ఆదిలాబాద్ క్రైం : సాక్షాత్తు అటవీ శాఖ మంత్రి సొంత జిల్లా.. సొంత శాఖ అయిన అటవీశాఖలో బోగస్ నియామకాలు కలకలం సృష్టించాయి. గిరిజన యువకుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. బోగస్ నియామక ఉత్తర్వులు సృష్టించి.. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.6 లక్షలు వసూలు చేసిన వైనం బహిర్గతమైంది.
ఆదిలాబాద్ డీఎఫ్‌వో సర్కిల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్ దీనంతటికి సూత్రధారి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీశాఖలో ఉద్యోగాల భర్తీ కోసం 2012లో నోటిఫికేషన్ వెలువడింది. 23 బీట్ ఆఫీసర్, 10 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పోస్టులను ఎస్టీలకు రిజర్వ్ చేశారు. దీంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేశారు. పోస్టులకు ఎంపికైన 33 మంది అభ్యర్థుల్లో కొందరికి బోగస్ పత్రాలు ఉన్నట్లు తేలింది. అయితే.. తమ ధ్రువీకరణ పత్రాలు సరైనవేనని, తాము ఉద్యోగాలకు అర్హులమేనని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నియామక ప్రక్రియను నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
చక్రం తిప్పిన సీనియర్ అసిస్టెంట్..
అటవీశాఖలో బోగస్ నియామకాలు సృష్టించి.. అభ్యర్థుల నుంచి డబ్బులు వసూళ్లు చేయడంలో డీఎఫ్‌వో కార్యాలయంలో పనిచేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్ చక్రం తిప్పారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో సొంత శాఖ అధికారుల చేతివాటం ఉన్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. గతంలో అటవీశాఖ కార్యాలయంలో పనిచేసిన టెక్నికల్ అసిస్టెంట్‌ను తోడుగా చేసుకుని పక్క ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. అటవీశాఖ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలను తెలుసుకుని లాబీయింగ్ చేశారు. రెండేళ్ల నుంచి అభ్యర్థులకు అందుబాటులో ఉంటూ వచ్చారు.
ఓ రోజు హైకోర్టులో విచారణ పూర్తైదని.. ఉద్యోగాలకు మీరు ఎంపికయ్యారంటూ వారికి సమాచారం అందించారు. అటవీ కార్యాలయంలోని 08732-226984 ల్యాండ్ ఫోన్ నుంచి ఈ తతంగం నడిపించారు. అభ్యర్థులు నమ్మేలా బోగస్ ఉత్తర్వులును సృష్టించారు. ఏకంగా ఇంటర్వ్యూలు నిర్వహించి నెల రోజుల క్రితం నియామక పత్రాలు ఇచ్చి పోస్టింగ్ ఇచ్చిన ప్రాంతాల్లో వెళ్లి యూనిఫాం తీసుకోవాలని, ఉద్యోగంలో చేరాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో అభ్యర్థులు బోగస్ నియామక పత్రాలతో ఆయా అటవీశాఖ డివిజన్ కార్యాలయాలకు వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. తాము బోగస్ ఉత్తర్వులతో నియామకమయ్యామని, డబ్బులు ఇచ్చి మోసపోయినట్లు గుర్తించిన కొంత మంది బాధితులు సోమవారం అడిషనల్ ఎస్పీ పనసారెడ్డిని, మంగళవారం ఎస్పీ తరుణ్‌జోషిని కలిశారు.
గుట్టుచప్పుడు కాకుండా ఇంటర్వ్యూలు..
గత సెప్టెంబర్ 29న అభ్యర్థులకు జిల్లా కేంద్రంలోని అటవీశాఖ రేంజ్ కార్యాలయంలో గుట్టుచప్పుడు కాకుండా ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ముందు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు మాత్రమే ఇంటర్వ్యూలు కొనసాగించారు. అయితే.. ఇంటర్వ్యూలు నిర్వహించిన వారిలో తమ ప్రమేయం లేదని రేంజ్ అధికారి నాగేశ్వర్‌రావు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఉదయం అధికారుల రాక ముందు.. మధ్యాహ్నం భోజన విరామ సమయంలోనే ఇంటర్వ్యూలు నిర్వహించారని తెలిపారు.
ఆ సమయంలో ఎవరెవరు కార్యాలయానికి వచ్చారో విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ అసిస్టెంట్‌ను రేంజ్ ఆఫీస్‌కు పిలిపించారు. బాధితుల ఎదుట ఆయన్ను ప్రవేశపెట్టగా గుర్తించిన బాధితులు తమ వద్ద డబ్బులు తీసుకున్న వ్యక్తి ఇతనేనంటూ రేంజ్ అధికారులకు, డీఎఫ్‌వో సర్కిల్ కార్యాలయ అధికారులకు చూపించారు. పూర్తిస్థాయిలో ఆధారాలు సైతం చూపించారు. కాగా.. తనకు వారెవరో తెలియదంటూ సదరు సీనియర్ అసిస్టెంట్ విషయాన్ని దాటవేశారు. తాను డబ్బులు ఎవరి వద్దా తీసుకోలేదని వాపోయాడు. సీనియర్ అసిస్టెంతోపాటు టెక్నికల్ అసిస్టెంట్ ఇందులో ప్రమేయం ఉందని బాధితులు చెప్పారు. టెక్నికల్ అసిస్టెంట్‌ను విచారించిన తర్వాతే నిందితులను గుర్తించి పోలీసులకు అప్పగిస్తామని రేంజ్ అధికారులు పేర్కొన్నారు.
బాధితుల రోదన..
తమను మోసం చేసి డబ్బులు తీసుకున్న వ్యక్తి బాధితుల ముందరికి రాగానే వారు కన్నీళ్లు కార్చారు. ఎన్నో అప్పులు చేసి డబ్బులు తెచ్చిస్తే తమను మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమిలో ఉద్యోగం కోసం వచ్చిన అవకాశాన్ని సైతం వదులోకోమని ప్రలోభపెట్టాడంటూ ఓ అభ్యర్థి రోదించిన తీరు అందరినీ కలిసివేసింది. తమకు న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకున్నారు.
అటవీశాఖలో బోగస్ నియామకాలు
Published Fri, Nov 21 2014 2:44 AM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM
Advertisement
Advertisement