![Ireland Beat Zimbabwe By 63 Runs In One Off Test](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/irleand.jpg.webp?itok=egsvgZjv)
జింబాబ్వేతో (Zimbabwe) జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఐర్లాండ్ (Ireland) జట్టు సంచలన విజయం సాధించింది. బులవాయో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్.. ఆతిథ్య జట్టును 63 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకు ఆలౌటైంది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఆండీ మెక్‌బ్రైన్ (90 నాటౌట్), మార్క్ అదైర్ (78) అర్ద సెంచరీలు సాధించి ఐర్లాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 127 పరుగులు జోడించారు.
మెక్‌బ్రైన్, అదైర్‌తో పాటు ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో పాల్ స్టిర్లింగ్ (10), లోర్కాన్ టక్కర్ (33) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. రిచర్డ్ నగరవ 2, ట్రెవర్ గ్వాండు ఓ వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులు చేసింది. అరంగేట్రం ఆటగాడు నిక్ వెల్చ్ (90) 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. 10వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన ముజరబానీ 47 పరుగులు చేసి జింబాబ్వే తరఫున సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అతనికి 11వ నంబర్ ఆటగాడు ట్రెవర్ గ్వాండు (18 నాటౌట్) సహకరించాడు. వీరిద్దరూ ఆఖరి వికెట్‌కు 67 పరుగులు జోడించారు. వీరిద్దరి భాగస్వామ్యం మూలానా జింబాబ్వేకు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెక్‌కార్తీ 4, ఆండీ మెక్‌బ్రైన్ 3, మార్క్ అదైర్ 2, మాథ్యూ హంఫ్రేస్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం బరిలోకి దిగిన ఐర్లాండ్.. ఆండీ బల్బిర్నీ (66), లొర్కాన్ టక్కర్ (58) అర్ద సెంచరీలతో రాణించడంతో రెండో ఇన్నింగ్స్‌లో 298 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో కర్టిస్ క్యాంఫర్ (39), మూర్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ 4, ట్రెవర్ గ్వాండు, మధెవెరె తలో 2, ముజరబానీ, జోనాథన్ క్యాంప్‌బెల్ చెరో వికెట్ పడగొట్టారు.
292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా కుప్పకూలింది. మాథ్యూ హంఫ్రేస్ ఆరు వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాశించాడు. హంఫ్రేస్ 6, మెక్‌కార్తీ 2, మార్క్ అదైర్, ఆండీ మెక్‌బ్రైన్ తలో వికెట్ పడగొట్టడంతో జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 228 పరుగులకు చాపచుట్టేసింది. వెస్లీ మెదెవెరె (84) జింబాబ్వేను ఓటమి బారి నుంచి గట్టెక్కించేందుకు విఫలయత్నం చేశాడు. మెదెవెరె, జోనాథన్ క్యాంప్‌బెల్ (33) జింబాబ్వే ఓటమిని కాసేపు అడ్డుకున్నారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో మెదెవెరె, జోనాథన్ క్యాంప్‌బెల్‌తో పాటు బ్రియాన్ బెన్నెట్ (45) రాణించాడు.
కాగా, ఐర్లాండ్ జట్టు ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఫిబ్రవరి 14, 16, 18 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఫిబ్రవరి 22, 23, 25 తేదీల్లో మూడు టీ20లు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment