ట్రంప్ తొలి సంతకం దేని పైనో తెలుసా?
ట్రంప్ తొలి సంతకం దేని పైనో తెలుసా?
Published Sat, Jan 21 2017 8:12 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డోనాల్డ్ ట్రంప్.. ముందునుంచి చెబుతున్నట్లు గానే ఒబామా కేర్ ఫైల్ మీద తన తొలి సంతకం చేశారు. తన ప్రారంభ ప్రసంగం అయిన తర్వాత ఓవల్ కార్యాలయంలో ప్రవేశించిన ఆయన ఒబామా కేర్‌కు సంబంధించిన నిబంధనలను సడలించాలని ఏజెన్సీలకు సూచించారు. ఒబామాకేర్‌ను మార్చి తీరుతానని ఆయన తన ఎన్నికల ప్రసంగాల్లో పదే పదే చెప్పిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ట్రంప్ సంతకం చేశారు. అయితే, ఈ ఆర్డర్‌లో వివరాలు ఏంటన్న విషయాన్ని వైట్ హౌస్ అధికారులు వెంటనే వెల్లడించలేదు.
ఒబామాకేర్ అనే ఆరోగ్య పథకాన్ని మారుస్తానని ఆయన చెప్పినా, దాని స్థానంలో ఎలాంటి పథకం తీసుకురాబోతున్నామన్న విషయాన్ని అటు ట్రంప్ గానీ, ఇటు రిపబ్లికన్లు గానీ ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. కొత్తగా నియమితులైన రక్షణ శాఖ మంత్రి జేమ్స్ మాటిస్, హోంలాండ్ సెక్యూరిటీ మంత్రి జాన్ కెల్లీలకు సంబంధించిన కమిషన్ల మీద కూడా ట్రంప్ సంతకాలు చేశారు. తొలిరోజు చాలా బిజీగా ఉంది గానీ, ఇది చాలా అందమైన రోజని ట్రంప్ విలేకరులతోవ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రత్యేకంగా మరో కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేశారు. కాగా, వైట్‌హౌస్ ప్రాంగణంలో ఇంతకుముందు విన్‌స్టన్ చర్చిల్ విగ్రహం ఉండేది. దాన్ని తీసేసి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ విగ్రహం పెట్టారు. అలాగే ఇంతకుముందున్న క్రిమస్సన్ డ్రేప్స్‌ను తీసి బంగారు డ్రేప్స్ వేలాడదీశారు.
Advertisement
Advertisement