shobha rani
-
నమ్మించి.. మద్యం తాగించి.. అంతమొందించి.. ఆపై..
నిజామాబాద్: ఆస్తి, నగల కోసం వరుసకు నానమ్మ అయ్యే మహిళను హత్య చేశాడో యువకుడు. మద్యం తాగించి అటవీ ప్రాంతంలో అంతమొందించి ఏమి ఎరుగనట్లు ఇల్లు చేరాడు. నిజాంసాగర్ మండలం మాగి శివారులోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. పిట్లం మండల కేంద్రానికి చెందిన దత్తుకు ముగ్గురు భార్యలు ఉన్నారు. మొదటి భార్య అంజవ్వ మనవడు సంతోష్, మూడో భార్య శోభారాణి(45)ని ఈ నెల 2న నిజాంసాగర్ ప్రాజెక్టు సందర్శనకు బైక్‌పై తీసుకొచ్చాడు. ప్రాజెక్టును చూసిన తర్వాత బైక్‌పై నిజాంసాగర్‌కు చేరుకున్నారు. అక్కడ మద్యం తీసుకున్న సంతోష్ నానమ్మను మాగి శివారులోని అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లాడు. అక్కడ ఇద్దరు కలిసి మద్యం తాగారు. అనంతరం సంతోష్, శోభారాణి తలపై కర్రతో కొట్టి చంపాడు. అనంతరం సాయంత్రం వేళ పిట్లం చేరుకున్నాడు. రాత్రి వరకు శోభారాణి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సంతోష్‌ను అడుగగా పిట్లంలో దించినట్లు చెప్పాడు. కుటుంబ సభ్యులు పిట్లం పోలీస్ స్టేషన్లో శోభారాణి మిస్ అయినట్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని సంతోష్‌ను విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. సంతోష్‌ను అదుపులోకి తీసుకు న్న పోలీసులు ఘటన స్థలానికి తీసుకువచ్చారు. ఘటన స్థలాన్ని సీఐ మురళి పరిశీలించారు. శోభారాణి ఒంటిపైన ఉన్న నగలతో పాటు ఆస్తి కోసం సంతోష్ హత్య చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. -
అందరి సహకారంతో అభివృద్ధి
లక్సెట్టిపేట : అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి చేస్తానని జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయని, అన్నింటిపై దృష్టిసారించి అభివృద్ధి చేస్తానని తెలిపారు. వెనకబడిన జిల్లాగా కాకుండా అన్ని విధాలా సౌకర్యాలు కల్పిస్తానని చెప్పారు. అనంతరం ఆమెను ఎంపీటీసీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. సమస్యలపై అధికారుల నిలదీత తలమలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎంపీ పీ కట్ల చంద్రయ్య కోరగా, విద్యుత్ శాఖ అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. విద్యుత్ సరిగా ఉండడం లేదని, రాత్రిళ్లు విఫరీతంగా కోత విధిస్తున్నారని పేర్కొన్నారు. పలు చోట్ల షాక్ వసుందని తిమ్మాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు గడుసు స్వప్న, ఊత్కూరు సర్పంచ్ రాజలింగయ్య అధికారుల దృష్టికి తెచ్చారు. బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని కోరారు. అలాగే మీ సేవ సర్టిఫికెట్లకు అధికారులు డబ్బులు తీసుకుంటున్నారని, డబ్బులు ఇవ్వనిదే తహశీల్దార్ కార్యాలయంలో ఏపని కావడం లేదని కొత్తూరు సర్పంచ్ గుండ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. దీంతో ఎమ్మెల్యే దివాకర్‌రావు కల్పించుకొని తహశీల్దార్ ఆనంద్‌బాబును వివరణ కోరారు. కార్యాలయ సిబ్బంది అవినీతికి పాల్పడకుండా ప్రజలకు సేవలు అందించాలని ఆదేశించారు. సమావేశం ఎజెండాలో జనరల్ ఫండ్‌కు సంబంధించిన లెక్కలు ప్రచురించలేదని, దీనికి ఎంపీడీవో రాంప్రసాద్ సమాధానం ఇవ్వాలని లక్సెట్టిపేట రెండో వార్డు ఎంపీటీసీ షాహెద్ అలీ నిలదీశారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ మండలంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులను ఆదేశిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో జెడ్పీటీసీ చుంచు చిన్నయ్య, తహశీల్దార్ ఆనంద్‌బాబు, ఎంపీడీవో రాంప్రసాద్, డీసీఎంఎస్ చెర్మైన్ శ్రీనివాస రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆలస్యంగా సమావేశం సమావేశం చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా సాయంత్రం నాలుగింటికి ప్రారంభించి 5.30ముగించారు. జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి పట్టణంలోని పాఠశాల భవనం ప్రారంబోత్సవానికి వస్తున్నారని తెలిసి అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఒకే రోజు అన్ని కార్యక్రమాలు ఉండడంతో ప్రజాప్రతినిధులకు అధికారులకు చాలా ఇబ్బందికరంగా మారింది.మండల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసే సమావేశంలో 25 అంశాలపై చర్చించాల్సి ఉండగా కొన్నింటిపైనే చర్చించి తూతూ మంత్రంగా ముగించారు. ఇందులో మైక్ సెట్ మొరాయించడంతో మాట్లాడేది వినపడక అధికారులు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులకు గురయ్యారు. -
మాట నిలబెట్టుకుంటాం
నేరడిగొండ/ఇచ్చోడ : రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని, రుణమాఫీ చేస్తామని, ఈ విషయంలో ఆందోళన చెందవద్దని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఎంపీ గోడం నగేష్, జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావులతో కలిసి నేరడిగొండ, ఇచ్చోడ మండలాల్లో పర్యటించారు. నేరడిగొండ మండలం లఖంపూర్ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో రూ.42లక్షలతో నిర్మించిన అదనపు గదులు, మండల కేంద్రంలో రూ.25లక్షలతో నిర్మించిన స్త్రీనిధి భవనం, వాంకిడిలో రూ.18లక్షలతో నిర్మించిన పశువైద్యశాల భవనం, కోర్టికల్-కె ఆశ్రమ పాఠశాలలో రూ.కోటి 9లక్షలతో నిర్మించిన అదనపు గదులను ప్రారంభించారు. ఇచ్చోడ మండలం మేడిగూడ ఆశ్రమ పాఠశాలలో రూ.16.87లక్షలతో అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇచ్చోడలో ఐటీడీఏ ఇంజినీరింగ్ కార్యాలయ ఆవరణలో రూ.15లక్షలతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో మంత్రి రామన్న మాట్లాడుతూ రైతులకు రుణాలు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు వివిధ పథకాల ద్వారా అందజేస్తామని చెప్పారు. తాగునీరు, విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. దీపావళి నుంచి పింఛన్ డబ్బులు పెంచుతామని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి త్వరలో నోటిఫికేషన్లు వెలువడనున్నాయని తెలిపారు. పిల్లలను తప్పకుండా చదివించాలని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మథుర కులస్తులను ఎస్టీల్లో చేరుస్తామని తెలిపారు. ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని చెప్పారు. గిరిజనులు కష్టపడి చదువుకోవాలని సూచించారు. బంగారు తెలంగాణకు అందరూ సహకరించాలని కోరారు. జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణా ప్రాంతంలో కేజీ నుంచి పీజీ వరకు నిర్బంధ విద్య అమలు కానుందని తెలిపారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అక్కడే చదువుకోవాలనే తపనతో ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ప్రత్యేక పథకాలను ప్రభుత్వం రూపొందిస్తోందని చెప్పారు. ఇచ్చోడ మండలంలోని 15 మజీద్‌లకు తెలంగాణ మైనార్టీ అభివృద్ధి శాఖ తరఫున మజీద్ కమిటీ సభ్యులకు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులు పంపీణీ చేశారు. ఒక్కో మజీద్‌కు రూ.20వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు సయ్యద్ యాస్మిన్, రేణుక, ఎంపీపీలు బర్దావల్ సునీత, అమీనాబీ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మెడికో దుర్మరణం
ఓ మెడికల్ విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయూలు ఆగి ఉన్న లారీని కారుఢీకొనడంతో ప్రమాదం మరో ఇద్దరికి స్వల్ప గాయాలు బాధితులంతా వైద్య విద్యార్థులే మడికొండ/ఎంజీఎం, న్యూస్‌లైన్ : సరదాగా ఐదుగురు మెడికల్ విద్యార్థులు కలిసి విహారానికి బయల్దేరగా వారి ప్రయూణం విషాదంతమైంది. ఆగి ఉన్న లారీని ఢీకొని ఓ మెడికల్ విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన వరంగల్ నగర శివారు మడికొండ పెట్రోల్‌పంప్ వద్ద సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు, క్షతగాత్రుల కథనం ప్రకారం... వరంగల్ కాశిబుగ్గకు చెందిన వైద్యులు డాక్టర్ టి.భాస్కర్, శోభారాణి దంపతుల కుమార్తె చైతన్యశ్రీ(24), ఎంజీఎం యూరాలజిస్టు డాక్టర్ సురేందర్ కుమార్తె పూజిత, జనగామ వ్యాపారవేత్త నర్సింహారెడ్డి కుమార్తె సుష్మ, దుబాయ్‌కి చెందిన నజియా కరీంనగర్ జిల్లా ప్రతిమ మెడికల్ కళాశాలలో హౌస్‌సర్జన్ నాలుగో సంవత్సరం పూర్తి చేశారు. వీరంతా ఆదివారం వరంగల్ కేఎంసీ, నిట్‌లో నిర్వహించిన మెడికల్ పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌కు హాజరయ్యారు. సోమవారం సాయంత్రం అంతా కలిసి హన్మకొండ హంటర్‌రోడ్డులోని వనవిజ్ఞాన కేంద్రం(జూ పార్కు)కు వెళ్లారు. అరుుతే జూ పార్క్ మూసి ఉండడంతో హైదరాబాద్‌కు వెళ్దామని బయల్దేరారు. కారు మడికొండలోని పెట్రోల్‌పంప్ సమీపంలోకి రాగానే డ్రైవింగ్ చేస్తున్న చైతన్యశ్రీ తమ్ముడు ఉదయ్‌రాజ్ షూ క్లచ్, గేర్ మధ్య ఇరుక్కుంది. దీంతో కాలిని పైకి తీసే క్రమంలో కారు అదుపుతప్పి అక్కడే ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో చైతన్యశ్రీ అక్కడి కక్కడే కారులో మృతిచెందగా పూజిత, నజియా తీవ్రంగా గాయపడి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. మృతురాలు చైతన్యశ్రీ ఎడమ చేయి పూర్తిగా తెగి దూరంగా పడిపోయింది. మడికొండ సీఐ నందిరాంనాయక్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో, ప్రైవేట్ వాహనంలో ఆస్పత్రికి పంపించారు. ప్రమాద స్థలాన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. దీంతో ట్రాఫిక్‌కు అంత రాయం ఏర్పడడంలో పోలీసులు వన్‌వేలో వాహనాలను పంపించారు. స్వల్పగాయాలైన సుష్మ, హృదయ్‌రాజ్ నుంచి సీఐ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమచారమిచ్చారు. అతివేగమే ప్రమాదానికి కారణమా.. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన వాహనం వెనుకాలే వస్తున్న వాహనదారులు ఒక్కసారిగా ఆగిపోయారు. ప్రమాద సమయంలో కారు వేగం 120 స్పీడ్‌తో ఉన్నట్లు తెలుస్తోందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉదయ్‌రాజ్ కాకతీయ మెడికల్ కళాశాలలో(కేఎంసీ)లో సెకండయరీ చేస్తున్నాడు. బాధితులను డీఎంహెచ్ఓ సాంబశివరావు, ఎంజీఎం సూపరింటెండెంట్, ఆర్ఎంఓ నాగేశ్వర్రావు, ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌తోపాటు పెద్దఎత్తున వైద్యులు తరలివచ్చి పరామర్శించారు. -
జై బోలో సమైక్యాంధ్ర
‘‘రాష్ర్టం ఐక్యంగా ఉంటే ఎంత అభివృద్ధి చెందుతుంది, విడిపోతే ఎలాంటి కష్టాలుంటాయనే అంశంతో రూపొందుతున్న చిత్రం ఇది. సినిమా ద్వారా కోట్లాది మందిని ప్రభావితం చేయొచ్చు. అందుకే ఈ సినిమాలో నటించడానికి అంగీకరించాను. సమైక్యవాదానికి ఊతమిచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది. తెలంగాణవాదులను కించపరిచే సన్నివేశాలుండవు’’ అన్నారు శోభారాణి. మహా మూవీ మేకర్స్ పతాకంపై లక్ష్మణ్ పూడి దర్శకత్వంలో పి. వెంకటరావు నిర్మించనున్న చిత్రం ‘జై బోలో సమైక్యాంధ్ర’. శోభారాణి, కవిత ముఖ్య తారలు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఇందులో ఓ సంచలన కథానాయకుడు కీలక పాత్ర చేయనున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమకారులు ముఖ్య పాత్రలు చేస్తారు. ప్రజా కళాకారులతో పాటలు రాయించి, ప్రజా గాయకుల చేత పాడించనున్నాం’’ అని చెప్పారు. అక్టోబర్ 2న షూటింగ్ ప్రారంభించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న సినిమాని విడుదల చేస్తామని పి.వెంకటరావు తెలిపారు. ఈ సమావేశంలో గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: రామాన శివకుమార్, కారి గోవిందరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఏ.యు. మహేష్‌రెడ్డి. -
‘మెరీనా’చిత్రం మనసుంటే నచ్చుతుంది
‘‘ఈ చిత్రంలో భారీ పోరాటాలు ఉండవు. చాలా చిన్న సినిమా. కానీ విడుదలైన తర్వాత పెద్ద సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు శోభారాణి. దశావతారం, సూర్య సన్నాఫ్ కృష్ణన్, తుపాకీ తదితర చిత్రాలను విడుదల చేసిన శోభారాణి తాజాగా తమిళ చిత్రం ‘మెరీనా’ని అదే పేరుతో తెలుగులోకి అందిస్తున్నారు. 15న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ - ‘‘తమిళంలో చిన్న చిత్రంగా విడుదలై ఘనవిజయం సాధించింది. మెరీనా బీచ్‌లో తినుబండారాలు అమ్ముకునే పిల్లలు, పెద్దల జీవితం ఆధారంగా దర్శకుడు పాండిరాజ్ ఈ సినిమా తీశారు. వారి జీవితం తాలూకు ఒడిదుడుకులతో పాటు ఓ ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ప్రతి ఒక్కరికీ చదువు ముఖ్యం అని అంతర్లీనంగా సందేశం కూడా ఉంది. స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ సినిమా ఇది. మంచి కథ, ఆహ్లాదకరమైన పాటలతో సాగే ఈ చిత్రం మనసున్న ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు.