కలుపు మొక్కలను ఏరుతున్నారు | focused on corruption in the forest weeds | Sakshi
Sakshi News home page

కలుపు మొక్కలను ఏరుతున్నారు

Published Fri, Jan 10 2014 3:10 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

focused on corruption in the forest weeds

నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్ : అటవీశాఖలో కలుపు మొక్కలపై అవినీతి నిరోధకశాఖ దృష్టి సారించింది. కలుపు మొక్కలను కూకటి వేళ్లతో పెకలించే దిశగా ఏసీబీ పక్కా ప్రణాళికతో ముందుకు  వెళుతోంది. గతేడాది కాంట్రాక్టర్లను పీడించి లంచాలు వసూళ్లు చేస్తున్న అప్పటి ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారి గనీబాషాను కటకటాల వెనక్కి పంపిన విషయం విదితమే.
 
 తాజాగా డీఎఫ్‌ఓ నూకవరపు నాగేశ్వరరావును అరెస్ట్ చేసి తర్వాత ఆశాఖలోని కలుపు మొక్కల ఏరివేతపై దృష్టిసారించారు. డీఎఫ్‌ఓ అరెస్ట్ అనంతరం కాంట్రాక్టర్లు, అటవీశాఖ కార్యాలయ సిబ్బందిని ఏసీబీ అధికారులు పూర్తిస్థాయిలో విచారించారు. నెల్లూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి పిన్నబోయిన మారుతీ ప్రసాద్‌రావు డీఎఫ్‌ఓ నాగేశ్వరరావు బినామీగా వ్యవహరిస్తున్నారని ఏసీబీ అధికారుల విచారణలో వెల్లడైంది.
 
 దీంతో గురువారం జెడ్పీ కాలనీలోని బీఎమ్మార్ రెసిడెన్సీలోని ప్లాట్ నంబర్ 202లోని మారుతీప్రసాద్ నివాసంతో పాటు బుజబుజనెల్లూరులో నూతనంగా నిర్మిస్తున్న నాలుగంతస్తుల భవనంలో ఏకకాలంలో ఏసీబీ డీఎస్పీ జె. భాస్కర్‌రావు నేతృత్వంలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు టీవీ శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు సాయంత్రం వరకు కొనసాగించారు. సోదాల్లో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీంతో ఫారెస్ట్ రేంజర్‌ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. మారుతీప్రసాద్‌కు చెందిన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పుస్తకాలు, లాకర్ కీలు, బంగారు ఆభరణాలు, నగదు, ఆల్టోకారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.   
 నిబంధనలకు విరుద్ధంగా..
 గుంటూరు నగరం బ్రాడీపేటకు చెందిన మారుతీప్రసాద్ 2011 జూలై 11వ తేదీన నెల్లూరు ఫారెస్ట్ రేంజర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి డీఎఫ్‌ఓకు విధేయుడిగా ఉంటూ అప్పటి నుంచి బినామీగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో డీఎఫ్‌ఓ పేరిట భారీ స్థాయిలో నగదు వసూళ్లు చేసినట్లు తెలిసింది.
 
 2012 సెప్టెంబర్ 5వ తేదీన తన సతీమణి నాగచంద్రిక పెద్దనాన్న చిన్నయ్యకు చెందిన బుజబుజనెల్లూరులోని సర్వే నంబర్ 89లో 60 అంకణాల స్థలాన్ని దంపతులిద్దరి పేరిట రూ.5.76 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. 2013లో అపార్ట్‌మెంట్ నిర్మాణ పనులు చేపట్టారు. అపార్ట్‌మెంట్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నట్లు ఏసీబీ విచారణలో గుర్తించారు. రెండు అంతస్తులకే ప్రభుత్వ అనుమతి తీసుకున్న వీరు ఏకంగా నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. భవన నిర్మాణానికి సుమారు 60 లక్షలు నిధులు వెచ్చించామని చెబుతండగా, నిర్మాణ వ్యయం మాత్రం దానికి పదింతలు ఉన్నట్లు ఏసీబీ విచారణలో నిగ్గు తేలింది.
 
 ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎక్కడి నుంచి  వచ్చిందో ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. నిర్మాణానికి  వెచ్చించిన నిధుల్లో రూ.19 లక్షలు తమవని, మిగిలిన మొత్తం బృందావనంలోని రెప్‌కో బ్యాంకు నుంచి తీసుకున్నట్లు మారుతీప్రసాద్ ఏసీబీ అధికారులకు వివరించారు. దీంతో బ్యాంకు నుంచి లోను తీసుకునేందుకు గ్యారెంటీగా ఏమి చూపారనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఆ బ్యాంకుకు సైతం గురువారం సాయంత్రం నోటీసులు పంపారు. ఎన్ని అంతస్తులకు అనుమతి తీసుకున్నారు?ఎవరి వద్ద నుంచి అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్న స్థలాన్ని కొనుగోలు చేశారు? ఎంతకు కొనుగోలు చేశారో తెలుసుకునేందుకు కార్పొరేషన్, సబ్‌రిజిస్ట్రార్, పంచాయతీ అధికారులను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. అపార్ట్‌మెంట్ నిర్మాణంలో డీఎఫ్‌ఓ పెట్టుబడులు కూడా ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయి.
 
 ఆది నుంచి అవినీతి ముద్రే
 నెల్లూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి మారుతీప్రసాద్ ఆది నుంచి అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్నారు. ఆయన 2006 మే 8వ తేదీన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాళెం ఫారెస్ట్ రేంజర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ రేంజ్ పరిధిలోని కవలకుంట్లలో నివాసముంటున్న లంబాడీల వద్ద నుంచి ఓ కేసు విషయమై 2008లో రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో 2008 సెప్టెంబర్ 6వ తేదీన ఆయన్ను అటవీశాఖ ఉన్నతాధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. 2009 ఏప్రిల్ 2వ తేదీన సస్పెన్షన్ ఎత్తివేసి జిల్లాలోని నేలపట్టు ఫారెస్ట్ రేంజర్‌గా నియమించారు. 2011 జూలై 11వ తేదీన నెల్లూరు ఫారెస్ట్ రేంజర్‌గా బదిలీ అయ్యారు. డీఎఫ్‌ఓకు మధ్యవర్తిగా వ్యవహరించి కాంట్రాక్టర్లు, బొగ్గుబట్టీల వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, ఎర్రచందనం స్మగ్లర్లు తదితరుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. డీఎఫ్‌ఓ అవినీతి, అక్రమాల పుట్టల నేపథ్యంలో జిల్లాలోని పలు రేంజ్‌ల పరిధిలో పని చేస్తున్న రేంజర్ల వివరాలను సేకరిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement