విజేతలూ! సమస్యలతోరణానికి సన్నద్ధం కండి! | definitely we fulfill the guarantees | Sakshi
Sakshi News home page

విజేతలూ! సమస్యలతోరణానికి సన్నద్ధం కండి!

Published Sun, May 18 2014 11:58 PM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM

విజేతలూ! సమస్యలతోరణానికి సన్నద్ధం కండి!

విజేతలూ! సమస్యలతోరణానికి సన్నద్ధం కండి!

 పక్క చిత్రం చూడండి. ఇది గొల్లప్రోలు నగర పంచాయతీలోని ఈబీసీ కాలనీ. సుద్దగెడ్డ పొంగిందంటే చాలు..
 ఇక్కడి ప్రజలు బితుకుబితుకుమంటూ కాలం గడుపుతూ ఉంటారు. కారణం.. ఆ వరద నీరంతా వచ్చి, ఇక్కడి జనావాసాల్ని ముంచెత్తుతూంటుంది. ఆ కాలంలో ఇక్కడివారికి కంటిమీద కునుకు కరువవుతుంది. ఈ సమస్య పరిష్కారానికి ఎంతోమంది నేతలు హామీ ఇచ్చారు. అది నెరవేరలేదు. కొత్త ఎమ్మెల్యే అయినా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.
 
 ప్రజాప్రాతినిధ్యానికి సిసలైన నిర్వచనం అధికారం కాదు.. బాధ్యత మాత్రమే. పంచాయతీ వార్డు సభ్యులైనా, శాసనసభ్యులైనా.. తమను ఎన్నుకున్న జన సమూహపు ఆకాంక్షల పరిపూర్తికి మనసావాచాకర్మణా అంకితమైనప్పుడే.. వారి పదవికి సార్థకత చేకూరుతుంది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలకు చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తుది ఎన్నికలూ అవే! కొత్త రాష్ట్రంలో తొలి ఎన్నికలూ అవే! ఇప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ కొత్త రాష్ట్రపు తొలి శాసనసభలో ప్రాతినిధ్యం పొందిన వారుగా చరిత్ర పుటల్లో నమోదు కానున్నారు.
 
మరి.. వారు తమను ఎన్నుకున్న ప్రజల మనోఫలకాలపై నిలిచిపోవాలంటే? వారు ఏమి కోరి తమను గెలిపించారో.. వాటిని నెరవేర్చడమొక్కటే మార్గం. వారి పదవీ కాలం అర్ధ దశాబ్దమే కావచ్చు. కానీ, దశాబ్దాలుగా తమ నియోజకవర్గాల్లో తిష్ట వేసిన సమస్యల పరిష్కారాన్ని సైతం భుజాలకు ఎత్తుకోక తప్పదు. సదా, సర్వదా జనపక్షం వహించే ‘సాక్షి’- జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను కొత్త ప్రజాప్రతినిధుల దృష్టికి తెస్తోంది. వారు వాటిని పరిష్కరించి, ఎన్నుకున్న వారి మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తోంది.             
 
రాజమండ్రి సిటీ

ఉభయ గోదావరి జిల్లాలకు రాజమండ్రియే వ్యాపార కూడలి కావడంతో, నిత్యం లక్షలాది మంది నగరానికి రాకపోకలు సాగిస్తున్నారు. వేలాది వాహనాలు నగరంలో తిరుగుతున్నాయి. 2003 పుష్కరాల సందర్భంగా అప్పటి ట్రాఫిక్‌కు తగ్గట్టు రోడ్లు వెడల్పు చేశారు. ఆతర్వాత విస్తరణ కు నోచుకోలేదు. గోకవరం బస్టాండ్, మెయిన్ రోడ్డు, శ్యామలా సెంటర్, కోటిపల్లి బస్టాండ్, కంబాల చెరువు, దేవీచౌక్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తోంది.
 
గోదావరి చెంతనే ఉన్నా శివారు ప్రాంతాలన్నింటికీ ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నారు. అది కూడా అరకొరే. నగరంలో రోజుకు కోటీ 25 లక్షల గ్యాలన్ల నీరు సరఫరా చేస్తున్నారు. ధవళేశ్వరం, గోదావరి గట్టున ఉన్న హెడ్ వాటర్ వర్క్స్ నుంచి నగరానికి నీటి సరఫరా చేస్తున్నారు. వీటికి తోడుగా మరిన్ని మంచినీటి ప్రాజెక్టులు నిర్మించాలి.
 
నగరంలోని చాలా ప్రాంతాల్లో డ్రైనేజీలు శిథిలమై మురుగునీరు రోడ్లపై నుంచి పారుతోంది. అలాగే రోడ్లు కూడా సక్రమంగా లేవు.
 
వీధిలైట్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. వీటి నిర్వహణను ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ప్రధాన రహదారుల్లో తప్పితే మారుమూల ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగడం లేదు.   
                         - న్యూస్‌లైన్, రాజమండ్రి కార్పొరేషన్
 
 రంపచోడవరం

అడ్డతీగల మండలం పింజరకొండ, పనుకరాతిపాలెం, ఉప్పలపాడు, మట్టపాడు, గడి చిన్నంపాలెం వంటి గ్రామాల్లో వర్షాకాలంలో కొండవాగులు ఉప్పొంగి ప్రవహిస్తాయి. వంతెనలు లేకపోవడంతో గిరిజనులు తీగలు, ట్యూబులతో వాగులు దాటుతున్నారు. వై.రామవరం మండలం బురదకోట, రాములకొండ గ్రామాల్లో కూడా వంతెనలు లేక దాదాపు 25 గ్రామాల ప్రజలకు వర్షాకాలంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండడంలేదు. రాజవొమ్మంగి, మారేడుమిల్లి మండలాల్లో కూడా ఇదే పరిస్థితి. కొండవాగులపై వంతెనల నిర్మాణానికి ఐటీడీఏ ఇప్పటికీ ఎటువంటి ప్రణాళికా రూపొందించలేదు. ఐటీడీఏకు కోట్ల రూపాయల నిధులు వస్తున్నా కేవలం భవన నిర్మాణాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
 
ఏజెన్సీలో పూర్తి స్థాయిలో రహదారి సౌకర్యం లేదు.  అటవీ శాఖ అభ్యంతరాలతో దాదాపు 100 రోడ్ల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. మారేడుమిల్లి మండలం వేటుకూరు - తాడేపల్లి రోడ్డు నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయి దశాబ్దం గడుస్తున్నా నేటికీ అటవీ శాఖ అభ్యంతరాలు తొలగలేదు.
రంపచోడవరం డివిజన్‌లో దాదాపు మూడు వేల ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. మారేడుమిల్లి, వై.రామవరం మండలాల్లోని చాలా గ్రామాల్లో గిరిజనులకు కొత్త కాలనీలు మంజూరు చేయాల్సి ఉంది.
                                     - న్యూస్‌లైన్, రంపచోడవరం
 
 కొత్తపేట
 
 పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ  చేయాలి. స్థలాలు పొందిన వారికి ఇళ్లు మంజూరు చేయాలి.
 జొన్నాడ-మండపేట, వెదురుమూడి- కలవచర్ల రోడ్ల ఆధునికీకరణ చేపట్టాలి. మూలస్థానం అగ్రహారం, వాడపాలెం-నారాయణలంకమధ్య, వానపల్లి-నక్కవారిపేట వద్ద వంతెనల నిర్మాణం చేపట్టాలి.
 ఏటిగట్ల, ఉచ్చిలి-పేరవరం ఎత్తిపోతల పథకాల, లొల్ల లాకుల ఆధునికీకరణ చేపట్టాలి.        - న్యూస్‌లైన్, కొత్తపేట
 
కాకినాడ రూరల్

తీరప్రాంత గ్రామాల్లో తీవ్రమైన  తాగునీటి ఎద్దడి నెలకొంది.
కాలువ శివారు భూములను సాగునీటి సమస్య పట్టిపీడిస్తోంది.  
మురుగు కాలువలను ఆధునికీకరించాలి.
ఇంద్రపాలెం- జి.మామిడాడ వంతెన నిర్మాణం చేపట్టాలి. సామర్లకోట-ఇంద్రపాలెం ప్రధాన పంటకాలువపై  పక్కా వంతెన, తమ్మవరం- పోలవరంల మధ్య పంటకాలువ పై వంతెన నిర్మించాలి. గురజనాపల్లి రోడ్డులో ఉప్పుటేరుపై, పెదకొత్తూరు వద్ద తుల్యభాగ డ్రైనుపైన,  వేములవాడ వద్ద శిథిలమైన వంతెనల స్థానంలో కొత్తవి నిర్మించాలి. కొంగోడు, రేపూరు, చీడిగ, శహపురం ఉప్పుటేర్లపై వంతెనలు నిర్మించాలి.
 పి.వెంకటాపురం పంపింగ్‌స్కీమ్ పనులు పూర్తి చేయాలి. గ్రామాల్లో ఓవర్‌హెడ్‌ట్యాంకులను వినియోగంలోకి తీసుకురావాలి.
 మత్స్యకారులకు పక్కా ఇళ్లు నిర్మించాలి.
 పండూరు, కరప ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను ముప్పై పడకల ఆస్పత్రులుగా రూపొం దించాలి.   కరప పీహెచ్‌సీకి పక్కా భవనాలు నిర్మించాలి.
  -న్యూస్‌లైన్, కాకినాడ రూరల్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement