పట్టంకడితే ‘ఒబామాకేర్’ను రద్దు చేస్తా
* మాటలు చెప్పను.. చేతల్లో చూపుతా
* అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బాబీ జిందాల్
వాషింగ్టన్: అమెరికా 2016 అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించిన భారతీయఅమెరికన్, లూసియానా రాష్ట్ర గవర్నర్ బాబీ జిందాల్ (44) గురువారం ఆ రాష్ట్రంలోని న్యూఓర్లీన్స్ నగరం నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించారు. తనను తాను కార్యసాధకుడిగా ప్రకటించుకున్న జిందాల్...ప్రస్తుత దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా సహా ఎన్నికల బరిలో నిలిచిన ఇతర అభ్యర్థులను మాటకారులుగా అభివర్ణించారు.
ఒబామా ప్రసంగాలతో దేశానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. తాను మాటలు చెప్పనని, చేతల్లో చూపుతానని చెప్పారు. ఎన్నికల్లో తనకు పట్టంకడితే ఒబామా అమల్లోకి తెచ్చిన వివాదాస్పద హెల్త్‌కేర్ ప్లాన్ (ఒబామాకేర్)ను రద్దు చేస్తానని జిందాల్ ప్రకటించారు. అలాగే ముస్లిం మతచాందసవాదంపై ఉక్కుపాదం మోపుతానన్నారు. ఫెడరల్ ప్రభుత్వ పరిధి, విస్తృతిని తగ్గించి ప్రైవేటు ఆర్థిక రంగానికి పెద్దపీట వేస్తానన్నారు.
కాగా, తన భారతీయ మూలాల గురించి చెప్పుకునేందుకు జిందాల్ ఇష్టపడలేదు. తాను భారతీయ-అమెరికన్‌ను కాదని...అమెరికన్‌నే అని చెప్పుకొచ్చారు. జాతి, ప్రాంతం, మతం ఆధారంగా ఒబామా తమను విభజించేందుకు చూస్తున్నారని ఆరోపించారు. మరోవైపు అధ్యక్ష పదవికి పోటీ విషయాన్ని తొలుత తన ముగ్గురు పిల్లలకు తెలియజెప్పడాన్ని జిందాల్ రహస్యంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంపై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.