![Deepa Das Munshi Warns Congress Mlas](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/deep-das-munshi1.jpg.webp?itok=5xBadj6W)
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సీరియస్ అయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఐదున్నర గంటల పాటు జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని కులగణన, ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో చేసినా, అనుకున్న స్థాయిలో ప్రచారం చేయడం లేదన్న మున్షీ.. పార్టీ అంతర్గత విషయాలు బహిరంగ వేదికలపై మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
సీఎల్పీ సమావేశం అనంతరం కూడా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సమస్య ఉంటే నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాలని.. ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యేలకు, కార్యకర్తల మధ్య గ్యాప్ ఉందంటూ మున్షీ వ్యాఖ్యానించారు. పార్టీ లైన్ దాటుతున్న నేతలపై సీరియస్‌గా ఉండాలని సీఎల్పీ సమావేశం నిర్ణయించింది.
ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం
బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించిన సీఎల్పీ.. రెండు భారీ సభలు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. సభలకు రాహుల్, ఖర్గే ఆహ్వానించాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని.. అత్యధిక గ్రామాలను ఏకగ్రీవం చేసే బాధ్యతతో పాటు బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల పదవులను కేటాయించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని రేవంత్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు!
ఫిబ్రవరిలో రెండు భారీ బహిరంగ సభలు: టీపీసీసీ చీఫ్
సీఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, బడ్జెట్ అంశాలపై ప్రధానంగా చర్చించామని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై చర్చించామని.. సమావేశంలో ఎమ్మెల్యేలు కూడా వారి అభిప్రాయాలు చెప్పారన్నారు. ఫిబ్రవరిలో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని మహేష్‌కుమార్ గౌడ్ వెల్లడించారు.
మల్లన్న విషయంలో వారిదే నిర్ణయం: కోమటిరెడ్డి
బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని జనాల్లోకి తీసుకువెళ్లాలని సీఎం చెప్పారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ తెలంగాణలో లేదు. బీజేపీ స్టేట్‌మెంట్‌లకు మాత్రమే పరిమితం అయ్యింది. వచ్చే 5 ఏండ్లు కూడా మళ్లీ మేము అధికారంలో ఉంటాం. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు జనాలకు అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. మా ఎమ్మెల్యేలు కూర్చొని భోజనం చేస్తే తప్పా.. మంత్రులం మేము కూడా కలిసి భోజనం చేస్తాము. ప్రతిపక్షాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మల్లన్న విషయంలో ఏఐసీసీ, టీపీసీసీ చీఫ్ నిర్ణయం తీసుకుంటారు. ఒక కులంపై అసభ్య పదజాలంతో మల్లన్న చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా’’ అని కోమటిరెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment