఫీ చేస్తాననడం రైతులను మరోమారు మోసం చేయడమే. రుణమాఫీపై తొలిసంతకం చేస్తానని .. కమిటీ వేసిన రోజే బాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్తు ఇస్తానని ఎన్నికలలో హామీ ఇచ్చి గెలిచిన వెంటనే తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైల్‌పై పెట్టి నిజమైన రైతు నాయకుడు అనిపించుకున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలి.

జాప్యం చేయడానికి మరో ఎత్తుగడ
ఉగ్ర నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు
 
ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైన టీడీపీ ప్రభుత్వం జాప్య చేయడానికి మరో ఎత్తుగడ ఇది. ఆధార్ సంఖ్య సరిగాలేదని, రేషన్ కార్డు నెంబర్ కనపడటంలేదనో బ్యాంకుల వద్దకు వెళ్లి చాలామంది రైతులు వెనక్కు వస్తున్నారు. స్పష్టత లేకుండా ప్రతిపక్షాలకు భయపడి అరకొర రుణమాఫీ చేయడం సరికాదు. మా కనిగిరి నియోజకవర్గంలోనే దాదాపు 60 నుంచి 70 కోట్ల వరకు రుణమాఫీ బాకీలున్నాయి. ఎన్నికలలో వ్యవసాయ రుణాలు కట్టొద్దు, అధికారంలోకి వచ్చిన వెంటనే రద్ధు చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.
 
ఆలోచించి హామీలివ్వాలి
కె అరుణ, సీపీఐ జిల్లా కార్యదర్శి
 
తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తి ఆలోచించి హామీలివ్వాలి. ఆచరణ సాధ్యం కాని హామీలిస్తే ఇలానే ఉంటుంది. 50 వేలలోపు ఉంటే ఒకేసారి చేస్తామనడం, వాయిదాల ప్రకారం రుణమాఫీ చేస్తామనడం, మిగతవాటికి బాండ్లు ఇస్తామనడం బాగాలేదు. ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలి. ముఖ్యంగా కౌలు రైతుల రుణాలు, మహిళలు తీసుకున్న రుణాలను రద్ధు చేయాల్సిందే.

రుణ విముక్తులను కాదు రుణ ఊబిలోకి...
 - సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగబోయిన రంగారావు

రుణమాఫీ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను రుణ విముక్తులను చేయకుండా మరింత రుణ ఊబిలోకి నెట్టేశారు. రుణమాఫీ చేస్తానని ప్రకటించడంతో రైతులు వాటిని కట్టకపోవడంతో ఆరునెలలకు కలిపిన వడ్డీని బ్యాంకర్లు అసలు కింద జమ చేస్తున్నారు. రుణాలు చెల్లించాలంటూ నోటీసులు వచ్చిన ప్రతిసారీ రూ. 400  రైతు ఖాతాకు అదనపు అప్పు కింద జమ చేస్తున్నారు. రుణమాఫీ ప్రస్తావన లేకుంటే సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు వడ్డీ మినహాయింపు  ఉంది.

లక్ష రూపాయల్లోపున్న వాటికి వడ్డీ మినహాయింపు, మూడు లక్షల్లోపున్నవారికి పావలా వడ్డీ ఉండేది. రుణమాఫీ అమలు కాకపోవడంతో బ్యాంకర్లు రైతుల నుంచి 13శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు.  బ్యాంకుల నుంచి రుణాలు రాకపోవడంతో వడ్డీ వ్యాపారుల నుంచి 3- 5 రూపాయలకు వడ్డీలకు తీసుకువచ్చి పంటలు సాగు చేశారు. చంద్రబాబు ఇదే మాదిరిగా మోసగిస్తూ పోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు.
 
రైతులకు ఉపయోగకరం..
బీజేపీ రాష్ట్ర నాయకులు బత్తిన నరశింహారావు

కోటయ్య కమిటీ లక్ష వరకే రుణమాఫీ అని సూచించినా చంద్రబాబు రూ1.50లక్షలన్నారు. దానికి కట్టుబడే నేడు తొలివిడతగా రూ50వేలలోపు రైతుల రుణాలను తీరుస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ఏదైనప్పటికి ప్రకటించిన హామీకి కట్టుబడి రుణం మాఫీచేసేందుకు చంద్రబాబు ముందుకు రావడం శుభపరిణామమే. ఇది రైతులకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది.
 
జగన్ తీసుకున్న నిర్ణయానికి భయపడి..
మారెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీై రెతు విభాగం జిల్లా అధ్యక్షుడు
 
రుణమాఫీ చేస్తానని ఎన్నికలలో ఇచ్చిన హామీపై ధర్నాలకు వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపుతో భయపడి 20 శాతం రుణమాఫీతో మళ్ళీ రైతులను మభ్య పెడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీకి కట్టుబడి తొలిసంతకం ఉచిత విద్యుత్తుపై చేస్తే.. బాబు మాత్రం రుణమాఫీపై పెట్టకుండా కమిటీ ఏర్పాటుకు సంతకం చేసిన రోజునే మోసపోయమని రైతులు భావించారు. ఏడు నెలలుగా కాలయాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్సార్ పార్టీ ధర్నాలు అనగానే భయపడి ముందురోజే  అరకొరగా రుణమాఫీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం సిగ్గుమాలిన పని.
 
ఇదేం రుణమాఫీ
దుగ్గినేని గోపినాధ్ , ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

రుణమాఫీ పూర్తిగాచేయకుండా తొలివిడత, మలివిడత అంటూ విడతల వారీగా రుణమాఫీ చేస్తే రైతులకు ఏం లాభం. పూర్తిగా రుణమాఫీ జరిగితేనే బ్యాంకులు మళ్ళీ రైతులకు రుణాలు ఇచ్చేది. ఇప్పటికే ఖరీఫ్, రబీ సీజన్‌లలో బ్యాంకు రుణాలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయారు. బయట అప్పులు తెచ్చుకోని సేద్యం చేస్తున్నారు. 20 శాతంరుణమాఫీ చేసి మిగిలిన దానికి బాండ్లు జారీ చేస్తామనడం విడ్డురంగా ఉంది. రైతులకు జారీ బాండ్లను బ్యాంకులకే జారీ చేసి పూర్తి రుణమాఫీ చేయాలి. ఇట్లాంటి రుణమాఫీలు రైతులకు అవసరం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement