అమ్మో పులి!
అడవిని వదిలి జనావాసాల్లోకి వస్తున్న వన్యప్రాణులు
వారం రోజులుగా అటవీ సమీప నివాస ప్రాంతాల్లో సంచారం
బర్డ్, రుయా సమీపంలో ఓ దూడ, కుక్కపై చిరుత దాడి
ప్రేక్షక పాత్రలో అటవీ శాఖ అధికారులు
తిరుపతి కార్పొరే షన్/మంగళం: అభయారణ్యంలో సంచరించాల్సిన క్రూర మృగాలు యథేచ్ఛగా జనావాసాల్లోకి వస్తున్నాయి. ఎర్రచందనం అన్వేషణ, వన్య మృగాల వేట, నీరు లభించకపోవడంతో ఇవి జనావాసాల వైపు వస్తున్నా యి. రెండు రోజులుగా తిరుపతి రుయా, బర్డ్, స్విమ్స్ ఆసుపత్రులతో పాటు సమీపంలోని భారతీయ విద్యాభవన్, ఎస్వీబీసీ శ్రీవారి నమూనా ఆలయం, వేదిక్, ఎస్వీయూ, ఎన్‌సీసీ నగర్, రీజనల్ సైన్స్ సెం టర్‌లో పులు సంచరిస్తున్నాయి.
అటవీ అధికారులకు సవాల్ విసురుతూ, సమీప జనావాసాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రుయా, బర్డ్ ఆసుపత్రి సమీపంలోని ఓ ప్రహరీ గోడపైకి చిరుతపులి ఓ కుక్కను, మరో లేగ దూడను తీసుకొచ్చి తిన్న సంఘటన గురువారం సంచలనం రేపింది. రుయాలోని ఐడీహెచ్ వార్డు విసిరేసినట్టు దూరంగా ఉండటం, చుట్టూ దట్టమైన చెట్లు, పొదలు ఉండడంతో వన్య మృగాలకు నిలయంగా మారుతోంది. 15 రోజుల క్రితం వేదిక్ వ ర్సిటీ, ఎన్‌సీసీ నగర్ వద్ద చిరుత జింకపై దాడి చేయడం, శ్రీవారిమెట్టు, మామండూరు సమీప గ్రామాల్లో సంచరించడం వంటి అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఎప్పుడు పులి వచ్చి దాడి చేస్తుందోనని జనం భయపడుతున్నారు.
రాత్రి స్మగ్లర్లు.. పగలు పోలీసులు..
అశేష వన్యమృగాలకు నిలయమైన శేషాచల అడవిలోకి ఎర్రచందనం కోసం స్మగ్లర్లు అడుగులు వేస్తున్నారు. రాత్రిపూట వృక్షాలను యథేచ్ఛగా నరికేస్తున్నారు. ఆ చప్పుడు కారణంగా వన్యమృగాల ప్రశాంతతకు భంగం కలుగుతోంది. రాత్రిల్లో ఆహార అన్వేషణలో భాగంగా సమీపంలోని జనావాసాల్లోకి వస్తున్నాయి. రాత్రిళ్లు స్మగ్లర్ల బెడదైతే పగలు పోలీసుల అలజడి వన్యమృగాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పగటిపూట స్మగ్లర్ల కోసం కూంబింగ్ చేస్తున్న పోలీసులు మారణాయుధాలతో అడవిని జల్లెడ పడుతున్నారు. ఈ ప్రభావం వన్యమృగాలపై పడుతోంది. ఆహారం కోసం కాకుండా తమ ఉనికి కోసం అడవిని ఖాళీ చేస్తున్నాయి. జనావాసాల్లోకి వస్తున్నాయి.
వేట కూడా కారణమే...
శేషాచల అడవుల్లోని వన్యప్రాణులు ఆహార అన్వేషణలో భాగంగా నీటి కోసం భాకరాపేట, ఎర్రావారి పాళెం, కళ్యా ణి డ్యాంల వద్దకు వస్తున్నాయి. నాటుతుపాకులు, విల్లంబులు, బరిసెలతో వేటగాళ్లు దాడి చేస్తుండడంతో వన్యమృగాలు అలజడికి గురవుతున్నాయి. వేటగాళ్ల దాడులకు భయపడి అటవీ సమీప గ్రామాల వైపు వెళ్తున్నాయి. అదే క్రమంలో కుక్కలు, ఆవులు, దూడలపై దాడి చేస్తున్నాయి.
నీటి కోసం అన్వేషణ..
వర్షాభావం కారణంగా శేషాచల అడవుల్లో చెరువులు, కుంటలు ఇంకిపోతున్నాయి. దీంతో దాహం తీర్చుకునేందుకు అడవి జంతువులు సుదీర్ఘంగా పయనిస్తున్నాయి. వన్య ప్రాణుల సంరక్షణ కోసం అటవీ ప్రాంతంలో కృత్రిమంగా నీటి కొలనులు ఏర్పాటు చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. అక్కడక్కడా కొలనులు ఉన్నా వాటిలో నీటిని నింపడం లేదు. దీంతో నీటిని అన్వేషిస్తూ జనావాసాల్లోకి వస్తున్నాయి.