నెల్లూరు (వేదాయపాళెం),న్యూస్‌లైన్: రంగ..రంగ..రంగపతి..రంగనాథా.. అంటూ శ్రీమన్నారాయణుడి నామస్మరణతో భక్తులు ఉత్తరద్వారంలో వైకుంఠవాసుడైన శ్రీరంగనాథున్ని దర్శించుకృన్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శనివారం జిల్లా వ్యాప్తంగా ఉన్న వైష్ణవాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. వేకువన శ్రీవారికి వైకుంఠద్వారంలో దర్శనం చేసుకున్న భక్తులు ఆనంద పారవశ్యులయ్యారు. అర్చక బృందాల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి . తల్పగిరి రంగనాథుని ఆలయం, పెంచలకోన లక్ష్మీనృసింహస్వామి సన్నిధి, నరసింహకొండలోని నృసింహస్వామి, కావలి, ఆత్మకూరు, గూడూరు తదితర ప్రాంతాల్లోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు నేత్రపర్వంగా కొనసాగాయి.
రంగనాథునికి విశేష పూజలు
నెల్లూరు రంగనాయకులపేటలోని తల్పగిరి రంగనాథస్వామివారు ఉభయనాంచారుల సమేతంగా వేకువన ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చారు. ఆలయ ప్రధానార్చకులు కిడాంబి జగన్నాథాచార్యుల ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ప్రభాతవేళే ముక్కోటి పూజలను ప్రారంభించారు. గర్భాలయ ముఖ మండపంలో సర్వాలంకార శోభితులై ఉభయనాంచారీ సమేతంగా శ్రీరంగనాథస్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు.
సంప్రదాయం ప్రకారం నమ్మాళ్వార్‌కు తొలిదర్శనం అయిన వెంటనే భక్తుల జయజయ ధ్వానాలు, మంగళ వాయిద్యాలు, తిరుచిహ్నం వాయిద్య ఘోషల నడుమ వైకుంఠద్వారం తలుపులు తెరుచుకున్నాయి. శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీరంగనాథుడు వైకుంఠ ద్వారంలో దర్శనమిస్తూ భక్తజనులను కరుణించారు. ప్రదక్షణోత్సవం కనులపండువగా సాగింది. అనంతరం వైకుంఠ ద్వారం రంగనాథుని మూలమూర్తిని దర్శించుకునేందుకు భక్తులను అనుమతించారు.
రాత్రి రాపత్తు అధ్యయనోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. స్వరలహరి ఆర్కెస్ట్రా వారి భక్తిరంజని అలరించింది. అన్ని ఆలయాలకు చేసిన పూలంగి సేవ ఆకట్టుకుంది. కొలపర్తి రమేష్‌బాబు మిత్రబృందం ప్రసాద వితరణ చేసింది. ఈఓ పాయసం నాగేశ్వరరావు, దేవాదాయశాఖ జిల్లా ఏసీ వేగూరు రవీంద్రరెడ్డి, ఇన్‌స్పెక్టర్లు శైలేంద్ర, వెంకటరమణ, సూపరింటెండెంట్ సుధాకర్, ఆలయ చైర్మన్ దుగ్గిశెట్టి భారతి, కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఉభయకర్తలుగా ఆనం వెంకటరమణమ్మ, కంచర్ల ఠాగూర్‌నాధ్, కిశోర్‌నాథ్, చండూరు వసుంధరమ్మ, రౌతు నరసింహారావు, గుండ్లపల్లి సుదర్శన్, వేళ్ల సిద్దయ్యనాయుడు, రాజాహజరత్తయ్య వ్యవహరించారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, ఎస్పీ రామకృష్ణ పాల్గొన్నారు.
పోటెత్తిన భక్తులు...
రంగనాథుడ్ని ఉత్తర ద్వారంలో దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులతో తల్పగిరి పోటెత్తింది. జిల్లా నలుమూలల నుంచే కాక పొరుగు జిల్లాలు, తమిళనాడు నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. ఇటు చంద్రమండలం, తూర్పువీధిలో చివర వరకు భక్తులు బారులుదీరారు. దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది.
రంగనాథుని సేవలో కళాతపస్వి...
కళాతపస్వి, దర్శకుడు కె.విశ్వనాథ్ రంగనాథుని సేవలో తరించారు. ప్రభాతవేళ ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి ప్రసాదాలు అందజేశారు.
వేణుగోపాలుని సన్నిధిలో..
మూలాపేటలోని రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలుని దేవస్ధానంలో స్వామివారు వైకుంఠ ద్వారంలో భక్తజనులకు దర్శనమిచ్చారు. అక్కడ స్వామివారిని కొలువుదీర్చి వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు. గోపాలుని మూలవర్లు చందనాలంకారంలో భక్తులను కరుణించారు. ప్రత్యేక పూలంగిసేవ జరిగింది. కళాకారులు ఆలపించిన భక్తిగీతాలు అలరించాయి. సాయంత్రం ఉభయ నాంచారులతో కలిసి స్వామివారు సమీప ప్రాంతాల్లో విహంచారు. భక్తులకు తీర్ధప్రసాదాలను వితరణ చేశారు. కార్యక్రమాలను మేనేజర్ కృష్ణ పర్యవేక్షించారు.
రంగా.. పాండురంగా..
Published Sun, Jan 12 2014 3:14 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement