Obamacare
-
ఒబామా కేర్ ఒక పీడకల : ట్రంప్
అమెరికా పౌరులందరూ తప్పనిసరిగా ఆరోగ్యబీమా పాలసీ కలిగి ఉండేలా నిర్దేశించిన ఒబామాకేర్ చట్టాన్ని(అఫర్డబుల్ కేర్ యాక్ట్) తొలగించి, దాని స్థానంలో కొత్తది అమల్లోకి తేవడానికి అమెరికా కాంగ్రెస్ లో జరిగిన అన్ని ప్రయత్నాలు విఫలమవ్వడంతో ట్రంప్ తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి కొత్త హెల్త్ కేర్ విధానంపై సంతకం చేశారు. 2010లో ఒబామాకేర్ బిల్లు చట్ట రూపందాల్చి నాలుగేళ్లకు అమల్లోకి వచ్చింది. అప్పటి వరకూ ఆరోగ్య బీమా కవరేజీలేని అమెరికన్లు లక్షలాది మందికి ఇది ఆసరా అయింది. అయితే, ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు వివాదాస్పదమయ్యాయి. కిందటేడాది అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఈ చట్టాన్ని రద్దుచేసి కొత్త బిల్లు తెస్తామని రిపబ్లికన్లు ప్రచారం చేశారు. ఎన్నికల్లో గెలిచిన ఈ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ తన హామీ మేరకు ఒబామాకేర్ రద్దుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దీంతో హెల్త్ కేర్‌పై కాంగ్రెస్‌లో కలిసికట్టుగా చట్టం చేయడంలో వీలుకాకపోవడంతో, మరింత మందికి హెల్త్ కేర్ ప్రయోజనాలు చేకూరడానికి తనకున్న విశేషాధికారలను ఉపయోగించి కొత్త విధానం అమలులోకి తెస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసిన సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ఒబామా కేర్ అమెరికన్లకు ఒక పీడకల అని విమర్శలు గుప్పించారు. బీమా పాలసీ లేని వారు ట్యాక్స్ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందనే నియమంతోపాటు ఇంకా అనేక నిబంధనలు ఒబామాకేర్ చట్టంలో పౌరులకు, సంస్థలకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని, పాలసీలేని ప్రజలు అపరాధసుంకం చెల్లించాలనే రూలును ప్రత్యామ్నాయ హెల్త్ కేర్‌లో తొలగిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అలాగే, 50 మందికి పైగా సిబ్బంది ఉన్న కంపెనీలు తమ ఉద్యోగులకు ఆరోగ్యబీమా పథకాలు కల్పించకపోతే పెనాల్టీ కట్టాలనే నిబంధనను కూడా రిపబ్లికన్ల హెల్త్ కేర్‌లో తొలగించారు. తక్కువ ప్రీమియం ప్లాన్స్‌తో అందరికీ ఆరోగ్య బీమా అందుబాటులో ఉండటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ తెలిపారు. ఈ నిర్ణయంతో ఆరోగ్య బీమా చేసుకునే వారి సంఖ్య అమెరికాలో మరింత పెరుగుతుందన్నారు. రాష్ట్రాలతో సంబంధంలేకుండా దేశంలో అమెరికా పౌరులు ఎక్కడైనా ఆరోగ్య బీమాని తీసుకోవొచ్చని వైట్ హౌస్ కార్యాలయం పేర్కొంది. -
ఒబామాకేర్కు ప్రత్యామ్నాయం లేదు!
సెనట్లో మూడో సారీ వీగిన ట్రంప్కేర్ బిల్లు అమెరికా పౌరులందరూ తప్పనిసరిగా ఆరోగ్యబీమా పాలసీ కలిగి ఉండేలా నిర్దేశించిన ఒబామాకేర్ చట్టాన్ని(అఫర్డబుల్ కేర్ యాక్ట్) తొలగించి, దాని స్థానంలో కొత్తది అమల్లోకి తేవడానికి ఈ వారం అమెరికా సెనెట్‌లో జరిగిన మూడు ప్రయత్నాలు విఫలమయ్యాయి. 2010లో ఒబామాకేర్ బిల్లు చట్ట రూపందాల్చి నాలుగేళ్లకు అమల్లోకి వచ్చింది. అప్పటి వరకూ ఆరోగ్య బీమా కవరేజీలేని అమెరికన్లు లక్షలాది మందికి ఇది ఆసరా అయింది. అయితే, ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు వివాదాస్పదమయ్యాయి. కిందటేడాది అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఈ చట్టాన్ని రద్దుచేసి కొత్త బిల్లు తెస్తామని రిపబ్లికన్లు ప్రచారం చేశారు. నవంబర్ ఎన్నికల్లో గెలిచిన ఈ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ తన హామీ మేరకు ఒబామాకేర్ రద్దుకు చేసిన ప్రయత్నాలు అమెరికా కాంగ్రెస్ దిగువసభ ప్రతినిధులసభలో సఫలమయ్యాయి. ఒబామాకేర్ స్థానంలో అమలుకుద్ధేశించిన కొత్త బిల్లు మొన్న మే నాలుగున 217-213 ఓట్లతో ఈ సభ ఆమోదం పొందింది. బీమా పాలసీ లేని వారు ట్యాక్స్ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందనే నియమంతోపాటు ఇంకా అనేక నిబంధనలు పౌరులకు, సంస్థలకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. పాలసీలేని ప్రజలు అపరాధసుంకం చెల్లించాలనే రూలును ప్రత్యామ్నాయ బిల్లుల్లో తొలగించారు. అలాగే, 50 మందికి పైగా సిబ్బంది ఉన్న కంపెనీలు తమ ఉద్యోగులకు ఆరోగ్యబీమా పథకాలు కల్పించకపోతే పెనాల్టీ కట్టాలనే నిబంధనను కూడా రిపబ్లికన్ల బిల్లుల్లో తొలగించారు. ఒబామాకేర్ చట్టం సంపన్నులపై వైద్యసౌకర్యాల పన్నును పెంచడమేగాక వైద్యపరికరాలు, ఆరోగ్యబీమా, శరీరం రంగు మారడానికి సాయపడే కంపెనీలపై విధించిన కొత్త పన్నులను కూడా కొత్త బిల్లుల్లో తొలగించారు. ప్రత్యామ్నాయ బిల్లు ఆమోదంపొందితే కోటిన్నర మందికి అమెరికన్లకు బీమా ఉండదు! ఎగువసభ సెనెట్‌లో పాలకపక్షమైన రిపబ్లికన్లకు స్పష్టమైన మెజారిటీ ఉన్నాగాని వారిలో ముగ్గురు ఒబామాకేర్కు ప్రత్యామ్నాయంగా రూపొందించిన బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం ఓటేయడంతో అది వీగిపోయింది. ఒకవేళ తాజా బిల్లుపై వ్యతిరేకంగా, అనుకూలంగా 50 చొప్పున సమానంగా ఓట్లు పడితే నిర్ణాయక ఓటు వేయడానికి సెనెట్ ఎక్స్ అఫీషియో చైర్మన్ అయిన ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఓటింగ్ సమయంలో సభలో ఉన్నారు. ఆనారోగ్యంతో కొన్నిరోజులు సభకు దూరంగా ఉన్న సీనియర్ సెనటర్, 2008 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి జాన్ మెకెయిన్ ఓటింగ్‌లో పాల్గొని డెమొక్రాట్లతో కలిసి బిల్లును వ్యతిరేకించడంతో వారంలో వీగిపోయిన మూడో ప్రత్యామ్నాయ బిల్లుగా చరిత్రకెక్కింది. ఇదే వారం రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన రెండు ప్రత్యామ్నాయ ఆరోగ్యబీమా బిల్లులు కూడా మెజారిటీ ఆమోదం పొందడంలో విఫలమయ్యాయి. సెనట్లో మెజారిటీ మద్దతు కూడగట్టడంలో వరుసగా విఫలమైన బిల్లుల్లో ఏది చట్టమైనా 2026 నాటికి కోటీ 60 లక్షల మంది ఆరోగ్యబీమా సౌకర్యం కోల్పోయేవారని, బీమా ప్రీమియం 20శాతం పెరిగేదని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనావేసింది. ఎన్ని లోపాలున్నాగాని 2014 నుంచి కట్టు దిట్టంగా అమలవుతున్న ఒబామాకేర్ చట్టం ఫలితంగా అమెరికాలో అసలు ఆరోగ్య బీమాలేని వారి సంఖ్య 8 శాతానికి పడిపోయింది. ఒబామా హయాంలో రూపుదిద్దుకున్న ఈ చట్టాన్ని వ్యతిరేకించినవారు దాన్నిచులకనచేసి మాట్లాడుతూ ‘ఒబామాకేర్’అని పిలవడం ప్రారంభించగా, కొన్నాళ్లకు ఆయన మద్దతుదారులు ఎంతో అభిమానంతో ఈ మాటలను స్వీకరించి వాడుకలో ప్రచారం కల్పించడం విశేషం. ప్రస్తుతం సెనెట్‌లో మెజారిటీ పక్షమైన రిపబ్లికన్లకు ఒబామాకేర్కు ప్రత్యామ్నాయంగా తీసుకురావడానికి మరే బిల్లు రెడీగా లేదు. దీంతో ఒబామాకేర్ తొలగిచడానికి ఎంతకాలం పడుతుందో చెప్పడం కష్టం. -(సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ట్రంప్ తొలి సంతకం దేని పైనో తెలుసా?
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డోనాల్డ్ ట్రంప్.. ముందునుంచి చెబుతున్నట్లు గానే ఒబామా కేర్ ఫైల్ మీద తన తొలి సంతకం చేశారు. తన ప్రారంభ ప్రసంగం అయిన తర్వాత ఓవల్ కార్యాలయంలో ప్రవేశించిన ఆయన ఒబామా కేర్‌కు సంబంధించిన నిబంధనలను సడలించాలని ఏజెన్సీలకు సూచించారు. ఒబామాకేర్ను మార్చి తీరుతానని ఆయన తన ఎన్నికల ప్రసంగాల్లో పదే పదే చెప్పిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ట్రంప్ సంతకం చేశారు. అయితే, ఈ ఆర్డర్లో వివరాలు ఏంటన్న విషయాన్ని వైట్ హౌస్ అధికారులు వెంటనే వెల్లడించలేదు. ఒబామాకేర్ అనే ఆరోగ్య పథకాన్ని మారుస్తానని ఆయన చెప్పినా, దాని స్థానంలో ఎలాంటి పథకం తీసుకురాబోతున్నామన్న విషయాన్ని అటు ట్రంప్ గానీ, ఇటు రిపబ్లికన్లు గానీ ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. కొత్తగా నియమితులైన రక్షణ శాఖ మంత్రి జేమ్స్ మాటిస్, హోంలాండ్ సెక్యూరిటీ మంత్రి జాన్ కెల్లీలకు సంబంధించిన కమిషన్ల మీద కూడా ట్రంప్ సంతకాలు చేశారు. తొలిరోజు చాలా బిజీగా ఉంది గానీ, ఇది చాలా అందమైన రోజని ట్రంప్ విలేకరులతోవ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రత్యేకంగా మరో కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేశారు. కాగా, వైట్‌హౌస్ ప్రాంగణంలో ఇంతకుముందు విన్స్టన్ చర్చిల్ విగ్రహం ఉండేది. దాన్ని తీసేసి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ విగ్రహం పెట్టారు. అలాగే ఇంతకుముందున్న క్రిమస్సన్ డ్రేప్స్‌ను తీసి బంగారు డ్రేప్స్ వేలాడదీశారు. -
ట్రంప్ ప్రమాణ ఈవెంట్లో తెలుగు వ్యక్తి
అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అరిజోనా రిపబ్లికన్ పార్టీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఇరగవరపు అవినాశ్ హాజరయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రచారం చేసి, ఆయన విజయంలో కీలకపాత్ర పోషించిన కొద్దిమందిలో అవినాశ్ ఒకరు. రిపబ్లికన్ పార్టీ నేత అవినాశ్ ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు కావడం విశేషం. వాషింగ్టన్ నుంచి అవినాశ్ మాట్లాడుతూ.. ఒబామా కేర్‌ను సమూలంగా మార్చి, ఇందులో ఎలాంటి మార్పులు తీసుకురావాలనే దానిపై ట్రంప్ కి ఇప్పటికే ఒక అవగాహన ఉందని అవినాశ్ తెలిపారు. ఉగ్రవాదులకు, అక్రమ శరణార్థులకు సమస్యలు తప్పవని.. చైనా యే పెద్ద ప్రమాదంగా ట్రంప్ భావిస్తున్నారని చెప్పారు. రాజకీయాలపై ఉన్న ఆసక్తితో న్యూఢిల్లీలో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అంతకుముందు బెంగళూరు, హైదరాబాద్ లోనూ పనిచేసిన అవినాశ్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తరఫున పనిచేశానని వివరించారు. -
ట్రంప్ తొలి లక్ష్యం ‘ఒబామాకేర్’!
అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయన ప్రాథమ్యాలు ఏమిటి? ఎన్నికల ప్రచారంలో చెప్పినవి చేస్తారా? చెప్పనివి కూడా చేస్తారా? ప్రధాన మీడియా చేసిన ‘వ్యతిరేక ప్రచారం’, హిల్లరీ ‘పాజిటివ్ వేవ్’ను తట్టుకుని ఎలా గెలవగలిగారు? చైనా, రష్యాలతో ఎలా వ్యవహరించబోతున్నారు? భారత్ పరిస్థితి ఏమిటి? మనవాళ్ల భయాలేమిటి? ఇలాంటి ఎన్నో సందేహాలు.. వీటన్నిటి గురించి ట్రంప్ విన్నింగ్ టీమ్‌లోని ఇరగవరపు అవినాశ్ వివరించారు. అరిజోనా రిపబ్లికన్ పార్టీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అవినాశ్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషించారు. ఇంటర్వ్యూలో అవినాశ్ చెప్పిన విశేషాలివీ.. ఒబామా కేర్ మారనున్నది: ఎన్నికల ప్రసంగాలలోనూ, ప్రణాళికలోనూ హామీ ఇచ్చిన విధంగా ఒబామా కేర్‌ను సమూలంగా మార్చి కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నారు. ఇందులో ఎలాంటి మార్పులు తీసుకురావాలనే దానిపై ట్రంప్ కి ఇప్పటికే ఒక అవగాహన ఉంది. ప్రచారంలో చెప్పిన విధంగా మార్పులు తీసుకురాబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే అనేక మార్గాల ద్వారా అభిప్రాయసేకరణ జరిపారు. అలాగే ఉగ్రవాదంపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నారు. ఆర్థిక వ్యవస్థను పరుగుపెట్టించడం కూడా ట్రంప్ ప్రాథమ్యాలలో ఉంది. అక్రమ శరణార్థులకే సమస్య : ఇమ్మిగ్రేషన్ చట్టాలకు అనుగుణంగా అనుమతులు ఉన్నవారికి ఏమీ కాదు. అక్రమంగా వలస వచ్చిన వారికి మాత్రమే ఇబ్బంది. తప్పుడు ధృవపత్రాలతో ఇక్కడికి వచ్చినవారికి మాత్రం కష్టాలు తప్పవు. అయితే ప్రచారంలో చెప్పినంత కఠినంగా పరిపాలన ఉంటుందని అనుకోవడం లేదు. హెచ్1బీ వీసాలు రద్దయిపోవు: హెచ్1బీ వీసాలు ఉన్నఫళంగా రద్దయిపోతాయని, భారత్‌కు అవకాశాలు లేకుండా పోతాయని భయపడనవసరం లేదు. హెచ్1బి వీసాలపై అధ్యక్షుడొక్కరే నిర్ణయం తీసుకోలేరు. దానికి సంబంధించి ఏ నిర్ణయమైనా అమెరికా చట్ట సభ కాంగ్రెస్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది అంత సులభమని నేను అనుకోవడం లేదు. అందువల్ల భారతీయులు అంతగా భయపడాల్సిన పనిలేదు. చైనా, భారత్, రష్యాలతో సంబంధాలు : చైనా యే పెద్ద ప్రమాదంగా ట్రంప్ భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ల ఉత్పత్తుల వల్ల అన్ని దేశాలతో పాటు అమెరికా మార్కెట్ కూడా దెబ్బతింటోంది. చైనాకు చెక్ పెట్టాలన్నా పాకిస్తాన్‌కు చెక్ పెట్టాలన్నా అమెరికాకు భారత్ చాలా అవసరం. ఎలా చూసినా మనకు మంచి రోజులేనని భావించాలి. రిపబ్లికన్ అడ్మినిస్ట్రేషన్ రానున్న నాలుగేళ్లు భారత్‌తో సానుకూలమైన వైఖరినే అనుసరిస్తుందని భావించాలి. రష్యా విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. మెక్సికో సరిహద్దు గోడ : నేను ఉంటున్న అరి జోనా రాష్ట్రం మెక్సికో సరిహద్దులోనే ఉంటుంది. గోడ కొత్తగా కట్టబోవడం లేదు. ఇప్పటికే అక్కడ గోడ ఉంది. అయితే ఉండాల్సినంత మేర లేదు. కొన్ని చోట్ల ఫెన్సింగ్, మరికొన్ని చోట్ల ఖాళీగా ఉంది. అలా ఉండబట్టే అక్రమ చొరబాట్లు, ఘర్షణలు జరుగుతున్నాయి. ఎన్నికలకు ముందు ట్రంప్ మెక్సికో వెళ్లినపుడు ఆ దేశాధ్యక్షుడిని కలసిన సందర్భంగా ఈ గోడ ప్రతిపాదనపై చర్చ జరిగింది. ఇద్దరూ కలిసే ఆ ప్రకటన చేశారు. బాల్యం, చదువు : తూర్పుగోదావరి జిల్లా రాజ మండ్రిలో నా బాల్యం, చదువు సాగాయి. పుట్టింది రావులపాలెం సమీపంలోని ముమ్మిడివరప్పాడు. అమ్మ నాన్న హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. విజయవాడలో ఇంటర్, విశాఖలో డిగ్రీ చేశాను. లక్నో ఐఐ ఎంలో ఎంబీఏ పూర్తిచేశాను. తర్వాత బెంగళూరు, హైదరాబాద్‌లో పనిచేశాను. 2014 ఎన్నికలలో వైఎస్సార్సీపీ తరఫున పనిచేశాను. ఇంతకూ ఎలా గెలిచామంటే: సర్వేలు, మీడియా అన్నీ ట్రంప్‌కు వ్యతిరేకం. అందుకే మేం ‘గ్రౌండ్ గేమ్’పై దృష్టిపెట్టాం. ఒక దశ దాటిందంటే మీడియా ఎంత చెప్పినా అది గందరగోళమే. జనం నమ్మరు. క్లింటన్ వ్యతిరేక అంశాలను ప్రధాన మీడియా పట్టించుకోకపోవడాన్ని జనం గమనిం చారు. అది కూడా మాకు కలసి వచ్చింది. వాటిపై మేం సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేశాం. ట్రంప్ ఇంతకు ముందు రాజకీయాలలో లేకపోవడం అనే అంశాన్ని ఎక్కువ చూపించాం. ‘మనలో ఒకడు –మార్పు తీసుకురాగలడు’ అనేది బాగా ప్రచారం అయ్యింది. జనాభాలో వయసు, అభిరుచులు, జీవన సరళి గణాంకాల ప్రకారం మా ప్రచారవ్యూహాన్ని తయారుచేశాం. ఎవరికి ఏ అంశంపై ఆసక్తి ఉంటుందో వారికి ఆ వివరాలు చేరేలా చేశాం. ఎవరు ఏది సౌకర్యంగా భావిస్తారో.. (అంటే ఉత్తరాలు పంపడం, ఫోన్లో వివరించడం, కలసి మాట్లాడడం వంటివి) వారిని ఆ విధంగానే చేరుకున్నాం. ఇదంతా ఏడాదిన్నర క్రితం నుంచే ప్రణాళికా బద్ధంగా చేస్తూ వచ్చాం. అంటే ట్రంప్ నామినీ అని తేలకముందే రిపబ్లికన్ పార్టీ ప్రచారం క్షేత్రస్థాయిలో జరుగుతూ వచ్చింది. ఏ పార్టీకీ చెందనివారు 30శాతం వరకూ ఉంటారు. వారినే లక్ష్యంగా చేసుకుని పనిచేశాం. ఇంటర్వ్యూ : పోతుకూరు శ్రీనివాసరావు -
పట్టంకడితే ‘ఒబామాకేర్’ను రద్దు చేస్తా
* మాటలు చెప్పను.. చేతల్లో చూపుతా * అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బాబీ జిందాల్ వాషింగ్టన్: అమెరికా 2016 అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించిన భారతీయఅమెరికన్, లూసియానా రాష్ట్ర గవర్నర్ బాబీ జిందాల్ (44) గురువారం ఆ రాష్ట్రంలోని న్యూఓర్లీన్స్ నగరం నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించారు. తనను తాను కార్యసాధకుడిగా ప్రకటించుకున్న జిందాల్...ప్రస్తుత దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా సహా ఎన్నికల బరిలో నిలిచిన ఇతర అభ్యర్థులను మాటకారులుగా అభివర్ణించారు. ఒబామా ప్రసంగాలతో దేశానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. తాను మాటలు చెప్పనని, చేతల్లో చూపుతానని చెప్పారు. ఎన్నికల్లో తనకు పట్టంకడితే ఒబామా అమల్లోకి తెచ్చిన వివాదాస్పద హెల్త్‌కేర్ ప్లాన్ (ఒబామాకేర్)ను రద్దు చేస్తానని జిందాల్ ప్రకటించారు. అలాగే ముస్లిం మతచాందసవాదంపై ఉక్కుపాదం మోపుతానన్నారు. ఫెడరల్ ప్రభుత్వ పరిధి, విస్తృతిని తగ్గించి ప్రైవేటు ఆర్థిక రంగానికి పెద్దపీట వేస్తానన్నారు. కాగా, తన భారతీయ మూలాల గురించి చెప్పుకునేందుకు జిందాల్ ఇష్టపడలేదు. తాను భారతీయ-అమెరికన్‌ను కాదని...అమెరికన్నే అని చెప్పుకొచ్చారు. జాతి, ప్రాంతం, మతం ఆధారంగా ఒబామా తమను విభజించేందుకు చూస్తున్నారని ఆరోపించారు. మరోవైపు అధ్యక్ష పదవికి పోటీ విషయాన్ని తొలుత తన ముగ్గురు పిల్లలకు తెలియజెప్పడాన్ని జిందాల్ రహస్యంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంపై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.