లక్సెట్టిపేట : అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి చేస్తానని జెడ్పీ చైర్‌పర్సన్ శోభారాణి అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయని, అన్నింటిపై దృష్టిసారించి అభివృద్ధి చేస్తానని తెలిపారు. వెనకబడిన జిల్లాగా కాకుండా అన్ని విధాలా సౌకర్యాలు కల్పిస్తానని చెప్పారు. అనంతరం ఆమెను ఎంపీటీసీ సభ్యులు శాలువాలతో సన్మానించారు.
సమస్యలపై అధికారుల నిలదీత
తలమలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎంపీ పీ కట్ల చంద్రయ్య కోరగా, విద్యుత్ శాఖ అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. విద్యుత్ సరిగా ఉండడం లేదని, రాత్రిళ్లు విఫరీతంగా కోత విధిస్తున్నారని పేర్కొన్నారు. పలు చోట్ల షాక్ వసుందని తిమ్మాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు గడుసు స్వప్న, ఊత్కూరు సర్పంచ్ రాజలింగయ్య అధికారుల దృష్టికి తెచ్చారు.
బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని కోరారు. అలాగే మీ సేవ సర్టిఫికెట్లకు అధికారులు డబ్బులు తీసుకుంటున్నారని, డబ్బులు ఇవ్వనిదే తహశీల్దార్ కార్యాలయంలో ఏపని కావడం లేదని కొత్తూరు సర్పంచ్ గుండ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. దీంతో ఎమ్మెల్యే దివాకర్‌రావు కల్పించుకొని తహశీల్దార్ ఆనంద్‌బాబును వివరణ కోరారు. కార్యాలయ సిబ్బంది అవినీతికి పాల్పడకుండా ప్రజలకు సేవలు అందించాలని ఆదేశించారు. సమావేశం ఎజెండాలో జనరల్ ఫండ్‌కు సంబంధించిన లెక్కలు ప్రచురించలేదని, దీనికి ఎంపీడీవో రాంప్రసాద్ సమాధానం ఇవ్వాలని లక్సెట్టిపేట రెండో వార్డు ఎంపీటీసీ షాహెద్ అలీ నిలదీశారు.
ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ మండలంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులను ఆదేశిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో జెడ్పీటీసీ చుంచు చిన్నయ్య, తహశీల్దార్ ఆనంద్‌బాబు, ఎంపీడీవో రాంప్రసాద్, డీసీఎంఎస్ చెర్మైన్ శ్రీనివాస రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆలస్యంగా సమావేశం
సమావేశం చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా సాయంత్రం నాలుగింటికి ప్రారంభించి 5.30ముగించారు. జెడ్పీ చైర్‌పర్సన్ శోభారాణి పట్టణంలోని పాఠశాల భవనం ప్రారంబోత్సవానికి వస్తున్నారని తెలిసి అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఒకే రోజు అన్ని కార్యక్రమాలు ఉండడంతో ప్రజాప్రతినిధులకు అధికారులకు చాలా ఇబ్బందికరంగా మారింది.మండల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసే సమావేశంలో 25 అంశాలపై చర్చించాల్సి ఉండగా కొన్నింటిపైనే చర్చించి తూతూ మంత్రంగా ముగించారు. ఇందులో మైక్ సెట్ మొరాయించడంతో మాట్లాడేది వినపడక అధికారులు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులకు గురయ్యారు.
అందరి సహకారంతో అభివృద్ధి
Published Sun, Sep 21 2014 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM
Advertisement
Advertisement