జింబాబ్వే మాజీ స్టార్ క్రికెటర్ గై విట్టల్ చిరుత పులి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. విట్టల్ తల, చేతి భాగంపై చిరుత తీవ్రమైన గాయాలు చేసింది. విట్టల్‌ను హుటాహుటిన సమీపంలోని అసుపత్రికి ఎయిర్ లిఫ్ట్ చేశారు. అతనికి మరిన్ని శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం విట్టల్ పరిస్థితి నిలకడగా ఉందని అతని భార్య హన్నా ఫేస్‌బుక్ ద్వారా తెలిపింది.
51 ఏళ్ల గై విట్టల్ కుటుంబంతో కలిసి హ్యూమని అనే అటవీ ప్రాంతంలో సఫారీ వ్యాపారాన్ని నడుపుతున్నాడు. గత మంగళవారం విట్టల్ తన పెంపుడు శునకం చికారాతో కలిసి అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. ఆ సమయంలో చిరుత అమాంతం విట్టల్‌పై దాడికి దిగింది. ఇది గమనించిన చికారా చిరుతతో కలబడింది. చికారా ప్రతిఘటించడంతో చిరుత మెత్తబడి పారిపోయింది.
చికారా లేకుంటే విట్టల్ ప్రాణాలతో బయటపడేవాడు కాదని అతని భార్య హన్నా తెలిపింది. సఫారీలో విట్టల్‌కు ఇలాంటి అనుభవాలు కొత్తేమీ కాదు. పదేళ్ల క్రితం ఓ భారీ మొసలి తన గేమ్ రిజర్వ్‌లోని బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించి, రాత్రి అక్కడే గడిపింది. ఈ విషయం అప్పట్లో క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉండింది.
గై జేమ్స్ విట్టల్ 1993-2003 మధ్యలో జింబాబ్వే తరఫున 46 టెస్ట్‌లు, 147 వన్డేలు ఆడాడు.టెస్ట్‌ల్లో ఓ డబుల్ సెంచరీ, 3 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీల సాయంతో 2207 పరుగులు చేసిన విట్టల్.. 51 వికెట్లు కూడా పడగొట్టాడు. వన్డేల్లో 11 హాఫ్ సెంచరీల సాయంతో 2705 పరుగులు చేసిన విట్టల్.. 88 వికెట్లు పడగొట్టాడు.
రైట్ ఆర్మ్ మీడియం పేస్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన విట్టల్.. 21వ శతాబ్దం ఆరంభంలో ఫ్లవర్, స్ట్రాంగ్ బ్రదర్స్, హీత్ స్ట్రీక్‌లతో కలిసి జింబాబ్వే క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగాడు. గై విట్టల్ కజిన్ ఆండీ విట్టల్ కూడా అదే సమయంలో జింబాబ్వేకు ప్రాతినిథ్యం వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment