ఒబామాకేర్‌కు ప్రత్యామ్నాయం లేదు!
సెనట్‌లో మూడో సారీ వీగిన ట్రంప్‌కేర్ బిల్లు
అమెరికా పౌరులందరూ తప్పనిసరిగా ఆరోగ్యబీమా పాలసీ కలిగి ఉండేలా నిర్దేశించిన ఒబామాకేర్ చట్టాన్ని(అఫర్డబుల్ కేర్ యాక్ట్) తొలగించి, దాని స్థానంలో కొత్తది అమల్లోకి తేవడానికి ఈ వారం అమెరికా సెనెట్‌లో జరిగిన మూడు ప్రయత్నాలు విఫలమయ్యాయి. 2010లో ఒబామాకేర్ బిల్లు చట్ట రూపందాల్చి నాలుగేళ్లకు అమల్లోకి వచ్చింది. అప్పటి వరకూ ఆరోగ్య బీమా కవరేజీలేని అమెరికన్లు లక్షలాది మందికి ఇది ఆసరా అయింది. అయితే, ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు వివాదాస్పదమయ్యాయి. కిందటేడాది అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఈ చట్టాన్ని రద్దుచేసి కొత్త బిల్లు తెస్తామని రిపబ్లికన్లు ప్రచారం చేశారు. నవంబర్ ఎన్నికల్లో గెలిచిన ఈ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ తన హామీ మేరకు ఒబామాకేర్ రద్దుకు చేసిన ప్రయత్నాలు అమెరికా కాంగ్రెస్ దిగువసభ ప్రతినిధులసభలో సఫలమయ్యాయి. ఒబామాకేర్ స్థానంలో అమలుకుద్ధేశించిన కొత్త బిల్లు మొన్న మే నాలుగున 217-213 ఓట్లతో ఈ సభ ఆమోదం పొందింది.
బీమా పాలసీ లేని వారు ట్యాక్స్ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందనే నియమంతోపాటు ఇంకా అనేక నిబంధనలు పౌరులకు, సంస్థలకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. పాలసీలేని ప్రజలు అపరాధసుంకం చెల్లించాలనే రూలును ప్రత్యామ్నాయ బిల్లుల్లో తొలగించారు. అలాగే, 50 మందికి పైగా సిబ్బంది ఉన్న కంపెనీలు తమ ఉద్యోగులకు ఆరోగ్యబీమా పథకాలు కల్పించకపోతే పెనాల్టీ కట్టాలనే నిబంధనను కూడా రిపబ్లికన్ల బిల్లుల్లో తొలగించారు. ఒబామాకేర్ చట్టం సంపన్నులపై వైద్యసౌకర్యాల పన్నును పెంచడమేగాక వైద్యపరికరాలు, ఆరోగ్యబీమా, శరీరం రంగు మారడానికి సాయపడే కంపెనీలపై విధించిన కొత్త పన్నులను కూడా కొత్త బిల్లుల్లో తొలగించారు.
ప్రత్యామ్నాయ బిల్లు ఆమోదంపొందితే కోటిన్నర మందికి అమెరికన్లకు బీమా ఉండదు!
ఎగువసభ సెనెట్‌లో పాలకపక్షమైన రిపబ్లికన్లకు స్పష్టమైన మెజారిటీ ఉన్నాగాని వారిలో ముగ్గురు ఒబామాకేర్‌కు ప్రత్యామ్నాయంగా రూపొందించిన బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం ఓటేయడంతో అది వీగిపోయింది. ఒకవేళ తాజా బిల్లుపై వ్యతిరేకంగా, అనుకూలంగా 50 చొప్పున సమానంగా ఓట్లు పడితే నిర్ణాయక ఓటు వేయడానికి సెనెట్ ఎక్స్ అఫీషియో చైర్మన్ అయిన ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఓటింగ్ సమయంలో సభలో ఉన్నారు. ఆనారోగ్యంతో కొన్నిరోజులు సభకు దూరంగా ఉన్న సీనియర్ సెనటర్, 2008 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి జాన్ మెకెయిన్ ఓటింగ్‌లో పాల్గొని డెమొక్రాట్లతో కలిసి బిల్లును వ్యతిరేకించడంతో వారంలో వీగిపోయిన మూడో ప్రత్యామ్నాయ బిల్లుగా చరిత్రకెక్కింది. ఇదే వారం రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన రెండు ప్రత్యామ్నాయ ఆరోగ్యబీమా బిల్లులు కూడా మెజారిటీ ఆమోదం పొందడంలో విఫలమయ్యాయి. సెనట్‌లో మెజారిటీ మద్దతు కూడగట్టడంలో వరుసగా విఫలమైన బిల్లుల్లో ఏది చట్టమైనా 2026 నాటికి కోటీ 60 లక్షల మంది ఆరోగ్యబీమా సౌకర్యం కోల్పోయేవారని, బీమా ప్రీమియం 20శాతం పెరిగేదని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనావేసింది.
ఎన్ని లోపాలున్నాగాని 2014 నుంచి కట్టు దిట్టంగా అమలవుతున్న ఒబామాకేర్ చట్టం ఫలితంగా అమెరికాలో అసలు ఆరోగ్య బీమాలేని వారి సంఖ్య 8 శాతానికి పడిపోయింది. ఒబామా హయాంలో రూపుదిద్దుకున్న ఈ చట్టాన్ని వ్యతిరేకించినవారు దాన్నిచులకనచేసి మాట్లాడుతూ ‘ఒబామాకేర్’అని పిలవడం ప్రారంభించగా, కొన్నాళ్లకు ఆయన మద్దతుదారులు ఎంతో అభిమానంతో ఈ మాటలను స్వీకరించి వాడుకలో ప్రచారం కల్పించడం విశేషం. ప్రస్తుతం సెనెట్‌లో మెజారిటీ పక్షమైన రిపబ్లికన్లకు ఒబామాకేర్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకురావడానికి మరే బిల్లు రెడీగా లేదు. దీంతో ఒబామాకేర్ తొలగిచడానికి ఎంతకాలం పడుతుందో చెప్పడం కష్టం.
-(సాక్షి నాలెడ్జ్ సెంటర్)