
సాక్షి,విజయవాడ: పోలీసుల (Andhra Pradesh Police) నుంచి తనకు ప్రాణ హాని ఉందని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ‘నాకు శ్వాసకోశ ఇబ్బంది ఉందని చెబుతున్నా పోలీసులు నా పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. అరెస్ట్ విషయంలో పూర్తిగా సహకరించినా నన్ను ఇబ్బందులకు గురి చేశారు. నాకు వైద్య సహాయం అందకుండా పోలీసులు ప్రతీక్షణం అడ్డుకున్నారు. అరెస్ట్ నుంచి కోర్టుకు తరలించే వరకు పోలీసులు నా పట్ల అనుచితంగా ప్రవర్తించారు’అంటూ న్యాయమూర్తికి స్టేట్‌మెంట్ ఇచ్చారు. కాగా, విజయవాడ (Vijayawada) జైల్లో ఉంటే వంశీ ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతకుముందు, వల్లభనేని వంశీ పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన సతీమణి పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. నా భర్తను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ కేసులో అరెస్ట్ చేశారో ఇప్పటికీ చెప్పలేదని వాపోయారు.
గురువారం రాత్రి 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ ఇస్తూ 4th ACMM కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా విజయవాడ సబ్ జైల్‌కి పోలీసులు వంశీని తరలించారు. వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో వంశీ అరెస్ట్‌పై ఆయన సతీమణి పంకజశ్రీ స్పందించారు.
‘నా భర్త అరెస్టుపై న్యాయపోరాటం చేస్తా. అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉంది. వంశీకి ఆరోగ్యం బాగాలేదు. నేనే టాబ్లెట్స్ ఇచ్చాను. ఉదయం నుండి కనీసం కాఫీ కూడా తాగలేదు. ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ కేసులో అరెస్ట్ చేశారో ఇప్పటికీ చెప్పలేదు. ఎక్కడికి తీసుకు వెళుతున్నారో కూడా కనీస సమాచారం ఇవ్వలేదు. హైకోర్టుకి కచ్చితంగా వెళ్తాం. న్యాయపరంగానే ఎదుర్కొంటాం’ అని వ్యాఖ్యానించారు.
