
ముంబై: మహారాష్ట్రలో పుణెలో దారుణం చోటుచేసుకుంది. చిరుతపులి దాడిలో నాలుగేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. ఈ ఘోరం జున్నార్ తాలుకాలోని ఆలే గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. వ్యవసాయ పనులు చేసుకునే అమోల్ కుమారుడు నాలుగేళ్ల శివాన్ష్ బుజ్‌పాల్ ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా ఒక్కసారిగా అక్కడికి వచ్చిన చిరుత.. చిన్నారిని నోట కరుచుకొని పక్కనే ఉన్న చెరుకు తోటలోకి లాకెళ్లింది.
పక్కనే ఉన్న పొలంలో పనులు చేస్తున్న బాలుడి తాత..పిల్లాడి కేకలు విని అక్కడికి పరుగుతెత్తుకొచ్చాడు. బాలుడిని రక్షించేందుకు పొరుగున ఉన్న కొందరు సైతం కర్రలతో చెరుకు పొలాల్లోకి వెళ్లారు. అయితే అప్పటికేచిరుత బాలుడిని చాలా దూరం ఈడ్చుకెళ్లి.. కింద పడేయడంతో తల, మెడ, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
కాగా చిరుత పులులను పట్టుకునేందుకు అటవీ శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు ఆ ప్రాంతంలో నిరసనకు దిగారు. ఘటన తర్వాత ఆ ప్రాంతంలో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశామని, ట్రాప్ కేజ్‌లను ఏర్పాటు చేసే పనిలో ఉన్నామని అటవీ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా జున్నార్ అటవీ డివిజన్‌లో చిరుత దాడి చేయడం ఈ ఏడాది మూడోసారి. అంతేగాక పుణె జిల్లాలో జనవరి, ఏప్రిల్ మధ్య వేర్వేరు ప్రదేశాలలో ఇలాంటి సంఘటనలు నాలుగు చోటుచేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment