డొనాల్డ్ ట్రంప్‌తో ఇరగవరపు అవినాశ్
అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయన ప్రాథమ్యాలు ఏమిటి? ఎన్నికల ప్రచారంలో చెప్పినవి చేస్తారా? చెప్పనివి కూడా చేస్తారా? ప్రధాన మీడియా చేసిన ‘వ్యతిరేక ప్రచారం’, హిల్లరీ ‘పాజిటివ్ వేవ్’ను తట్టుకుని ఎలా గెలవగలిగారు? చైనా, రష్యాలతో ఎలా వ్యవహరించబోతున్నారు? భారత్ పరిస్థితి ఏమిటి? మనవాళ్ల భయాలేమిటి? ఇలాంటి ఎన్నో సందేహాలు.. వీటన్నిటి గురించి ట్రంప్ విన్నింగ్ టీమ్‌లోని ఇరగవరపు అవినాశ్ వివరించారు. అరిజోనా రిపబ్లికన్ పార్టీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అవినాశ్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషించారు. ఇంటర్వ్యూలో అవినాశ్ చెప్పిన విశేషాలివీ..
ఒబామా కేర్ మారనున్నది: ఎన్నికల ప్రసంగాలలోనూ, ప్రణాళికలోనూ హామీ ఇచ్చిన విధంగా ఒబామా కేర్‌ను సమూలంగా మార్చి కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నారు. ఇందులో ఎలాంటి మార్పులు తీసుకురావాలనే దానిపై ట్రంప్ కి ఇప్పటికే ఒక అవగాహన ఉంది. ప్రచారంలో చెప్పిన విధంగా మార్పులు తీసుకురాబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే అనేక మార్గాల ద్వారా అభిప్రాయసేకరణ జరిపారు. అలాగే ఉగ్రవాదంపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నారు. ఆర్థిక వ్యవస్థను పరుగుపెట్టించడం కూడా ట్రంప్ ప్రాథమ్యాలలో ఉంది.
అక్రమ శరణార్థులకే సమస్య : ఇమ్మిగ్రేషన్ చట్టాలకు అనుగుణంగా అనుమతులు ఉన్నవారికి ఏమీ కాదు. అక్రమంగా వలస వచ్చిన వారికి మాత్రమే ఇబ్బంది. తప్పుడు ధృవపత్రాలతో ఇక్కడికి వచ్చినవారికి మాత్రం కష్టాలు తప్పవు. అయితే ప్రచారంలో చెప్పినంత కఠినంగా పరిపాలన ఉంటుందని అనుకోవడం లేదు.
హెచ్1బీ వీసాలు రద్దయిపోవు: హెచ్1బీ వీసాలు ఉన్నఫళంగా రద్దయిపోతాయని, భారత్‌కు అవకాశాలు లేకుండా పోతాయని భయపడనవసరం లేదు. హెచ్1బి వీసాలపై అధ్యక్షుడొక్కరే నిర్ణయం తీసుకోలేరు. దానికి సంబంధించి ఏ నిర్ణయమైనా అమెరికా చట్ట సభ కాంగ్రెస్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది అంత సులభమని నేను అనుకోవడం లేదు. అందువల్ల భారతీయులు అంతగా భయపడాల్సిన పనిలేదు.
చైనా, భారత్, రష్యాలతో సంబంధాలు : చైనా యే పెద్ద ప్రమాదంగా ట్రంప్ భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ల ఉత్పత్తుల వల్ల అన్ని దేశాలతో పాటు అమెరికా మార్కెట్ కూడా దెబ్బతింటోంది. చైనాకు చెక్ పెట్టాలన్నా పాకిస్తాన్‌కు చెక్ పెట్టాలన్నా అమెరికాకు భారత్ చాలా అవసరం. ఎలా చూసినా మనకు మంచి రోజులేనని భావించాలి. రిపబ్లికన్ అడ్మినిస్ట్రేషన్ రానున్న నాలుగేళ్లు భారత్‌తో సానుకూలమైన వైఖరినే అనుసరిస్తుందని భావించాలి. రష్యా విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది.
మెక్సికో సరిహద్దు గోడ : నేను ఉంటున్న అరి జోనా రాష్ట్రం మెక్సికో సరిహద్దులోనే ఉంటుంది. గోడ కొత్తగా కట్టబోవడం లేదు. ఇప్పటికే అక్కడ గోడ ఉంది. అయితే ఉండాల్సినంత మేర లేదు. కొన్ని చోట్ల ఫెన్సింగ్, మరికొన్ని చోట్ల ఖాళీగా ఉంది. అలా ఉండబట్టే అక్రమ చొరబాట్లు, ఘర్షణలు జరుగుతున్నాయి. ఎన్నికలకు ముందు ట్రంప్ మెక్సికో వెళ్లినపుడు ఆ దేశాధ్యక్షుడిని కలసిన సందర్భంగా ఈ గోడ ప్రతిపాదనపై చర్చ జరిగింది. ఇద్దరూ కలిసే ఆ ప్రకటన చేశారు.
బాల్యం, చదువు : తూర్పుగోదావరి జిల్లా రాజ మండ్రిలో నా బాల్యం, చదువు సాగాయి. పుట్టింది రావులపాలెం సమీపంలోని ముమ్మిడివరప్పాడు. అమ్మ నాన్న హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. విజయవాడలో ఇంటర్, విశాఖలో డిగ్రీ చేశాను. లక్నో ఐఐ ఎంలో ఎంబీఏ పూర్తిచేశాను. తర్వాత బెంగళూరు, హైదరాబాద్‌లో పనిచేశాను. 2014 ఎన్నికలలో వైఎస్సార్సీపీ తరఫున పనిచేశాను.
ఇంతకూ ఎలా గెలిచామంటే: సర్వేలు, మీడియా అన్నీ ట్రంప్‌కు వ్యతిరేకం. అందుకే మేం ‘గ్రౌండ్ గేమ్’పై దృష్టిపెట్టాం. ఒక దశ దాటిందంటే మీడియా ఎంత చెప్పినా అది గందరగోళమే. జనం నమ్మరు. క్లింటన్ వ్యతిరేక అంశాలను ప్రధాన మీడియా పట్టించుకోకపోవడాన్ని జనం గమనిం చారు. అది కూడా మాకు కలసి వచ్చింది. వాటిపై మేం సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేశాం. ట్రంప్ ఇంతకు ముందు రాజకీయాలలో లేకపోవడం అనే అంశాన్ని ఎక్కువ చూపించాం. ‘మనలో ఒకడు –మార్పు తీసుకురాగలడు’ అనేది బాగా ప్రచారం అయ్యింది. జనాభాలో వయసు, అభిరుచులు, జీవన సరళి గణాంకాల ప్రకారం మా ప్రచారవ్యూహాన్ని తయారుచేశాం. ఎవరికి ఏ అంశంపై ఆసక్తి ఉంటుందో వారికి ఆ వివరాలు చేరేలా చేశాం. ఎవరు ఏది సౌకర్యంగా భావిస్తారో.. (అంటే ఉత్తరాలు పంపడం, ఫోన్లో వివరించడం, కలసి మాట్లాడడం వంటివి) వారిని ఆ విధంగానే చేరుకున్నాం. ఇదంతా ఏడాదిన్నర క్రితం నుంచే ప్రణాళికా బద్ధంగా చేస్తూ వచ్చాం. అంటే ట్రంప్ నామినీ అని తేలకముందే రిపబ్లికన్ పార్టీ ప్రచారం క్షేత్రస్థాయిలో జరుగుతూ వచ్చింది. ఏ పార్టీకీ చెందనివారు 30శాతం వరకూ ఉంటారు. వారినే లక్ష్యంగా చేసుకుని పనిచేశాం.
ఇంటర్వ్యూ : పోతుకూరు శ్రీనివాసరావు